ప్రేమ శాస్త్రం!

ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు.

Updated : 07 Feb 2024 07:10 IST

ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. తాను మునిగింది గంగ, మెచ్చింది రంభ అనే సామెత తెలిసిందే. కొందరిని తొలిచూపుతోనే ప్రేమ కటాక్షిస్తుంది. కొందరిని ఏళ్ల కొద్దీ నిరీక్షించేలా చేస్తుంది. ప్రేమ కోసం పరితపించేవారి లోకమే వేరు. ప్రేయసి, ప్రియుల కొసచూపయినా చాలనుకునేవారు కొందరైతే.. చిరునవ్వు ప్రసాదించినా మేలనుకునేవారు ఇంకొందరు. మాటలే మంత్రాలు. మౌనమే సమాధానాలు. చుట్టూ ఆనంద సాగరమే. ఇంతకీ ప్రేమంటే ఏంటి? జవాబు చెప్పటం అనుకున్నంత తేలిక కాదు. మహామహులే సరైన జవాబు చెప్పలేకపోయారు. మనమెంత? అలాగని శాస్త్రవేత్తలు ఊరుకోలేదు. దీని లోతుపాతులు తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు, పరిశోధనలు చేశారు. ప్రేమికుల వారోత్సవాలు మొదలైన నేపథ్యంలో శాస్త్రవేత్తల ప్రేమ ‘శాస్త్రం’ ఏం చెబుతోందో చూద్దాం.

 తొలిసారి ప్రేమికులు ఎదురు పడినప్పుడు మాటలు తడబడతాయి. కాళ్లూ చేతులూ చల్లబడతాయి. చూపులు నేల తాకుతాయి. గుండె దడదడమంటుంది. ఏం మాట్లాడాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియక అర్థం కాని, అసంబద్ధ పదాలేవో నోటి నుండి వెలువడతాయి. ఇదేం కొత్త కాదు. శతాబ్దాలుగా ఎంతోమంది ప్రేమికులు అనుభవించిన, అనుభవిస్తున్న విచిత్ర పరిస్థితి. ఇంతకీ ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది? అందరూ అనుకునేది గుండెలోంచి పుట్టుకొస్తుందని. నిజానికిదంతా మెదడు మాయ. ప్రేమ భావనలతో శరీరం మొత్తాన్ని ఉడికించి, ఉరికించేది ఇదే.


మూడు భాగాలు

ప్రేమ మీద శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలే చేశారు. రకరకాల విశ్లేషణలు, వాదనల అనంతరం కొందరు పరిశోధకులు దీన్ని మూడు విభాగాలుగా వర్గీకరించారు. 1. శృంగార వాంఛ 2. ఆకర్షణ.  3. అనుబంధం. ఇవన్నీ ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నప్పటికీ ఒక్కోదానికీ మెదడులో విడుదలయ్యే వేర్వేరు హార్మోన్లు కారణం అవుతుండటం విచిత్రం.

శృంగార వాంఛ

దీనికి మూలం లైంగిక తృప్తిని పొందాలనే కోరిక. ఇది పునరుత్పత్తి కోసం పరిణామక్రమంలో భాగంగా జీవులన్నింటికీ అబ్బుతూ వచ్చింది. పునరుత్పత్తి ద్వారానే ప్రాణులు తమ జన్యువులను తర్వాతి తరానికి అందిస్తాయి. శృంగార వాంఛ కలగటంలో మెదడులోని హైపోథలమస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వృషణాలు, అండాశయాల్లోంచి టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రోజన్‌ అనే సెక్స్‌ హార్మోన్లు విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది. వీటిని మగ, ఆడ హార్మోన్లుగా విభజిస్తుంటారు గానీ ఆడవారు, మగవారు.. ఇద్దరి మీదా ఇవి ప్రభావం చూపుతాయి. టెస్టోస్టిరాన్‌ అందరిలోనూ శృంగారాసక్తిని పెంచుతుంది. ఈ విషయంలో ఈస్ట్రోజన్‌ ప్రభావం తక్కువే అయినా ఈస్ట్రోజన్‌ మోతాదులు పెరిగిపోయే ఫలదీకరణ సమయంలోనే కొందరు మహిళలు ఎక్కువ శృంగారాసక్తిని ప్రదర్శిస్తుంటారు.

ఆకర్షణ

మెదడులో ‘ప్రతిఫల’ ప్రవర్తనను నియంత్రించే మార్గాలు ఆకర్షణకు దోహదం చేస్తాయి. సంబంధాలు, అనుబంధాలు ఏర్పడిన కొత్తలో చాలా ఉత్సుకతగా ఉండటం.. క్రమంగా తగ్గుతూ రావటానికి కొంతవరకు ఇదే కారణం. ప్రతిఫల ప్రవర్తనలో డొపమిన్‌ పాత్ర కీలకం. సంతోషం కలిగించే పనులు చేస్తున్నప్పుడు మెదడులోని హైపోథలమస్‌ నుంచి ఇది విడుదలవుతుంది. హాయి భావనను మరింత పెంచుతూ మరింత ఎక్కువగా ఆయా పనులు చేసేలా పురికొల్పుతుంది. ఆత్మీయులతో సన్నిహితంగా ఉండటం, శృంగారం వంటివీ వీటి కోవలోకే వస్తాయి. ఆకర్షణ ఏర్పడినప్పుడు డొపమిన్‌తో పాటు దీనికి సంబంధించిన నార్‌ఎపినెఫ్రిన్‌ హార్మోన్‌ కూడా విడుదలవుతుంది. ఇవి ఉత్సాహం, ఉల్లాసం కలగటానికే కాదు.. ఆకలి, నిద్ర తగ్గేలా చేస్తాయి కూడా. ప్రేమలో పడినప్పుడు ఎక్కడలేని హుషారు కలగటం.. ఆకలి, నిద్ర తెలియకపోవటం వంటివన్నీ వీటి మహత్తులే. ఇవి నిరంతరం ప్రేమికులతో గడిపేలా చేస్తాయి. పాత స్కూలు వంటి మామూలు ఫొటోలను చూసినప్పటితో పోలిస్తే బాగా ఆకర్షించినవారి ఫొటోలను చూసినప్పుడు మెదడులోని ప్రతిఫల భాగం అత్యధికంగా ఉత్తేజితం అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

అనుబంధం

సంబంధాలు దీర్ఘకాలం కొనసాగటంలో అనుబంధం చాలా ముఖ్యం. శృంగార వాంఛ, ఆకర్షణ చాలావరకు ప్రేమతోనే ముడిపడి ఉంటాయి గానీ అనుబంధమనేది స్నేహాలు, తల్లిదండ్రులు-బిడ్డల బంధం, సౌభ్రాతృత్వం వంటి ఎన్నెన్నో అంశాలతో పెనవేసుకుంటుంది. దీనికి ఆక్సిటోసిన్‌, వాసోప్రెసిన్‌ హార్మోన్లు తోడ్పడతాయి. ఆక్సిటోసిన్‌ను ప్రేమ హార్మోన్‌ అనీ పిలుచుకుంటారు. ఇదీ హైపోథలమస్‌ నుంచే పుట్టుకొస్తుంది. శృంగారం, బిడ్డకు పాలు పట్టటం, కాన్పు సమయంలో పెద్దఎత్తున విడుదలవుతుంది. ఇవన్నీ ఆనందం కలిగించే పనులే కాకపోయినా అనుబంధానికి ముందరి ఘటనలు కావటం విశేషం. శృంగార వాంఛ, ఆకర్షణ, అనుబంధం అన్నీ ప్రేమతో ముడిపడినవే అయినా వీటి కోసం మెదడులో వేర్వేరు హార్మోన్లు పని చేస్తుండటం గమనార్హం.

ప్రేమలో పడటానికి ఏదో ఒక కారణాన్ని చెప్పమంటే కుదిరేది కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. మనమెలా భావిస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవటానికి మెదడులో ఇదమిత్థమైన ప్రేమ భాగమేంటనేది తెలియదు. ఏదైనా గానీ నచ్చినవారిని చూసినప్పుడు శరీరం టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రోజన్‌ హార్మోన్లను పెద్దఎత్తున విడుదల చేస్తుంది. ఇది మోహాన్ని కలిగిస్తుంది. అనంతరం మెదడు డొపమిన్‌ మోతాదులను పెంచుతుంది. ఫలితంగా ఆనందం, హాయి భావనలు కలుగుతాయి. ఇక నార్‌ఎపినెఫ్రినేమో గుండె వేగం పెరిగేలా చేస్తుంది. కుదురుగా ఉండలేకపోవటం, ఆకలి కలగకపోవటం దీని మహిమలే. ఇవన్నీ ఆకర్షణను సూచించే చిహ్నాలే. ప్రేమ ముదురుతున్న కొద్దీ మెదడు ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ను ఉరకలె
త్తిస్తుంది. దీంతో శారీరక సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది. ఇక వాసోప్రెసిన్‌ మూలంగా భాగస్వామిని కాపాడుకోవాలనుకునే కోరిక కలుగుతుంది. ఆత్మీయ, అనుబంధ భావాలు కలుగు
తాయి. మొత్తంగా ఇదో రసాయన సమ్మేళనాల మహత్తు. జీవితాలను పెనవేస్తున్న గమ్మత్తు.

జ్ఞానేంద్రియాల తోడు

ప్రేమ పుట్టటం, కొనసాగటంలో ఏదో ఒక ‘సూత్రం’ దాగుందనేది ఖాయం. ఇందుకు హార్మోన్లు పురికొల్పుతుండొచ్చు. అయితే మెదడు ఒక్కటే కాదు.. జ్ఞానేంద్రియాలూ కీలక పాత్ర పోషిస్తాయి. వీటి నుంచి అందే సమాచారమే మెదడును ఉత్తేజితం చేస్తుంది మరి. కాబట్టి ప్రేమ మూలాలను తెలుసుకోవాలంటే వీటి ప్రభావాలనూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

చూపు

తమకు అందంగా అనిపించినవారిని చూసినప్పుడు మెదడు మోహాన్ని పుట్టిస్తుంది. ఆడవాళ్ల కన్నా మగవారు దృశ్య ప్రేరేపణకు బాగా గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఆడ, మగ ఇద్దరిలోనూ టెస్టోస్టిరాన్‌ మోతాదుల గణనీయంగా పెరుగుతాయి. సెరటోనిన్‌ స్థాయులు పడిపోతాయి. ఇది పదే పదే వారి గురించే ఆలోచించేలా చేస్తుంది. చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారోననే విషయాన్ని తెలియజేసే, ప్రతికూల భావనలను నియంత్రించే మెదడు భాగాలను పనిచేయకుండా నిలువరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విధమైన వ్యామోహ స్థితిలోకి వెళ్తారు. ప్రేమించినవారిని తదేకంగా చూస్తూనే ఉంటారు.  

వాసన

జంతువులతో పోలిస్తే వాసన విషయంలో మనం దిగదుడుపే. అలాగని ప్రేమ విషయంలో దీని ప్రభావాన్ని కొట్టిపారేయలేం. తగిన భాగస్వామిలో రసాయన సంకేతాలను (ఫెరమోన్స్‌) గుర్తించటానికి మనుషులు ముక్కు మీద ఆధారపడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫెరమోన్స్‌ మెదడుకు అస్పష్ట సమాచారాన్ని అందజేస్తాయి. అప్పుడు మెదడు ఇతర జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే సమాచారంతో విశ్లేషిస్తుంది. ఇలా ఎదుటి వ్యక్తికి తమ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవటానికి మనకు తోడ్పడుతుంది. మనల్ని ఆకర్షించినవారి నుంచి వెలువడే వాసనలు నచ్చినప్పుడు, బాగా అనిపించినప్పుడు శరీరంలోని డొపమిన్‌ వ్యవస్థ దాన్ని గుర్తుంచుకుంటుంది. హాయి, ఆనందం కలిగిస్తూ మళ్లీ మళ్లీ వాసన ఆఘ్రాణించేలా పురికొల్పుతుంది.

రుచి

ప్రతి ఒక్కరూ శ్వాస ద్వారా తమదైన రుచిని వెలువరిస్తుంటారు. ఇందులో తీపి రుచి ప్రధానంగా పాలు పంచుకుంటుంది. ఎందుకంటే మనం అనాది నుంచీ సహజంగానే చేదు, పుల్లటి రుచుల కన్నా తీపి, ఉప్పు రుచులను ఎక్కువగా ఇష్టపడుతూ వస్తున్నాం. తీపి రుచిని ఆస్వాదించేవారి మధ్య సంబంధాలూ ఏర్పడుతుండటం గమనార్హం. కొందరు దీంతోనే ప్రేమ భావనలతో ముడిపడుతుంటారు. మిఠాయిలు, చాక్లెట్లు, తీపి పానీయాలు తీసుకున్న తర్వాత ఇష్టమైనవారి ఫొటోను చూపించినప్పుడు వారితో మరింత సన్నిహితంగా ఉండాలని భావిస్తున్నట్టు కొన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి. తీపి పదార్థాలు తిన్నప్పుడు మెదడులో హాయిని కలిగించే భాగం డొపమిన్‌ను పెద్దఎత్తున విడుదల చేస్తుంది. వాటిని మళ్లీ మళ్లీ తినేలా ఉసిగొల్పుతుంది. ఇది ప్రేమకూ వర్తిస్తుంది. అంటే తీపి రుచిని ఇష్టపడేవారితో సన్నిహితంగా ఉండేలా చేస్తుందన్నమాట. నచ్చినవారికి కొందరు మిఠాయిలు, చాక్లెట్లు ఇస్తుంటారు. ప్రేమలో పడేయటానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. మనదగ్గర శోభనం రోజున మిఠాయిలు, పాలు, పండ్ల వంటివి దంపతులకు ఇవ్వటం చూస్తూనే ఉంటాం.

స్పర్శ

చేతులను తాకటం, సున్నితంగా ముద్దు పెట్టుకోవటం వంటి మామూలు స్పర్శతోనూ ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది. ఇది శారీరక ఆకర్షణకు దారితీస్తుంది. అదే సమయంలో డొపమిన్‌ గాఢమైన సంతోష భావనలను కలిగిస్తుంది. ఇది వ్యతిరేకంగానూ పనిచేయొచ్చు. ఇతరులను తాకటం మంచిదికాదని, ప్రమాదకరమని ఇతర జ్ఞానేంద్రియాల నుంచి సమాచారం అందితే దగ్గరికి రావటానికే భయపడొచ్చు.

వినికిడి

ప్రేమ భావనలు ఉత్తేజితం చేయటంలో చెవులు కీలక పాత్ర పోషిస్తాయి. గుసగుసలు, ముద్దు ముద్దు మాటలు, కిలకిల నవ్వులు మనల్ని ఎంతగా ఆకర్షిస్తాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమికులు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకోవటం చూస్తూనే ఉంటాం. సంగీతం కూడా తక్కువేమీ కాదు. ఎవరైనా ఇద్దరు పాటలను షేర్‌ చేసుకున్నారంటే పరస్పరం సానుకూలంగా స్పందిస్తున్నారనే అనుకోవచ్చు. వీటి ద్వారా తమ ఇష్టాలను, భావాలను పంచుకుంటున్నారనే అర్థం. ఇవి భాగస్వామి మెదడులో ఆయా భావాలు నిక్షిప్తమమయ్యేలా చేస్తాయనీ ఆశిస్తుంటారు.


బాధామయం కూడా

ప్రేమ తీయగానే ఉంటుంది. హార్మోన్లు విడుదలవటం, హాయి భావన కలగటం, ప్రతిఫలం అందటం, ఆత్మీయులతో సన్నిహిత సంబంధం కొనసాగించటం వంటివన్నీ సరే. కథ వీటితోనే ముగియటం లేదు. ప్రేమ భగ్నమైతే బాధ, నిరాశ, నిస్పృహలనూ  కలిగిస్తుంది. కొన్నిసార్లు అనుచిత ప్రవర్తనకు, వ్యసనాలకూ దారితీయొచ్చు. ప్రేమలో అసూయ, అనుచిత ప్రవర్తన, అసంబద్ధత, ప్రతికూల భావనలు, మూడ్‌ మారిపోవటం వంటి వాటిని కొట్టిపారేయలేం. వీటికి కూడా ప్రేమ కలగటానికి దోహదం చేసే హార్మోన్లే కారణం కావటం విచిత్రం. ఉదాహరణకు- డొపమిన్‌ మంచి, చెడు రెండింటినీ నియంత్రిస్తుంది. వ్యసనాల విషయంలోనూ ఇదే ప్రబలంగా పనిచేస్తుంది. ఆకర్షణలో పడినప్పుడు మెదడులో ఉత్తేజితమైన భాగాలు కొకైన్‌ వంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, మిఠాయిలు తింటున్నప్పుడు కూడా ప్రేరేపితమవుతాయి. ఉదాహరణకు కొకైన్‌ను తీసుకున్నప్పుడు అది డొపమిన్‌ సంకేత వ్యవస్థను మరింత ఎక్కువ సేపు ప్రభావితం చేస్తుంది. తాత్కాలికంగా చాలా ఎక్కువగా ఉల్లాసంగా ఉన్నామనే భావన కలిగిస్తుంది. కొకైన్‌ ప్రభావం తగ్గగానే నిరుత్సాహం ఆవరించేస్తుంది. మళ్లీ తీసుకునేలా చేస్తుంది. క్రమంగా వ్యసనంగా మారుతుంది. ఆకర్షణ కూడా ఇలాంటిదే. భాగస్వాముల మీద భాగోద్వేగాలతో ఆధారపడినప్పుడు మెదడులో ఉత్తేజితమయ్యే భాగాలే భౌతిక వస్తువులు, పదార్థాల వ్యసనాలకు లోనైనప్పుడూ ప్రేరేపితమవుతాయి. వ్యసనాలకు లోనైనవారు ఆయా పదార్థాలు దొరక్కపోతే ఎంతకైనా తెగిస్తుంటారు కదా. ప్రేమ వ్యవహారాల్లోనూ ఇలాంటి అనుచిత ధోరణులను కనిపిస్తుంటాయి. దీనికి కారణం డొపమిన్‌ శ్రుతిమించటం. ఆక్సిటోసిన్‌ కూడా మితిమీరితే తమ చుట్టుపక్కల పరిస్థితులను పట్టించుకోలేని విధంగా తయారుచేస్తుంది. నిర్లక్ష్యంగా ప్రవర్తించేలా చేస్తుంది.

కామాతురాణం న లజ్జ, న భయం అంటారు కదా. దీనికీ మెదడులోని యంత్రాంగాలే కారణం. మన మెదడులో విమర్శనాత్మ ఆలోచనలు, స్వీయ అవగాహన, సహేతుక ప్రవర్తన వంటి వాటిని నియంత్రించే భాగాలను శృంగార వాంఛ ఆపేస్తుంది. ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో.  ప్రేమలో మునిగినప్పుడు చేసిన పనులకు కొందరు ఆ తర్వాత పశ్చాత్తాపపడటం చూస్తూనే ఉంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని