Chandrayaan-3: చందమామ అందం చందం

ఇప్పుడు ఎవరి నోట విన్నా చంద్రుడి మాటే. మన చంద్రయాన్‌-3 ప్రయోగం సఫలం కావటం.. అనితర సాధ్యమైన రీతిలో విక్రమ్‌ ల్యాండర్‌ దక్షిణ ధ్రువం మీద దిగటం.. ప్రజ్ఞాన్‌ రోవర్‌ చక్కర్లు కొట్టటం.. సమాచారాన్ని సేకరించటం.. తర్వాత నిద్రాణ స్థితిలోకి చేరుకోవటంతో జాబిల్లి పేరు మారు మోగుతోంది

Updated : 12 Sep 2023 23:51 IST

ఇప్పుడు ఎవరి నోట విన్నా చంద్రుడి మాటే. మన చంద్రయాన్‌-3(Chandrayaan-3) ప్రయోగం సఫలం కావటం.. అనితర సాధ్యమైన రీతిలో విక్రమ్‌ ల్యాండర్‌ దక్షిణ ధ్రువం మీద దిగటం.. ప్రజ్ఞాన్‌ రోవర్‌ చక్కర్లు కొట్టటం.. సమాచారాన్ని సేకరించటం.. తర్వాత నిద్రాణ స్థితిలోకి చేరుకోవటంతో జాబిల్లి పేరు మారు మోగుతోంది. నిజానికి అక్కడేముందో తెలుసు కోవటానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. భూమికి వెలుపల గ్రహాలు, ఉపగ్రహాల్లో మనిషి పాదం మోపింది ఒక్క చంద్రుడి మీదే. ఆర్టెమిస్‌ కార్యక్రమంలో భాగంగా మరోసారి వ్యోమగాములను అక్కడికి పంపాలని నాసా ప్రయత్నాలు చేస్తోంది. మనదేశమూ మానవ సహిత ప్రయోగాల కోసం సిద్ధమవుతోంది. ఇంతకీ చంద్రుడి మీద మనకు ఇంత ఆసక్తి ఎందుకు? అక్కడి విశేషాలేంటి?


ఢీ కొట్టటంతో పుట్టి!

సహజ ఉపగ్రహమే అయినా భూమికి చంద్రుడి చల్లటి ఊపు చాలా కీలకం. భూమి తన అక్షం మీద కాస్త ఊగిసలాడటానికి, మరింత నివాసయోగ్యంగా మారటానికి కారణం చంద్రుడే. అతడి మూలంగానే వాతావరణం స్థిరంగా ఉంటుంది. సముద్రంలో అలలు ఏర్పడటంలో ప్రధాన భూమిక పోషించేదీ చంద్రుడే. అందుకే మనకు అంత ఆసక్తి. నిజానికి భూమి నుంచే చంద్రుడు పుట్టుకొచ్చాడన్నది శాస్త్రవేత్తల భావన. దీనికి కారణం భూమిని మరో చిన్న గ్రహం ఢీకొట్టటమే. తొలిదశలో మన భూమి ఇప్పటికన్నా పెద్దగా ఉండేది. ఇది ఏర్పడుతున్న సమయంలోనే సుమారు అంగారకుడి పరిణామంలో ఉన్న గ్రహం (థీయా) ఢీకొట్టింది. దీని ప్రభావంతో అంతరిక్షంలోకి వెలువడిన ముక్కలు తిరిగి కలిసిపోయి చంద్రుడిగా ఏర్పడ్డాయి. దీన్నే ‘జియాంట్‌ ఇంపాక్ట్‌’ ఊహా సిద్ధాంతంగా పేర్కొంటారు. భూమి తొలిదశ అంతర్భాగానికి సంబంధించిన పదార్థంతోనే చంద్రుడు ఏర్పడినట్టు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ జింయాంట్‌ ఇంపాక్ట్‌ 450 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. డైనోసార్ల అంతానికి కారణమైన గ్రహశకలం తాకిడితో పోలిస్తే ఇది 10కోట్ల రెట్లు ఎక్కువ శక్తిమంతమైంది!


రోజురోజుకీ దూరం

ఆకాశంలోకి చూసినప్పుడు చంద్రుడు పదింతలు పెద్దగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఇలాగే ఉండేది. ఎందుకంటే ప్రస్తుత దూరంతో పోలిస్తే చంద్రుడు అప్పట్లో మన భూమికి సుమారు 10 రెట్లు దగ్గరగా ఉండేవాడు. ఇప్పుడంటే చంద్రుడు మనకు 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు గానీ మొదట్లో 20 వేల నుంచి 30 వేల కిలోమీటర్ల దూరంలోనే (12-19 రెట్లు దగ్గరగా) ఉండేవాడని కంప్యూటర్‌ సిమ్యులేషన్లు సూచిస్తున్నాయి కూడా. ఇప్పటికీ చంద్రుడు మన నుంచి దూరంగానే పోతున్నాడు. భూమి మీద మహా సముద్రాల తరంగాల ప్రభావం, భ్రమణం మూలంగా శక్తి మార్పిడి కావటంతో చంద్రుడు సంవత్సరానికి 3.78 సెంటీమీటర్ల మేర దూరంగా జరుగుతున్నాడు! చంద్రుడు లేకపోతే భూమి వేగమూ తగ్గుతుంది, స్థిరత్వం కోల్పోతుంది. అమ్మో.. అని భయపడకండి. ఇది జరగటానికి కోట్లాది ఏళ్లు పడుతుంది. అసలు అలాంటి స్థితే రాకపోవచ్చు.


వామ్మో... ఉపరితల ఉష్ణోగ్రత

మనలాగా చంద్రుడికి రక్షణ కల్పించే వాతావరణం లేకపోవటం వల్ల ఉపరితల ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయి. సూర్యరశ్మి పడని చోట అతి శీతలంగా, ఎండ తగిలే చోట అతి ఎక్కువగా ఉంటాయి. నాసా లెక్కల ప్రకారం.. చంద్రుడి మధ్యరేఖ వద్ద పగటి పూట 120 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటే.. రాత్రిపూట మైనస్‌ 130 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోతుంది. ధ్రువాల వద్ద కొన్నిచోట్ల మైనస్‌ 253 డిగ్రీల సెంటీగ్రేడ్‌ చల్లదనమూ ఉంటుంది. మన చంద్రయాన్‌-3 కూడా చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలను గుర్తించింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌ పరీక్షించిన చోట 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండొచ్చని భావించగా.. అక్కడ 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్నట్టు తేలటం ఆశ్చర్యం కలిగించింది. పైగా లోతుకు వెళ్తున్నకొద్దీ వేడి బాగా తగ్గుతుండటం గమనార్హం. ఉపరితలం నుంచి 80 మిల్లీమీటర్ల లోతులో సుమారు మైనస్‌ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటున్నట్టు రోవర్‌ గుర్తించింది. త్వరలో చంద్రుడి మీదికి మనుషులను పంపాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడి ఉష్ణోగ్రత వివరాలు కీలకంగా మారాయి.


బిలాల నిలయం

వాతావరణం లేకపోవటం వల్ల చంద్రుడి మీద ఉల్కలు పడే అవకాశం ఎక్కువ. వీటి మూలంగా అక్కడ బోలెడన్ని లోతైన బిలాలు ఏర్పడ్డాయి. వీటిల్లో 20 కిలోమీటర్ల వ్యాసం కన్నా పెద్దవైన 5వేల బిలాలూ ఉన్నాయి. ఇవన్నీ సౌర వ్యవస్థ ‘సహజ చరిత్ర’ను శోధించటానికి బాగా ఉపయోగపడతాయి. ఉల్కలు, శకలాలు ఢీకొనటం వల్ల మన భూమి మీద 190 బిలాలు ఏర్పడ్డాయి. అయితే అవన్నీ నీటితోనో, చెట్లతోనో నిండిపోయాయి. కానీ చంద్రుడి మీద అలా కాదు. ఏర్పడినప్పటి నుంచీ బిలాలు అలాగే ఉన్నాయి. అందువల్ల పురాతన రహస్యాలన్నీ వీటిల్లో నిక్షిప్తమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి ఒక బిలం ఎదురైనప్పుడు ప్రజ్ఞాన్‌ రోవర్‌ తెలివిగా దారిని మార్చుకొని, ప్రమాదాన్ని తప్పించుకోవటం విశేషం.


నీటి ఆనవాళ్లు

చంద్రుడి ధ్రువాల సమీపంలో నీరున్నట్టు మన చంద్రయాన్‌-1 ప్రయోగం గుర్తించింది. అక్కడి మట్టిలో నీటి జాడలను నాసా ప్రయోగం పసిగట్టింది. ఒక క్యూబిక్‌ మీటర్‌ మట్టి నుంచి లీటరు నీటిని సంగ్రహించొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది తక్కువే అయినా ఏదో ఒకనాడు చంద్రుడి మీద ఆవాసం ఏర్పరచుకోవటానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ కూడా చంద్రుడి మీద గడ్డ కట్టిన నీటి అన్వేషణలో పడింది. అక్కడ నీరు ఉన్నట్టయితే రేడియో టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసుకోవటానికి, సేంద్రియ పదార్థం ఆనవాళ్లను శోధింంచటానికి ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. గ్రహాంతర జీవుల సంకేతాలను భూమి నుంచి వినటానికి వీలవుతుంది. చంద్రుడి ఉపరితలం యూరప్‌, ఆఫ్రికా ఖండాల విస్తీర్ణంతో సమానంగా ఉంటుంది. అంటే ఇంకా మనకు తెలియనిది చాలానే ఉందన్నమాట.


చంద్ర కంపాలు

అప్పట్లో అపోలో వ్యోమగాములు చంద్రుడి మీద సీస్మోమీటర్లతో పరీక్షించారు. అక్కడ స్వల్ప చంద్ర కంపనాలు ఏర్పడుతున్నట్టు, ఇవి ఉపరితలం నుంచి కొన్ని కిలోమీటర్ల లోతు నుంచి పుట్టుకొస్తున్నట్టు గుర్తించారు. ఈ కంపనాలకు భూమి గురుత్వాకర్షణ శక్తి లాగటం కారణం కావొచ్చని అనుకుంటున్నారు. కొన్నిసార్లు చంద్రుడి ఉపరితలం మీద పగుళ్లూ కనిపిస్తుంటాయి. వీటిలోంచి వాయువులు బయటికి వస్తుంటాయి. భూమి మాదిరిగానే చంద్రుడి అంతర్భాగమూ వేడిగా, పాక్షికంగా కరిగి ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల భావన. కానీ చంద్రుడి అంతర్భాగం చిన్నగా ఉన్నట్టు నాసాకు చెందిన లూనార్‌ ప్రాస్పరస్‌ వ్యోమనౌక రుజువు చేసింది. చంద్రుడి ద్రవ్యరాశిలో దాని అంతర్భాగం 2-4 శాతమే. భూమితో పోలిస్తే ఇది చాలా తక్కువ. భూమి ద్రవ్యరాశిలో ఐరన్‌తో కూడిన అంతర్భాగం సుమారు 30% వరకు ఆక్రమిస్తుంది.


సల్ఫర్‌, ఇతర మూలకాలు

ప్రస్తుతం చంద్రుడి మీద చురుకైన అగ్ని పర్వతాలేవీ లేవు. కానీ ఒకప్పుడు అగ్ని పర్వతాల పేలుళ్లు సంభవించేవి. ఇవి చాలావరకు 300 కోట్ల సంవత్సరాల క్రితమే పేలాయి. అక్కడ సుమారు 100 కోట్ల ఏళ్ల క్రితం ప్రవహించిన లావానే అత్యంత తాజాదని భావిస్తుంటారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్‌ జాడను గుర్తించి, సంచలనం సృష్టించింది. సాధారణంగా మన భూమి మీద అగ్ని పర్వతాల వద్దే సల్ఫర్‌ కనిపిస్తుంటుంది. అందువల్ల ప్రజ్ఞాన్‌ అందించిన సమాచారం అక్కడి అగ్ని పర్వతాల పేలుళ్ల తీరుతెన్నులను అర్థం చేసుకోవటానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. చంద్రుడి మీద సదుపాయాల నిర్మాణానికీ సల్ఫర్‌ ఉపయోగపడగలదు. జాబిల్లి మీది మట్టిలో అల్యూమినియం, క్యాల్షియం, క్రోమియం, ఐరన్‌, మాంగనీస్‌, ఆక్సిజన్‌, సిలికాన్‌, టైటానియం మూలకాలు కూడా ఉన్నట్టు ప్రజ్ఞాన్‌ గుర్తించటం గమనార్హం. వీటి ఉనికి, మోతాదుల ద్వారా చంద్రుడు ఏర్పడిన తీరు మరింతగా తెలియరావొచ్చని భావిస్తున్నారు.


ఎప్పుడూ ఒకవైపే

మనకు చంద్రుడి అవతలి వైపు కనిపించదు. కాబట్టి కొందరు దాన్ని చీకటి ప్రదేశమని పిలుచుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. అక్కడా ఎండ బాగానే కాస్తుంది. అయితే మనకు ఒకవైపే కనిపిస్తుంది. దీనికి కారణం భూమి చుట్టూ తిరిగే వేగంతోనే చంద్రుడు తన చుట్టూ తాను తిరగటం (టైడల్‌ లాకింగ్‌). అందువల్లే భూమి మీది నుంచి చంద్రుడి ఆవలి వైపు కనిపించదు. అటువైపున చంద్రకళలూ పూర్తి భిన్నంగా ఉంటాయి. పౌర్ణమి నాడు సూర్యకాంతితో ప్రకాశిస్తున్న చంద్రుడి అర్థగోళం మొత్తం మనకు నిండుగా కనిపిస్తుంది. అప్పుడు అవతలి వైపున చీకటిగా ఉంటుంది. అదే అమవాస్య రోజున చంద్రుడి అవతలి వైపు సూర్యకాంతితో నిండి ఉంటుంది. మనకు కనిపించే వైపు చీకటిగా ఉంటుంది. ఒకప్పుడు చంద్రుడు స్వేచ్ఛగా తనదైన తీరులో భ్రమించేవాడన్నది శాస్త్రవేత్తల భావన. రాన్రానూ గురుత్వాకర్షణ వంటి ఘర్షణ బలాల వల్ల చంద్రుడి ఆకారం మారటం భ్రమణ వేగం తగ్గటానికి దారితీసింది. చంద్రుడు గుండ్రంగా కనిపించినా పూర్తిగా గోళాకారంలో ఉండడు. చంద్రుడి చిన్న భాగం భూమి వైపునకు, పెద్ద భాగం మన నుంచి ఆవలి వైపునకు కదులుతాయి. దీంతో గురుత్వాకర్షణ అస్తవ్యస్తమవుతుంది. ఈ భ్రమణ బలం ప్రభావంతో చంద్రుడు స్ప్రింగు మాదిరిగా కాస్త అటూఇటూ ఊగుతాడు. చంద్రుడి టైడల్‌ బలం మూలంగానే సముద్రాల్లో ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి. భూమి కూడా చంద్రుడి మీద టైడల్‌ బలాన్ని చూపుతుంది. కానీ చంద్రుడి కన్నా భూమి పెద్దది కావటం వల్ల టైడల్‌ బలం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని ప్రభావంతో క్రమంగా చంద్రుడి భ్రమణ వేగం తగ్గుతూ వచ్చింది. భూమి చుట్టూ తిరిగే వేగంతో సమానికి చేరుకుంది.


తెలుపు కాదు..

చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు నారింజగా, మధ్యరాత్రి తెల్లగా కనిపిస్తుంటాడు. కానీ చంద్రుడి ఉపరితలం చాలావరకు బూడిద ఛాయలో ఉంటుంది. చంద్రుడి వెలుగు భూ వాతావరణాన్ని దాటుకొచ్చే క్రమంలో మన కళ్లకు నారింజ రంగులో కనిపిస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని