విండోస్‌ 7 నుంచి 11కి.. సాధ్యమేనా..?

మైక్రోసాఫ్ట్ కొత్త విండోస్‌ తీసుకొస్తుందన్న వార్త యూజర్స్‌కి ఎంత సంతోషాన్ని కలిగించిందో..అప్‌డేట్‌ కోసం కంప్యూటర్‌లో కొన్ని తప్పనిసరి ఫీచర్లు ఉండాలన్న నిబంధన అంతే నిరుత్సాహపరిచింది. అలానే విండోస్‌ 10 యూజర్స్‌కి మాత్రమే విండోస్‌ 11కి అప్‌డేట్ వస్తుందని వెల్లడించింది...

Published : 09 Jul 2021 23:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిందన్న వార్త యూజర్స్‌కి ఎంత సంతోషాన్ని కలిగించిందో.. అప్‌డేట్‌ కోసం కంప్యూటర్‌లో కొన్ని తప్పనిసరి ఫీచర్లు ఉండాలన్న నిబంధన అంతే నిరుత్సాహపరిచింది. విండోస్‌ 10 యూజర్స్‌కి మాత్రమే విండోస్‌ 11కి అప్‌డేట్ వస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా విండోస్‌ 11 ఇన్‌స్టాలేషన్‌కు అవసరమైన ఫీచర్లు కంప్యూటర్‌లో ఉన్నాయో లేదో చెప్పేందుకు పీసీ హెల్త్‌ చెక్‌ యాప్‌ పేరుతో ఒక యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఆ యాప్‌ సరిగా పనిచేయడంలేదని గుర్తించిన మైక్రోసాఫ్ట్ తాత్కాలికంగా దాని సేవలను నిలిపివేసింది. త్వరలోనే యాప్‌ను అప్‌డేట్ చేసి తీసుకొస్తామని ప్రకటించింది. మరోవైపు విండోస్‌ 7 యూజర్స్‌ కూడా విండోస్‌ 11కి అప్‌గ్రేడ్ కావొచ్చని కంప్యూటర్ తయారీ సంస్థ లెనోవో చెబుతోంది. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా విండోస్‌ 11 ఎఫ్ఏక్యూ పేజ్‌ను ప్రచురించింది.

ఇందులో ప్రస్తుతం విండోస్‌ 7 ఉపయోగిస్తున్నవారు విండోస్‌ 11కి అప్‌డేట్ కావొచ్చని లెనోవో పేర్కొంది. ఇందుకోసం యూజర్స్ తమ కంప్యూటర్లలో విండోస్‌ 7ను తొలగించి కొత్తగా విండోస్‌ 11ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. అంటే కంప్యూటర్‌లో మీ డేటా మొత్తం బ్యాక్‌అప్ తీసుకొని తర్వాత విండోస్‌ 7 డిలీట్ చేసి విండోస్‌ 11ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే విండోస్‌ 11ని సపోర్ట్ చేసే ఫీచర్స్‌ ఉన్న కంప్యూటర్‌లో ఇప్పటికీ విండోస్‌ 7 వాడుతున్న యూజర్స్‌కి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. విండోస్ 11 కోసం మీ కంప్యూటర్‌లో 8 జనరేషన్ చిప్‌, 64 బిట్ ప్రాసెసర్‌, 1జీహెచ్‌జడ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఫ్రీ స్టోరేజ్‌ ఉండాలని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని