Cyber Crime: నయా సైడర్‌!

నేటి సైబర్‌ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు కోకొల్లలు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్‌ చేయటం తెలిసిందే

Updated : 10 Jan 2024 07:00 IST

నేటి సైబర్‌ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు (Cyber Crime) కోకొల్లలు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్‌ చేయటం తెలిసిందే. పిన్‌ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్‌ స్వాప్‌ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు కొల్లగొట్టటమూ మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్‌ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటి ‘కట్టి’ పడేయటం.. డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు సైబర్‌ కిడ్నాప్‌, డిజిటల్‌ అరెస్ట్‌ వంటి కొత్త నేరాలూ వెలుగు చూస్తున్నాయి. మనదేశంలో ఒక మహిళను డిజిటల్‌ అరెస్ట్‌ చేసిన ఉదంతం మరవకముందే.. ఇటీవల అమెరికాలో ఒక చైనా విద్యార్థి సైబర్‌ అపహరణకు గురికావటం సంచలనం సృష్టించింది. ఇంతకీ ఇవేం నేరాలు? వీటి నుంచి కాపాడుకోవటమెలా?

సైబర్‌ కిడ్నాప్‌

వెనక నుంచో, ముందు నుంచో ఎవరో వస్తారు. కళ్లకు గంతలు కట్టి కత్తితోనో, తుపాకితోనో బెదిరిస్తారు. కార్లో ఎక్కించుకొని తెలియని చోటుకు తీసుకెళ్తారు. ఇంట్లోవాళ్లకు ఫోన్‌ చేసి డబ్బులు ఇస్తే గానీ మీ వాళ్లను వదలమని బెదిరిస్తారు. డబ్బు తెచ్చి, ఇచ్చాక వదిలేస్తారు. లేదంటే హీరోనో, పోలీసులో వచ్చి ఫైటింగ్‌ చేసి విడిపిస్తారు. కిడ్నాప్‌ అనగానే సినిమాల్లో చూపించినట్టుగా ఇలాంటి దృశ్యమే గుర్తుకొస్తుంది కదా. కానీ సైబర్‌ కిడ్నాప్‌లో ప్రత్యక్షంగా అపహరించేవారెవరూ ఉండరు. బాధితులే తమకు తాము కిడ్నాప్‌ అవుతారు. అదెలా అంటారా? కిడ్నాపర్లు వీడియో కాల్‌ చేసి బాధితులను తమకు తామే ఎవరికీ తెలియని చోట దాక్కునేలా బలవంత పెడతారు. తాము ఆపదలో ఉన్నామని తెలిపేలా తమ ఫోన్‌తోనే ఫొటోలు తీసుకొని, పంపించాలని సూచిస్తారు. అప్పుడు కిడ్నాపర్లు ఆ ఫొటోలను కుటుంబ సభ్యులకో, ఆత్మీయులకో పంపించి బాధితులు నిజంగానో ఆపదలో ఉన్నట్టు నమ్మిస్తారు. వారిని వదలాలంటే డబ్బులు పంపించాలని బెదిరిస్తారు. డబ్బులు అందుకున్నాక బాధితులను అక్కడి నుంచి రావాలని చెబుతారు. ఇదేం చిత్రమని నోరు వెళ్లబెడుతున్నారా? ఇటీవల అమెరికాలో జరిగిన సైబర్‌ కిడ్నాప్‌ కథ సరిగ్గా ఇలాగే సాగింది.

ఇదీ జరిగింది

అది అమెరికాలోని ఉటా రాష్ట్రం. అక్కడి రివర్‌డేల్‌లోని స్కూలులో విద్యార్థి కియా జువాంగ్‌. చైనాకు చెందిన అతడికి 17 ఏళ్లు. గత నెలలో అదృశ్యమయ్యాడు. పోలీసులు జాడ తెలుసుకోవటానికి అప్పటి నుంచీ వెతుకుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా జువాంగ్‌ కిడ్నాప్‌ అయినట్టుగా కనిపించే ఫొటోలను నేరగాళ్లు చైనాలో ఉన్న అతడి తల్లిదండ్రులకు పంపించారు. వాళ్లు భయపడిపోయి నేరగాళ్లు అడిగినంత సొమ్ము (80వేల డాలర్లు) ఆన్‌లైన్‌లో పంపించారు. తర్వాత జువాంగ్‌ తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని స్కూలుకు తెలిపారు. స్కూలు వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫోన్‌ కాల్‌, బ్యాంకు రికార్డులను విశ్లేషించి జువాంగ్‌ ఉన్న చోటుకు చేరుకున్నారు. సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామంలో అతడొక్కడే టెంటులో ఉన్నట్టు గుర్తించారు. నేరగాళ్ల బెదిరింపులతో తనకు తానే అక్కడ ఒంటరిగా ఉండిపోయాడు. ఏదేమైనా అతడు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కథలో కిడ్నాపర్లు ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించలేదు. మొత్తం వ్యవహారమంతా వీడియో కాల్స్‌తోనే నడిపించారు. జువాంగ్‌ను ఎవరికీ కనిపించకుండా దాక్కోవాలని బెదిరించి, అతడి ఫోన్‌తో తీసిన ఫొటోలను చైనాలో ఉన్న తల్లిదండ్రులకు పంపించారు. అక్కడి నుంచే డబ్బును తమ ఖాతాలో జమ చేసుకున్నారు.

ఇలాంటివి పెరగొచ్చు

కృత్రిమ మేధ పుంజుకుంటున్న నేపథ్యంలో సైబర్‌ కిడ్నాప్‌ కేసులు పెరగొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియోకాల్‌ మాత్రమే కాదు.. కృత్రిమ మేధతో గొంతును క్లోన్‌ చేసి వాయిస్‌ నోట్స్‌తోనూ బెదిరించొచ్చు. బాధితులు నిజంగా ఆపదలో ఉన్నారనే భ్రమ కల్పించొచ్చు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరుగు తున్నాయి. అమెరికాలో గత సంవత్సరం ఒకామెకు తెలియని నంబరు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అందులో ఆమె 15 ఏళ్ల కుమార్తె ఏడుస్తూ, తనను ఎవరో దుండగులు పట్టుకున్నారని చెప్పింది. అనంతరం ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఆమె వెంటనే కాల్‌ను కట్‌ చేసింది. కుమార్తెకు ఫోన్‌ చేసి, క్షేమంగా ఉన్నట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది. నేరగాళ్లు కృత్రిమ మేధతో గొంతును మార్పిడి చేసి, అచ్చం ఆ అమ్మాయి మాట్లాడుతున్నట్టే వాయిస్‌ నోట్‌ను పంపించారన్నమాట. ఇలాంటి నేరాల సమాచారం అంతగా తెలియకపోవటం వల్ల కచ్చితంగా ఎంతమంది వీటికి గురవుతున్నారనేది తెలియటం లేదు. కానీ ఇవి పెరుగుతున్న మాట నిజం.

కాపాడుకునేదెలా?

నేరగాళ్లు చాలావరకు బాధితుల ఫోన్‌ నుంచి మాట్లాడరు. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చాలాసేపు సంభాషణ కొనసాగించటానికీ ప్రయత్నిస్తుంటారు. ఇలా బాధితులను కుటుంబంతో మాట్లాడనీయకుండా చేస్తుంటారు. మరోవైపు డబ్బులు త్వరగా పంపించాలంటూ కుటుంబాన్ని బెదిరిస్తూ, తొందర పెడుతుంటారనీ నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి తెలియని నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే అప్రమత్తంగా ఉండాలి. వెంటనే కాల్‌ కట్‌ చేయాలి. వాళ్లతో ఎలాంటి సంప్రదింపులు జరపొద్దు. నేరగాళ్లకు డబ్బు పంపించే ముందు పోలీసులకు తెలియజేయటం మంచిది.

  • ఒకవేళ నేరగాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతున్నా.. సామాజిక మాధ్యమాలతోనో, మరో ఫోన్‌ ద్వారానో బాధితులను సంప్రదించే ప్రయత్నం చేయాలి. తాము సైబర్‌ అపహరణకు గురైనామని అనుమానిస్తే బాధితులు కూడా వెంటనే పోలీసులకు ఫోన్‌ చేయాలి.
  •  నేరగాళ్లు క్లోన్‌ గొంతుతో అచ్చం మనవాళ్లు మాట్లాడు తున్నారనేలా భ్రమ కలిగించొచ్చు. ఏదైనా అనుమానం వస్తే ఆత్మీయులకు ఒకసారి ఫోన్‌ చేసి రుజువు చేసుకోవాలి.
  •  సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన డేటాను స్కామర్లు సంగ్రహించి, వాటి సాయంతో ఫోన్‌ కాల్స్‌ విశ్వసనీయమైనవే అని నమ్మించటానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌లో తమకు లేదా పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని షేర్‌ చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పేర్లు, నివాస ప్రాంత వివరాల విషయంలో జాగ్రత్త అవసరం. ఇల్లు, ఇరుగుపొరుగు ఇళ్లు, పిల్లల పాఠశాల ఫొటోలను షేర్‌ చేయకపోవటమే మంచిది.

    డిజిటల్‌ అరెస్ట్‌

సైబర్‌ నేరాలు పెచ్చుమీరిపోతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్‌ అరెస్ట్‌ ఇలాంటిదే. ఇందులో సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్‌ చేసినట్టుగా నిర్బంధించటమే డిజిటల్‌ అరెస్ట్‌.

రెండు ఉదంతాలు

డిజిటల్‌ అరెస్ట్‌ కొత్త సైబర్‌ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారు పడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలే దీనికి నిదర్శనం.

  • నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్‌ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్‌ కార్డుతో సిమ్‌ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్‌ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్‌ కాల్‌ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అసలు అధికారిగా ప్రవరిస్తూ బాగా భయపెట్టాడు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాక గానీ కాల్‌ కట్‌ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి, సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.
  •  ఆ మధ్య ఫరీదాబాద్‌లోనూ ఇలాంటి మోసమే జరిగింది. ఓ 23 ఏళ్ల యువతి దీనికి బలయ్యింది. నేరగాడు తాను లక్నో కస్టమ్‌ అధికారినంటూ స్కైప్‌లో ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆమె ఆధార్‌ నంబరుతో కూడిన కార్డులు, పాస్‌పోర్టులు గల ప్యాకేజీ ఒకటి కంబోడియాకు రవాణా అయ్యిందని చెప్పాడు. ఆమెను భయపెట్టి మనుషుల అక్రమ రవాణాతో కూడిన చట్టవ్యతిరేక పనికి పాల్పడినట్టు నమ్మేలా చేశాడు. ఆమెపై ఆరోపణలు మోపారు. ఈ క్రమంలోనే మరో నేరగాడు స్కైప్‌ కాల్‌ చేసి సీబీఐ అధికారినని నమ్మించాడు. కంబోడియాకు రవాణా అయిన ప్యాకేజీ మొత్తం విలువ రూ.15 లక్షలని, ఇందులో 5% రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అప్పటివరకు కదలటానికి లేదని నిర్బంధించాడు. ఏమీ పాలు పోక చివరికి నేరగాళ్లు పంపిన లింకుతో ఆమె వారి బ్యాంకు ఖాతాకు రూ.2.5 లక్షలు జమ చేశారు.

కాపాడుకోవటమెలా?

  • భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్‌ అరెస్ట్‌ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్‌ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి.
  •  సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్‌ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్‌ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి.
  •  ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు.
  •  ఏవైనా చట్టపరమైన ఆరోపణలు చేస్తే అధికారిక మార్గంలో ప్రభుత్వ సంస్థలు లేదా అధికారులను సంప్రదించాలి.
  •  ఇలాంటి కాల్‌ వచ్చినప్పుడు సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబరు(1930)కు గానీ నేషనల్‌ పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబరు(112)కు గానీ ఫోన్‌ చేసి ధ్రువీకరించుకోవచ్చు కూడా.
  •  తెలియని నంబర్ల నుంచి కాల్‌, మెసేజ్‌లు వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కాల్‌ కట్‌ చేయాలి. మెసేజ్‌లకు స్పందించొద్దు.
  • అజ్ఞాత వ్యక్తులు ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెబితే స్పందించొద్దు. వాళ్లు పంపే లింకులను అసలే తెరవొద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని