IPL 2022: పంత్‌తో కలిసి ఆడాలని ఉంది: యశ్‌ ధుల్‌

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకూర్పులో భారీ మార్పులు చేసింది. పలువురు సీనియర్‌ ఆటగాళ్లను పక్కన పెట్టిన దిల్లీ యాజమాన్యం యువ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన యశ్ ధుల్‌..

Published : 17 Mar 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు కూర్పులో భారీ మార్పులు చేసింది. పలువురు సీనియర్‌ ఆటగాళ్లను పక్కన పెట్టిన దిల్లీ యాజమాన్యం యువ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన యశ్ ధుల్‌, విక్కీ ఓత్స్వాల్‌లను వేలంలో కొనుగోలు చేసింది. ఇటీవల ముంబయి చేరుకున్న ఈ యువ ఆటగాళ్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ వీడియోను దిల్లీ క్యాపిటల్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 

‘నేను తొలిసారి ఐపీఎల్‌లో ఆడుతున్నాను. వీలైనంత వరకు మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తా. కెప్టెన్‌ రిషభ్ పంత్‌, డేవిడ్‌ వార్నర్‌లతో కలిసి ఆడాలని ఉంది. అలాగే, మా జట్టు హెడ్ కోచ్‌ రికీ పాంటింగ్‌ను కలవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అని యశ్ ధుల్‌ అన్నాడు.

‘టీవీల్లో ఐపీఎల్ చూడటం దగ్గర నుంచి.. ఐపీఎల్‌లో ఆడే అవకాశం దొరకడం వరకు చాలా దూరం ప్రయాణించాను. సీనియర్‌ ఆటగాళ్లను, కోచింగ్‌ స్టాఫ్‌ను కలవడం మరిచిపోలేని అనుభూతి. వీలైనంత త్వరగా అక్షర్‌ పటేల్‌ని కలవాలి. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా అతడే నాకు ఆదర్శం. టీ20ల్లో ఎలా బౌలింగ్‌ చేయాలనే విషయంలో అతడి నుంచి కొన్ని సలహాలు తీసుకుంటాను. క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్, ప్రవీణ్‌ అమ్రే వంటి కోచ్‌లతో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి’ అని విక్కీ ఓత్స్వాల్‌ పేర్కొన్నాడు. 

‘దిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. తొలి సారిగా ఐపీఎల్‌లో ఆడుతుండటంతో కాస్త నెర్వస్‌గా ఉంది. అయితే, ఒక్కసారి బ్యాటింగ్‌ చేయడం మొదలు పెడితే మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తా’ అని అశ్విన్‌ హెబ్బర్ చెప్పాడు. ఇదిలా ఉండగా, దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మార్చి 27న ముంబయి ఇండియన్స్‌ జట్టుతో తలపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని