ఇస్రో ఏఐ వత్సరం 2024

ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని  నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం.

Updated : 27 Dec 2023 08:44 IST

ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని  నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం.

ఖగోళ అద్భుతాలు

ఈ సంవత్సరం చంద్రుడి మీదికి ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఇందులో మన ముద్ర కూడా ప్రస్ఫుటమైంది గ్రహశకలాల నమూనాలు సేకరించటం.. వాటి గుట్టును ఛేదించటం.. విశ్వం కూని రాగాన్ని గుర్తించటం.. ఇలా చెప్పుకొంటూ పోతే సైన్స్‌ సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇవీ..

ఇటు చంద్రుడు.. అటు సూర్యుడు

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2023లో అద్భుత విజయాలు సాధించింది. ఒకరకంగా దీన్ని ఇస్రో నామ సంవత్సరమనీ అనుకోవచ్చు. చంద్రయాన్‌-3తో జాబిల్లి మీద సాఫ్ట్‌ లాండింగ్‌ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలా ఈ ఘనతను సాధించిన రష్యా, అమెరికా, చైనా సరసన భారత్‌ను నిలబెట్టింది. అంతేకాదు.. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద విక్రమ్‌ ల్యాండర్‌ను దింపిన మొట్టమొదటి దేశంగానూ కీర్తిని కట్టబెట్టింది. అదీ అతి చవకగా! ఇటీవల రష్యా విఫల ప్రయోగానికి రూ.16వేల కోట్లు ఖర్చయితే.. మనం కేవలం రూ.600 కోట్లతోనే సాధించటం విశేషం. హాలీవుడ్‌ చిత్రాలకయ్యే ఖర్చు కన్నా ఇది తక్కువని దేశదేశాలు ఇస్రోను కొనియాడటం గమనార్హం. విక్రమ్‌ ల్యాండర్‌ ఆగస్టు 23న చంద్రుడి మీద అడుగు పెట్టింది. ఇది దిగిన చోట సుమారు 2.06 టన్నుల చంద్ర ధూళి (రాళ్లు, మట్టి) ఎగిసిపడిందని అంచనా. ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతను విజయవంతంగా రికార్డు చేసింది. అప్పటివరకూ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సుమారు 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండొచ్చని అనుకునేవారు. కానీ అక్కడ 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్నట్టు ప్రజ్ఞాన్‌ గుర్తించింది. చంద్రుడి ఉపరితలంలో సల్ఫర్‌ కూడా ఉన్నట్టు కనుగొంది. చంద్ర ప్రకంపనలనూ గుర్తించింది. నాలుగు మీటర్ల లోతైన గొయ్యి ఎదురైనప్పుడు ఇది తన దారిని మార్చుకొని ఆశ్చర్యపరిచింది. రెండు వారాల తర్వాత నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లు తిరిగి పనిచేస్తాయని భావించినప్పటికీ వాటి నుంచి స్పందన రాకపోవటం నిరాశ పరిచింది. అయితేనేం? చంద్రయాన్‌-3 మనదేశ కీర్తి పతాకను దశదిశలా చాటింది.

చంద్రయాన్‌-3 ఊపులోనే ఇస్రో సెప్టెంబరు 2న ఆదిత్య-ఎల్‌1ను విజయవంతంగా ప్రయోగించి మరో చరిత్ర సృష్టించింది. సూర్యుడు, సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేయటానికి మనదేశం చేపట్టిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. ఐదు సంవత్సరాల పాటు ప్రయాణం చేసే ఇది భూమి నుంచి సుమారు 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది ఏడు పరికరాలతో సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. ఇతర సౌర ప్రయోగాలకు చిక్కని దృశ్యాలను చిత్రీకరించటం దీని ప్రత్యేకత. మొత్తమ్మీద సూర్యుడి వెలుపలి ఆవరణమైన కరోనాలో అత్యంత వేడికి సంబంధించిన రహస్యాలను ఆదిత్య ఎల్‌1 వెలికి తీయనుంది. సూర్యుడి అయస్కాంత క్షేత్రం అంతరిక్ష వాతావరణాన్ని ఎలా సృష్టిస్తుంది? అది మన వాతావరణం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వంటి అనేక ప్రశ్నలకూ సమాధానాలు అందించనుంది.

బెన్నూ గ్రహశకలం నమూనాలు

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఓసిరిస్‌-ఆర్‌ఎక్స్‌ వ్యోమనౌక బెన్నూ గ్రహశకలం నమూనాలను ఇటీవలే విజయవంతంగా భూమి మీదికి తెచ్చింది. దీన్ని 2021లో ప్రయోగించారు. ఇది రెండేళ్ల పాటు ప్రయాణించి సెప్టెంబరులో గ్రహశకలం ముక్కలతో కూడిన పార్శిల్‌ను ఉటా ఎడారిలో జార విడిచింది. సౌర వ్యవస్థ పుట్టుకకు సంబంధించిన ‘టైమ్స్‌ క్యాప్స్యూల్‌’గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ గ్రహశకల నమూనాల్లో కర్బనం పెద్దమొత్తంలో ఉన్నట్టు, అలాగే నీటి ఆనవాళ్లూ ఉన్నట్టు తొలి అధ్యయనంలో వెల్లడైంది. అంటే 450 కోట్ల వయసు గల బెన్నూ గ్రహశకలంలోనూ మన భూమ్మీద జీవం పురుడు పోసుకోవటానికి కారణమైన అంశాలు ఉన్నాయన్నమాట.

భూమి అంతర్భాగాన్ని పోలిన సైకీ గ్రహశకలం మీదికి కూడా నాసా వ్యోమనౌకను ప్రయోగించింది. దీని పేరూ సైకీనే. చాలావరకు ఐరన్‌, నికెల్‌తో కూడిన ఈ గ్రహశకలాన్ని తొలినాళ్లలో క్షీణించిన గ్రహం అవశేషంగా భావిస్తున్నారు. అంతరిక్ష వస్తువులు ఢీకొన్నప్పుడు పైపొరలు ఛిద్రమై.. లోహంతో నిండిన అంతర్భాగం మిగిలిపోతుంది. సైకీ అలాంటి గ్రహ అవశేషమేనని, ఇది భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. సైకీ వ్యోమనౌక అక్కడికి చేరుకోవటానికి ఆరు సంవత్సరాలు పడుతుంది.

విశ్వరాగం

విశ్వం గురుత్వాకర్షణ తరంగాలతో ‘రాగం’ తీస్తున్నట్టు ఈ సంవత్సరం బయటపడింది. రేడియో టెలిస్కోపులతో అంతరిక్షాన్ని గాలించి, పదిహేనేళ్ల సమాచారాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఐరోపాలోని ఐదు అతిపెద్ద రేడియో టెలిస్కోపులు సేకరించిన డేటాను మనదేశంలోని అప్‌గ్రేడెడ్‌ జెయింట్‌ మీటర్‌వేవ్‌ రేడియో టెలిస్కోపు (యూజీఎంఆర్‌టీ) సంగ్రహించిన సమాచారంతో కలిపి నిశితంగా విశ్లేషించారు. యూరోపియన్‌ పల్సర్‌ టైమింగ్‌ అర్రే (ఈపీటీఏ), ఇండియన్‌ పల్సర్‌ టైమింగ్‌ అర్రే (ఇన్‌పీటీఏ) సభ్యులు ఇందులో పాలు పంచుకున్నారు. రెండు కృష్ణ బిలాలు కలిసే క్రమంలో పుట్టుకొస్తున్న గురుత్వాకర్షణ తరంగాల సంకేతాలను శాస్త్రవేత్తలు స్పష్టంగా గుర్తించటం విశేషం. ఈ తరంగాలు సూర్యుడి కన్నా కోట్ల రెట్లు ఎక్కువ బరువున్న బోలెడన్ని మహా భారీ కృష్ణ బిలాల కలయిక మూలంగా పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. గురుత్వాకర్షణ తరంగ పరిశోధనలో, ఖగోళశాస్త్ర రంగాల్లో ఈ పరిశోధన మైలురాయిగా నిలవనుంది.


నిర్మాణ రంగంలో

బ్యాక్టీరియా కాంక్రీటు!

భవన నిర్మాణంలో కాంక్రీటు కీలకం. ఇది గట్టిగా ఉన్నప్పటికీ కొంతకాలానికి క్షీణిస్తుంది. పగుళ్లు పడుతుంది. వీటిని నివారించటానికి డ్రెక్సెల్‌ యూనివర్సిటీ పరిశోధకులు బ్యాక్టీరియా సాయంతో వినూత్న కాంక్రీటును రూపొందించారు. తనకు తానే మరమ్మతు కావటం దీని ప్రత్యేకత. ఇందులోని బయోఫైబర్లు కాంక్రీటుకు దన్నుగా నిలవటంతో పాటు పగుళ్లు తమకు తామే పూడిపోయేలా చేస్తాయి మరి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు గల హైడ్రోజెల్‌ పూత పూస్తారు. ఇందులో నిద్రాణ బ్యాక్టీరియా ఉంటుంది. తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లను తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్‌ విస్తరించి, పైపొర పగులుతుంది. అప్పుడు బ్యాక్టీరియా నిద్రలేచి, కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్‌, క్యాల్షియాలను తింటుంది. ఈ క్రమంలో క్యాల్షియం కార్బొనేట్‌ పుట్టుకొచ్చి, పగుళ్లను పూడుస్తుంది.

పర్యావరణ హిత మైక్రోక్రీట్‌

నిర్మాణరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగల వినూత్న పదార్థం 2023లో ఆవిష్కృతమైంది. దీన్ని బ్రిటన్‌కు చెందిన న్యూకాజిల్‌ యూనివర్సిటీ పరిశోధకులు సుసాధ్యం చేశారు. ఫంగస్‌ వేర్లు (మైసీలియం), వలలాంటి అచ్చుల సాయంతో ఈ నిర్మాణ పదార్థాన్ని రూపొందించారు. ఇప్పటివరకు తయారుచేసిన బయో నిర్మాణ పదార్థాల కన్నా మరింత గట్టిదనం, వైవిధ్యం కలిగుండటం దీని ప్రత్యేకత. నిర్మాణ రంగంతో ఏర్పడే కాలుష్యం తగ్గటానికిది తోడ్పడుతుంది. దీన్ని తయారుచేయటానికి ముందుగా కాగితం పొడి, నీరు, గ్లిజరిన్‌, గ్జాంతన్‌ జిగురుతో పాటు మైసీలియం మిశ్రమాన్ని అచ్చుల్లోకి జొప్పిస్తారు. అప్పుడది గట్టి పదార్థంగా మారుతుంది. కలప, ప్లాస్టిక్‌ వంటి సంప్రదాయ పదార్థాలకు దీన్ని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఉన్ని, ఇసుక పొడి, సెల్యులోజ్‌ వంటి జీవ పదార్థాలకు మైసీలియంను జోడించి కూడా వినూత్న నిర్మాణ పదార్థాన్ని రూపొందించటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.


టెక్‌ తరంగాలు

సాంకేతిక రంగం 2023లో కొత్త జోష్‌తో ఉరకలెత్తింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అసలు సామర్థ్యమేంటో అందరికీ అవగతం చేసింది. ఛాట్‌జీపీటీ అందించిన ఉత్సాహంతో చోటా మోటా టెక్‌ సంస్థలన్నీ వినూత్న టూల్స్‌కు శ్రీకారం చుట్టాయి. యాపిల్‌ సంస్థ పరిచయం చేసిన విజన్‌ ప్రో హెడ్‌సెట్‌ దగ్గరి నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ వేరబుల్‌ పరికరం వరకూ ఎన్నెన్నో ఆవిష్కృతమయ్యాయి.

ఏఐ సంచలనం

ఇది ఏఐ నామ సంవత్సరం. అతిశయోక్తిగా అనిపించినా ఇందులో నిజం లేకపోలేదు. కృత్రిమ మేధ కోసం టెక్‌ సంస్థల మధ్య పోటీ గణనీయంగా పెరిగింది మరి. ఛాట్‌జీపీటీకి ప్రత్యామ్నాయంగా గూగుల్‌ తీసుకొచ్చిన బార్డ్‌తోనే ఇది మొదలైంది. మైక్రోసాఫ్ట్‌ మరో అడుగు ముందుకేసి బింగ్‌ సెర్చింజన్‌కు ఛాట్‌జీపీటీని జతచేసి అబ్బుర పరిచింది. ఓపెన్‌ఏఐ మరింత అధునాతన ఏఐ మోడల్‌ జీపీటీ-4ను ఆవిష్కరించి సంచలనం సృష్టించింది. ఇది ఛాట్‌జీపీటీకి ప్రత్యక్ష వెబ్‌ బ్రౌజింగ్‌ సామర్థ్యాలనూ కట్టబెట్టింది. ఇలాన్‌ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ అంకుర సంస్థ గ్రాక్‌ పేరుతో ఏఐ ఛాట్‌బాట్‌ను పరిచయం చేసింది. గూగుల్‌ సంస్థ ఇటీవలే తర్వాతి తరం ఏఐ మోడల్‌ ‘జెమిని’ని తీసుకొచ్చింది. సమాచార సేకరణకే కాదు, పనులను సులభం చేయటానికీ ఎన్నెన్నో ఏఐ టూల్స్‌ పుట్టుకొచ్చాయి. రాతలో సాయం చేసే క్విల్‌బాట్‌, బొమ్మలను సృష్టించే మిడ్‌జర్నీ, వీడియోలను సృష్టించే క్యాప్‌కట్‌ వంటివి వీటిల్లో కొన్ని. అనువాద పరిజ్ఞానమైతే కొత్త పుంతలు తొక్కింది. ఇది అప్పటికప్పుడే ఒక భాషలోని మాటలను మరో భాషలోకి మార్చేస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో హిందీలో మాట్లాడుతుంటే అది హెడ్‌ఫోన్లు ధరించినవారికి తమిళంలో వినబడటం విచిత్రం. ఇది మున్ముందు భాషల మధ్య సరిహద్దులు చెరిపేయగలదనీ భావిస్తున్నారు.

ఇమ్మర్సివ్‌ టెక్నాలజీ

మెటావర్స్‌, వర్చువల్‌ రియాలిటీ (గేమింగ్‌ మినహాయించి) కథ ముగిసినట్టేనని భావిస్తున్న తరుణంలో యాపిల్‌ సంస్థ తీసుకొచ్చిన విజన్‌ ప్రో హెడ్‌సెట్‌ కొత్త ఆశలు రేకెత్తించింది. ధర ఎక్కువే అయినా ఎం2 చిప్‌, స్పేటియల్‌ కంప్యూటింగ్‌ ఫీచర్లతో కూడిన ఇది చాలామందిని ఆకట్టుకుంది.

వేరబుల్‌ ఏఐ

శరీరానికి ధరించే విధంగానూ కృత్రిమ మేధ మారుతోంది. హ్యూమేన్‌ ఏఐ పిన్‌ దీనికి తాజా నిదర్శనం. జేబుకో, కాలర్‌కో ధరించే విధంగా ఉండే ఇది మొబైల్‌ ఫోన్‌ వంటి పరికరాలు వెంట లేకున్నా కృత్రిమ మేధతో పనులు చేసుకోవటానికి తోడ్పడుతుంది. టచ్‌ స్క్రీన్లతో పనిలేకుండా ఇది చేతినే డిస్‌ప్లేగా మారుస్తుంది. లేజర్‌ ఇంక్‌ సాయంతో చేతిలోనే మెనూ వంటివి కనిపించేలా చేస్తుంది. చేతిని పైకెత్తటం, తిప్పటం వంటివి చేస్తే చాలు. రెండు వేళ్లను కలిపి, మెనూలో అవసరమైనవి ఎంచుకోవచ్చు. పిన్‌ మీద వేలును ఆనించి, మాటలతోనే ఆదేశాలు ఇవ్వచ్చు. ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. సౌండ్‌ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది ఎదుటివారి భాష అర్థం కానప్పుడు అప్పటికప్పుడు అనువాదం చేసేస్తుంది కూడా. ఆయా కాంటాక్టుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది. వారి నుంచి వచ్చే ముఖ్యమైన కాల్స్‌, టెక్స్ట్‌ సందేశాలను పసిగడుతుంది. విశ్వసనీయం కాని వారి నుంచి వచ్చే కాల్స్‌ గురించీ హెచ్చరిస్తుంది.

న్యూరాలింక్‌ ప్రయోగ సన్నాహాలు

ఇలాన్‌ మస్క్‌ మానస పుత్రిక న్యూరాలింక్‌ను మనుషుల మీద ప్రయోగించటానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించటం ఆసక్తికర పరిణామం. ఈ శస్త్రచికిత్సలో పుర్రెలో కొంత భాగాన్ని తొలగించి, మెదడులోకి ఎలక్ట్రోడ్లు, సన్నటి వైర్లను జొప్పిస్తారు. ఇది సమీపంలోని ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్లెట్‌కు వైర్‌లెస్‌గా సమాచారాన్ని అందిస్తుంది. దీని ద్వారా మెదడును విశ్లేషిస్తారు. న్యూరాలింక్‌ చిప్‌ పక్షవాతం వంటి జబ్బుల బారినపడ్డవారికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు. మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగ పరీక్షల కోసం ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు కూడా. న్యూరాలింక్‌ చిప్‌తో బరువు తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు మస్క్‌ ప్రకటించటం సంచలనం కలిగించింది. నిపుణులు దీని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ వైద్య సాంకేతిక రంగంలో ఆసక్తి కలిగిస్తోంది.

మొట్టమొదటి విమాన ట్యాక్సీ

స్వయంచోదక విమాన ట్యాక్సీ రంగంలో చైనా అంకుర సంస్థ ఇహ్యాంగ్‌ రికార్డు నెలకొల్పింది. తనంత తానుగా గాల్లో ప్రయాణించే సామర్థ్యం కలిగున్నట్టు సర్టిఫికెట్‌ను పొందింది. ప్రపంచంలో ఇలాంటి సర్టిఫికెట్‌ను పొందిన తొలి సంస్థ ఇదే. ఇహ్యాంగ్‌ తయారు చేసిన నిట్టనిలువుగా గాల్లోకి లేచే ఎలక్ట్రిక్‌ విమానం (ఇవీటీఓఎల్‌) దీన్ని సొంతం చేసుకుంది. రెండు సీట్లతో కూడిన దీని పేరు ఈహెచ్‌216-ఎస్‌. ఇవీటీఓఎల్‌ పరిజ్ఞానం చాలాకాలం నుంచే ఆసక్తి రేపుతోంది. ఈ విమాన ట్యాక్సీలు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణ వేగాన్ని 75% వరకు పెంచగలవని ఆశిస్తున్నారు. సరకు రవాణాలోనూ కీలక పాత్ర పోషించొచ్చని భావిస్తున్నారు.

వాతావరణ అంచనాకూ..

ఆధునిక కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే వాతావరణాన్ని అంచనా వేయటం మొదలైంది. తొలిసారి రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా అణ్వాయుధాలు, క్షిపణుల మార్గం వంటి వాటిని సిమ్యులేట్‌ చేయటానికి దీన్ని వాడుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇందుకు కృత్రిమ మేధ కూడా ఉపయోగపడుతోంది. గూగుల్‌, హువావీ, ఎన్‌విడియా వంటి సంస్థలు రూపొందించిన ఏఐ నమూనాలు 10 రోజుల ముందుగానే వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేస్తున్నాయి. ఇవి ఈక్వేషన్లతో సమస్యను పరిష్కరించటం కన్నా డీప్‌ లెర్నింగ్‌ మోడళ్లతో పనిచేస్తుండటం విశేషం. గత 40 ఏళ్ల వాతావరణ సమాచారంతో తర్ఫీదు పొందుతున్నాయి. వీటికి ఒకసారి శిక్షణ ఇస్తే చాలు నిమిషంలోనే డెస్క్‌టాప్‌ మీద వాతావరణాన్ని అంచనా వేసి, ఫలితాన్ని చూపిస్తాయి. సూపర్‌ కంప్యూటర్‌ 2 గంటల్లో చేసే పనిని చిటికెలోనే పూర్తి చేయగలవు. ప్రపంచంలోనే మేటి వాతావరణ అంచనా సంస్థ అయిన యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌క్యాస్ట్స్‌ (ఈసీఎండబ్ల్యూఎఫ్‌) కూడా ఇప్పటికే సొంత ఏఐ ఫోర్‌క్యాస్ట్‌ను రూపొందించింది. ఇతర సంస్థలూ దీని బాటలోనే నడుస్తున్నాయి. అయితే గత సమాచారంతో శిక్షణ పొందటం కన్నా సెన్సర్లతో సంగ్రహించిన ప్రత్యక్ష సమాచారాన్ని ఏఐ నమూనాలకు అందిస్తే మరింత కచ్చితంగా పనిచేయగలవని నిపుణులు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ దిశగానూ కృషి చేస్తున్నారు.

డీప్‌ఫేక్‌ కలకలం

కృత్రిమ మేధ కొన్ని చిక్కులను తెచ్చిపెట్టింది. దీన్ని అనుచిత పనులకు వాడుకోవటమూ ఎక్కువైంది. డీప్‌ఫేక్‌తో సృష్టించిన నకిలీ వీడియోలు ఈ సంవత్సరం పెద్ద కలకలమే సృష్టించాయి. నిజానికి డీప్‌ఫేక్‌ పరిజ్ఞానం కొత్తదేమీ కాదు. కానీ ఇప్పుడిది చాలా తేలికైన పనయ్యింది. నకిలీ ఇమేజ్‌లు, వీడియోలను ఏఐ టూల్స్‌తో ఎప్పుడు సృష్టించారో తెలుసుకోవటం కష్టమైన వ్యవహారంగా మారింది. రష్మిక మందాన వంటి సినీ నటులే కాదు.. పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కూడా నకిలీ వీడియోల బారినపడ్డారు. ఇవి ఇంతటితోనే ఆగటం లేదు. రాజకీయాలకూ విస్తరిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్టు కనిపించే నకిలీ ఫొటోలు ఆ మధ్య ఆందోళన కలిగించాయి. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధాల విషయంలోనూ ఎన్నెన్నో నకిలీ దృశ్యాలు ఇంటర్నెట్‌లో ప్రసారమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని