Virat Kohli: అనుష్కను చూసి వణికిపోయా: విరాట్‌ కోహ్లీ

అనుష్కశర్మ (Anushka Sharma)ను తొలిసారి చూసినప్పుడు కాస్త వణుకుపుట్టిందని, ఆమెతో ఎలా మాట్లాడాలో తెలియక గందరగోళానికి గురయ్యానని విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అన్నాడు.

Updated : 21 Mar 2023 20:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), అతడి భార్య అనుష్క శర్మ (Anushka Sharma) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పెళ్లికి ముందు, ఆ తర్వాత కూడా ఈ జంట ఏం చేసినా సెన్సేషనే. 2017లో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ వాళ్లవాళ్ల కెరీర్‌తో బిజీబిజీగా ఉన్నారు. అయితే, ఈ ఇద్దరి గురించి అసలు ఇప్పుడెందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? Three Sixty యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘చాట్‌ షో విత్‌ ఏబీ డివిలియర్స్’ కార్యక్రమంలో విరాట్‌ కోహ్లీ పాల్గొన్నాడు. అనుష్కతో తొలిసారి ఎలా పరిచయమైందో? తొలినాళ్లలో వాళ్లిద్దరూ ఎలా ఉండేవాళ్లో?డేటింగ్‌కు ముందు వాళ్లిద్దరి మధ్య మాటామంతీ ఎలా ఉండేవో?లాంటి విషయాలను పంచుకున్నాడు.

వీళ్ల తొలిపరిచయం ఓ టీవీ కమర్షియల్‌ యాడ్‌ షూటింగ్‌ సందర్భంగా జరిగిందట. మొదటిసారి అనుష్కను చూసిన సమయంలో వణికిపోయానని, భయంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇంకేమన్నాడో ఆయన మాటల్లోనే.. ‘‘ అది 2013 అనుకుంటా. జింబాబ్వే పర్యటనకు నేనే కెప్టెన్‌ అని జట్టు యాజమాన్యం ప్రకటించింది. నేను ఎంతో ఉద్వేగానికి గురయ్యా. అంతలోనే మా మేనేజర్‌ వచ్చి టీవీ కమర్షియల్‌ యాడ్‌ చెయ్యాలని చెప్పారు. అది కూడా అనుష్క శర్మతో అన్నారు. వెంటనే నా గుండెల్లో రాయి పడినట్లయింది. అమె అప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్న స్టార్‌ యాక్టర్‌ కావడంతో నాలో చిన్నగా వణుకుపుట్టింది. అసలు ఆమెకు ‘హాయ్‌’ ఎలా చెప్పాలో.. ఎలా మాట కలపాలో, యాడ్‌లో ఆమె పక్కన ఎలా నటించాలో అర్థం కాలేదు. ఒకటే గందరగోళం. అక్కడికి 5 నిమిషాల తర్వాత లోకేషన్‌కి వెళ్లా. ఆమె చాలా ఎత్తుగా కనిపించింది. కిందకి చూస్తే.. హై హీల్స్‌ వేసుకొని ఉంది. అంతే.. దీనికంటే ఇంకా ఎత్తు చెప్పులు మీకు దొరకలేదా? అని అన్నా.. ఆమె అదోలా చూసింది. ఆ తర్వాత  యాడ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. రోజంతా షూటింగ్‌ నడిచింది. ఆ రోజే ఆమె కూడా చాలా సాధారణమైన అమ్మాయని అర్థమైంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కుటుంబ విషయాలే ఎవరినైనా మరింత దగ్గర చేస్తాయి. మమ్మల్ని కూడా అవే దగ్గర చేశాయి. ఇద్దరి కుటుంబాలు సామాన్య మధ్యతరగతివే కావడంతో తొందరగా కనెక్ట్‌ అయిపోయాం.’’ అని విరాట్‌ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అనుష్కశర్మతో డేటింగ్‌కు ముందు ఆమెకు రెండు సందర్భాల్లో ఇబ్బందికరమైన మెసేజ్‌లు పెట్టినట్లు కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ‘‘ మా ఇద్దరం పరిచయం అయిన వెంటనే డేటింగ్‌లో లేము. చాలా రోజులు మాట్లాడుకున్నాం. అయినా, తొలి రోజు నుంచే ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లే అనిపించింది. పరిచయం అయిన కొద్దిరోజులకే ఆమె నా సొంతం అనుకున్నాను. ఓ రోజు మాటల సందర్భంలో ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లే అనిపిస్తోందని మెసేజ్‌ పెట్టాను. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నట్లనిపించింది. ఆ మ్యాటర్‌ అక్కడితో వదిలేసి ఏవేవో మాట్లాడుకున్నాం. ఖాళీ సమయాల్లో ఇద్దరం పిచ్చాపాటీగా మాట్లాడుకునేవాళ్లం.ఒక రోజు నా గురించి ఏమనుకుంటున్నావ్‌ అని అడిగింది. దీంతో మనిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లుందని చెప్పా. అప్పుడు కూడా ఆమె కొద్దిగా ఇబ్బంది పడినట్లనిపించింది. క్రమంగా నా మనసును అర్థం చేసుకుంది. నన్ను ఓ మంచి వ్యక్తిగా గుర్తించింది’’ అంటూ కోహ్లీ చెప్పేసరికి పొట్టచక్కలయ్యేలా నవ్వడం డివిలియర్స్‌ వంతైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని