WI vs IND: టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ విజయం

వెస్టిండీస్ పర్యటనలో భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియాపై కరీబియన్‌ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 30 Jul 2023 07:24 IST

బార్బడోస్: వెస్టిండీస్ పర్యటనలో భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియాపై కరీబియన్‌ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమం అయింది. తొలుత విండీస్‌ బౌలర్ల ధాటికి టీమ్‌ఇండియా 181 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌మన్‌ గిల్ (34) మాత్రమే రాణించారు. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4  ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్‌ బ్యాటర్లలో షై హోప్ (63*; 80 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. కార్టీ (48*; 65 బంతుల్లో 4 ఫోర్లు),  కైల్ మేయర్స్‌ (36) కూడా మెరిశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, కుల్‌దీప్ యాదవ్‌ ఒక వికెట్ పడగొట్టారు. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం (ఆగస్టు 01)న జరగనుంది. 

మోస్తరు లక్ష్యఛేదనలో విండీస్‌కు ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (15), కైల్ మేయర్స్‌ శుభారంభం అందించారు. బ్రెండన్ నెమ్మదిగా ఆడినా కైల్ మేయర్స్‌ దూకుడు ప్రదర్శించాడు. ముకేశ్ కుమార్‌ వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు.. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఓ బంతిని నేరుగా బౌండరీ అవతలికి పంపించాడు. మేయర్స్‌ దూకుడుకు శార్దూల్ ఠాకూర్‌ చెక్‌ పెట్టాడు. అతడు వేసిన తొమ్మిదో ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాదిన విండీస్‌ ఓపెనర్ తర్వాతి బంతికే ఉమ్రాన్‌ మాలిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శార్దూల్ అదే ఓవర్లో బ్రెండన్ కింగ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కొద్దిసేపటికే శార్దూల్ బౌలింగ్‌లోనే అథనేజ్ (6) కూడా పెవిలియన్‌ చేరాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్‌మయర్ (9)ని కుల్‌దీప్‌ యాదవ్‌ క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న షై హోప్‌.. కార్టీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. భారత బౌలర్లు వికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. ఎక్కువగా సింగిల్స్‌ తీస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. హోప్‌ 70 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హార్దిక్‌ బౌలింగ్‌లో కార్టీ వరుసగా రెండు ఫోర్లు బాది విండీస్‌కు విజయాన్ని అందించాడు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్ గిల్ అదిరే ఆరంభం అందిచారు. వీరిద్దరూ నిలకడ ఆడటంతో 90 పరుగుల వరకు  వికెట్టే పడలేదు.  కానీ ఆ తర్వాతే కథ మలుపుతిరిగింది. 91 పరుగుల వ్యవధిలో 10 వికెట్లనూ కోల్పోయి 181 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్‌, గిల్ వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. అక్షర్‌ పటేల్‌ (1), సంజు శాంసన్‌ (9),  కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కేవలం 13 పరుగుల వ్యవధిలో భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 90/0 నుంచి 113/5కు చేరుకుంది. 

ఈ క్రమంలోనే వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గి మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. ఆదుకుంటారనుకున్న జడేజా (10), సూర్యకుమార్‌ కూడా పెవిలియన్‌ చేరారు. కాసేపు నిలకడగా ఆడిన శార్దూల్ ఠాకూర్ (16) జోసెఫ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత ఉమ్రాన్ మాలిక్ (0), ముకేశ్‌ కుమార్ (6) వెనుదిరగడంతో భారత్ ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 3, మోతీ 3, జోసెఫ్‌ 2, సీల్స్‌, కరియా ఒక్కో వికెట్ పడగొట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని