T20 League: ఈ హైదరాబాదీ యువకుడు తప్పకుండా భారత్‌కు ఆడతాడు: గావస్కర్

 టీ20 లీగ్‌లో అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిన జట్టు ముంబయి. అయితే ఆ జట్టులో సూర్యకుమార్‌యాదవ్‌ కాకుండా మరొక యువ ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. టాప్‌ ప్లేయర్లు విఫలమవుతున్న వేళ...

Published : 17 May 2022 17:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిన జట్టు ముంబయి. అయితే ఆ జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ కాకుండా మరొక యువ ఆటగాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. టాప్‌ ప్లేయర్లు విఫలమవుతున్న వేళ 19 ఏళ్ల హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టేశాడు. మెగా వేలంలో ముంబయి యాజమాన్యం తిలక్‌ వర్మను రూ. 1.70 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు 12 మ్యాచులకుగానూ 368 పరుగులు చేసిన తిలక్‌ వర్మనే ముంబయి జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.  ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ రాణిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తిలక్‌ వర్మపై సునిల్ గావస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 

‘‘క్రికెట్‌కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను అందిపుచ్చుకున్నాడు. టెక్నికల్‌గా చాలా బాగా ఆడుతున్నాడు. స్ట్రైట్‌ బ్యాట్‌ వినియోగించడం వల్ల ఎలాంటి బంతినైనా అలవోకగా ఎదుర్కొంటున్నాడు. టెక్నిక్‌తోపాటు దూకుడు కలిగి ఉండటం తిలక్‌ వర్మకు కలిసొచ్చింది. రోహిత్ శర్మ చెప్పినట్లుగా తిలక్ అన్ని ఫార్మాట్లకు తగ్గ బ్యాటర్. భారత్‌ తరఫున కచ్చితంగా ఆడతాడు. అయితే ఇంకొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి’’ అని గావస్కర్ సూచించాడు. ఇవాళ హైదరాబాద్‌తో ముంబయి తలపడనుంది. ప్లేఆఫ్స్‌ రేసులో సాంకేతికంగానైనా నిలవాలంటే హైదరాబాద్‌ తప్పక గెలవాలి. మరోవైపు ముంబయికి ఎలాంటి ఛాన్సులు లేవు. ఈ క్రమంలో హైదరాబాద్ ఆశలపై ముంబయి నీళ్లు చల్లుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని