WTC Final - IND VS AUS: అందేనా గద.. ఈసారైనా!
క్రికెట్ అభిమానులు టీ20 మత్తును వీడి టెస్టు మజాను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. రెండేళ్ల టెస్టు ఛాంపియన్‌షిప్ క్రతువు.. అంతిమ ఘట్టంలోకి అడుగు పెట్టేస్తోంది.
నేటి నుంచే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్
ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
కంగారూ బౌలింగ్‌తోనే అసలు ముప్పు
మధ్యాహ్నం 3 నుంచి
విరాట్ కోహ్లి, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె.. సచిన్ తరం దిగ్గజాల తర్వాత చాలా ఏళ్ల పాటు భారత టెస్టు బ్యాటింగ్ మూల స్తంభాలు వీళ్లే! కాస్త ఆలస్యంగా టెస్టు జట్టులోకి వచ్చినా.. తనదైన ముద్ర వేశాడు రోహిత్ శర్మ. ఇప్పుడతను జట్టు సారథి కూడా. వీరికి తోడు బౌలింగ్‌లో అశ్విన్, జడేజా, షమి లాంటి మేటి ఆటగాళ్లూ కెరీర్ చరమాంకంలోనే ఉన్నారు.
వీళ్లంతా ఇంకా ఎన్నో ఏళ్లు జట్టులో కొనసాగకపోవచ్చు! ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇంకో ఫైనల్ ఆడతారని గ్యారెంటీ లేదు. ఇప్పటికే ఒక ఫైనల్ ఆడి నిరాశనే మూటగట్టుకున్న ఈ సీనియర్లకు ఇంకో అవకాశం వచ్చింది.
మరోసారి ఇంగ్లాండ్ వేదికగా మరో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమైంది టీమ్‌ఇండియా. కానీ ఈసారి న్యూజిలాండ్ కన్నా కఠిన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాతో సమరం! మరి కంగారూల కఠిన సవాల్‌ను కాచుకుని టీమ్‌ఇండియా ఈసారైనా టెస్టు ఛాంపియన్‌షిప్ గదను అందుకుంటుందా?
లండన్
క్రికెట్ అభిమానులు టీ20 మత్తును వీడి టెస్టు మజాను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. రెండేళ్ల టెస్టు ఛాంపియన్‌షిప్ క్రతువు.. అంతిమ ఘట్టంలోకి అడుగు పెట్టేస్తోంది. ఈ రెండేళ్లు నిలకడగా రాణించి ఫైనల్ చేరిన భారత్, ఆస్ట్రేలియా టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఓవల్ మైదానంలో బుధవారం నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్. తొలి డబ్ల్యూటీసీ తుది పోరులో న్యూజిలాండ్ పేస్ సవాలును కాచుకోలేక ఓటమి పాలైన భారత్.. ఆ మ్యాచ్ జరిగిన ఇంగ్లాండ్‌లోనే భీకర ఆసీస్ పేస్ దాడిని ఎలా కాచుకుంటుందన్నది ఆసక్తికరం. ఆసీస్ పేస్ బౌలర్లకు, భారత స్టార్ బ్యాటర్లకు పోరుగా ఈ మ్యాచ్‌ను అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో.. వాళ్లకే టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీ దక్కొచ్చు. గత పర్యాయం కోహ్లి భారత జట్టును నడిపిస్తే.. ఈసారి రోహిత్ నాయకత్వంలో టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాకు పేసర్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నాడు.
వీళ్లు నిలవాలి..: తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ముంగిట ఐపీఎల్ ముగించుకుని ఇంగ్లాండ్‌కు చేరుకుంది భారత జట్టు. లీగ్ తాలూకు అలసట.. ఇంగ్లాండ్ పరిస్థితులు, అలాగే టెస్టు క్రికెట్‌కు వెంటనే అలవాటు పడలేకపోవడం.. భారత్‌కు ప్రతికూలంగా మారాయి. పేస్, స్వింగ్ పరిస్థితులను ఉపయోగించుకుని కివీస్ పేసర్లు భారత బ్యాటర్లను దెబ్బ తీశారు. బౌలర్లు రాణించినా.. బ్యాటింగ్ వైఫల్యంతోనే భారత్ మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో మరోసారి బ్యాట్స్‌మెన్ ప్రదర్శన ఎలా ఉంటుందో అన్న ఆందోళన నెలకొంది. రోహిత్, శుభ్‌మన్, పుజారా, కోహ్లి, రహానెలతో కాగితం మీద భారత బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. కానీ అసలు పోరులో ఈ లైనప్ ఏమేర రాణిస్తుందన్నదే ప్రశ్నార్థకం. శుభ్‌మన్ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. అనుభవ లేమిని ఎలా అధిగమిస్తాడో, ఇంగ్లాండ్ పరిస్థితులను ఎలా కాచుకుంటాడో చూడాలి. రోహిత్‌కు ఇంగ్లాండ్‌లో అనుభవం, మంచి రికార్డున్నా.. ఇటీవల సరైన ఫామ్‌లో లేడు. వీళ్లిద్దరూ కలిసి జట్టుకు ఎలాంటి ఆరంభాన్నిస్తారన్న దాన్ని బట్టి మ్యాచ్ గమనమే ఆధారపడి ఉండొచ్చు. స్టార్క్, కమిన్స్, బోలాండ్‌లతో కూడిన ఆసీస్ పేస్ త్రయాన్ని కాచుకోవడం వీరితో పాటు మిగతా బ్యాటర్లకూ సవాలే. మిగతా బ్యాటర్లంతా ఐపీఎల్ ఆడుతుంటే.. కౌంటీ క్రికెట్ ఆడుతూ పరుగుల వరద పారించిన పుజారా బ్యాటింగ్‌లో అత్యంత కీలకం అవుతాడని భావిస్తున్నారు. ఇక పేలవ ఫామ్ నుంచి బయటపడి గత కొన్ని నెలల్లో వివిధ ఫార్మాట్లలో దండిగా పరుగులు సాధించిన కోహ్లి.. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన విలువను చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో విరాట్‌కు భారత బ్యాటర్లందరిలో మెరుగైన రికార్డుంది. సీనియర్ బ్యాటర్ రహానె కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. కొన్నేళ్లుగా భారత్‌ను అనేకసార్లు ఆదుకున్న లోయరార్డర్ ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి. జడేజా బ్యాటింగ్‌లోనూ కీలకమే. నాలుగో పేసర్‌గా సేవలందించనున్న ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, స్పిన్నర్ లైయన్‌లను కూడా భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిందే. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే లైయన్‌ను ఎదుర్కోవడం తేలిక కాదు.
వారిని ఆపాలి..: వార్నర్, ఖవాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ.. ప్రపంచంలో ఎలాంటి బౌలింగ్‌కైనా కంగారు పెట్టించే టెస్టు బ్యాటింగ్ లైనప్ ఇది. వార్నర్ ఇటీవల సరైన ఫామ్‌లో లేకపోయినా.. భారత బౌలింగ్‌పై అతడికి మంచి అవగాహన ఉంది. ఖవాజా కొన్నేళ్లుగా స్థిరంగా రాణిస్తున్నాడు. లబుషేన్ అరంగేట్రం నాటి నుంచి పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి బౌలింగ్‌నైనా అలవోకగా ఎదుర్కొని శతకాల మోత మోగించే స్టీవ్ స్మిత్ గురించి చెప్పాల్సిన పని లేదు. హెడ్ సైతం భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. గ్రీన్, కేరీ కూడా ఉపయుక్తమైన బ్యాటర్లే. ఈ లైనప్‌కు షమి, సిరాజ్, ఉమేశ్, జడేజా ఏమేర కళ్లెం వేస్తారన్నది కీలకం. ముఖ్యంగా ఖవాజా, లబుషేన్, స్మిత్‌లతోనే భారత్‌కు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. ఈ ముగ్గురినీ ఆరంభంలోనే ఆపకపోతే.. భారీ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను దూరం చేసేస్తారు. షమి అనుభవం, సిరాజ్ ఫామ్‌పై భారత్ చాలా ఆశలే పెట్టుకుంది. బుమ్రా లేని లోటును ఈ ఇద్దరూ కనిపించకుండా చేస్తారని జట్టు ఆశిస్తోంది. పిచ్‌ను బట్టి నాలుగో పేసర్‌గా శార్దూల్ లేదా రెండో స్పిన్నర్‌గా అశ్విన్ ఆడొచ్చు. వీళ్లిద్దరూ బంతితోనే కాక బ్యాటుతోనూ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
తుది జట్లు (అంచనా).. భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, పుజారా, కోహ్లి, రహానె, కేఎస్ భరత్/ఇషాన్, జడేజా, శార్దూల్/అశ్విన్, ఉమేశ్, షమి, సిరాజ్. ఆస్ట్రేలియా: వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కేరీ, లైయన్, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, బోలాండ్.
ఛాంపియన్‌షిప్‌లు గెలవాలనుకుంటున్నా: రోహిత్
‘‘నేను కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు లేదా నాకన్నా ముందు వాళ్లు కావొచ్చు... వాళ్ల బాధ్యత భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే. వీలైనన్ని మ్యాచ్‌లు, ఛాంపియన్‌షిప్‌లు గెలవడమే. నా భావన కూడా అదే. నేను మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నా. ఛాంపియన్‌షిప్‌లు గెలవాలనుకుంటున్నా. ప్రతి కెప్టెనూ పెద్ద ట్రోఫీలు గెలవాలనుకుంటాడు. నేనేమీ భిన్నం కాదు. క్రీడలంటే టైటిళ్లు నెగ్గడమే. అయితే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మమ్మల్ని మేము ఒత్తిడిలోకి నెట్టుకోవాలనుకోవట్లేదు’’
* ఓవల్‌లో 14 టెస్టులాడిన భారత్ రెండు నెగ్గి, అయిదు ఓడింది. ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక్కడ 38 టెస్టులాడిన ఆసీస్.. ఏడు నెగ్గి, 17 ఓడింది. మిగతా మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
4
ఆస్ట్రేలియాతో ఆడిన చివరి నాలుగు టెస్టు సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయం. సొంతగడ్డపై రెండు, ఆస్ట్రేలియాలో రెండు సిరీస్‌లు సాధించింది. అన్నీ 2-1తోనే భారత్ సొంతమయ్యాయి.
21
ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లికి అవసరమైన పరుగులు.
391
ఓవల్‌లో ఆడిన మూడు టెస్టుల్లో స్టీవ్ స్మిత్ పరుగులు. సగటు 97.75. అందులో రెండు శతకాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!
-
Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
India Canada Row: ‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’