కొత్త టెక్‌ లోకం

డిజిటల్‌ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్‌ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్‌ ఇంటెలిజెన్స్‌ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది.

Updated : 03 Jan 2024 06:58 IST

డిజిటల్‌ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్‌ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్‌ ఇంటెలిజెన్స్‌ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. మరి వచ్చే సంవత్సరాన్ని మలుపు తిప్పగల అలాంటి ట్రెండ్స్‌ ఏంటి? అవి మన జీవితం, సమాజం, ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఓసారి పరిశీలన చేద్దాం.

జనరేటివ్‌ ఏఐ నిత్య ఆటోమేషన్‌

గత సంవత్సరం జనరేటివ్‌ ఏఐ ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. దీని అసలు సామర్థ్యాలను, ప్రయోజనాలను ప్రపంచం ఈ సంవత్సరం చవి చూపనుంది. ఏఐ ఇప్పటికే సెర్చ్‌ ఇంజిన్ల దగ్గరి నుంచి ఆఫీసు సాఫ్ట్‌వేర్‌, కమ్యూనికేషన్‌ టూల్స్‌ వరకూ మన నిత్య జీవన వ్యవహారాల్లోకి  చొచ్చు కొచ్చింది. సరిగా వాడుకుంటే 24 గంటలూ సేవలు చేసే పర్సనల్‌ అసిస్టెంట్‌గానూ ఇది ఉపయోగపడగలదని అర్థమయ్యింది. మనం చేసే పనుల్లో వేగాన్ని పెంచటంతో పాటు నైపుణ్యాలను, ఉత్పాదకతను మెరుగు పరుస్తోంది. సమాచార సేకరణ, నిత్య వ్యవహారాల షెడ్యూలింగ్‌, ప్రాజెక్టుల రూపకల్పన వంటి మామూలు పనులను ఏఐకి అప్పగించే రోజులు త్వరలోనే రానున్నాయి. ఇది నిజమైన మానవ నైపుణ్యాల వెలికితీతకు మార్గం సుగమం చేయగలదు. మెషిన్లను ప్రోగ్రామింగ్‌ చేయటానికి బదులు సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణల అన్వేషణ, ఇతరులతో చర్చించటం, అసలైన ఆలోచనలకు మనం ఎక్కువ సమయం కేటాయించటానికి అవకాశం చిక్కుతుంది. జనరేటివ్‌ ఏఐ శరీరానికి ధరించే పరికరాలకూ విస్తరిస్తోంది. ఏఐ హార్డ్‌వేర్‌ ఇంకా పురిటి దశలోనే ఉన్నప్పటికీ దీంతో కూడిన పరికరాలు ఉత్సుకతను కలిగిస్తున్నాయి. దీని ఛాయలు గత సంవత్సరమే పొడసూపాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఏఐతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లను రూపొందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పేటెంట్‌ తీసుకుంది కూడా. హ్యూమేన్‌ సంస్థ రూపొందించిన ఏఐ పిన్‌ మరింత ముందడుగు వేసి ఫోన్‌ వంటి పరికరాలేవీ లేకుండా కాల్స్‌ చేసుకోవచ్చనీ నిరూపించింది. ఇది లేజర్‌ కాంతితో అరచేతినే ఫోన్‌ తెరగా మార్చేస్తుంది. వేళ్ల కదలికలతోనే పనిచేయగల ఇది అప్పటికప్పుడు ఇతర భాషల మాటలను అనువాదం చేస్తుండటం గమనార్హం. అమెజాన్‌ సంస్థ కళ్లకు ధరించే ఎకో ఫ్రేమ్స్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ ఐవేర్‌ పలు పరికరాలతో కనెక్ట్‌ కాగలదు. ఇందులో అమెజాన్‌ సొంత మీడియా ప్లేబ్యాక్‌ కూడా ఉంటుంది. నోటిఫికేషన్‌, ప్రైవసీ ఫీచర్లూ ఉన్నాయి. నౌవాచ్‌ సంస్థ త్వరలోనే కొత్త చేతి గడియారాన్ని తీసుకురావాలని సంకల్పించింది. ఇందులో ఏఐ ఆధారిత ఇన్‌సైట్స్‌ ఫీచర్‌ను జోడించనుంది. ఏఐ సాయంతో పనిచేసే ఇది రోజువారీ వ్యవహారాలను సమీక్షిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సలహాలూ ఇస్తుంది. దక్షిణ కొరియా కంపెనీ వి-టచ్‌ కొత్తరకం ఉంగరాన్ని తీసుకొస్తోంది. ఏఐతో రోజువారీ సంభాషణలు కొనసాగించటానికిది వీలు కల్పిస్తుంది. దీనిలోని విస్పర్‌ టెక్నాలజీ రణగొణధ్వనుల మధ్య కూడా తేలికగా మాట్లాడుకోవటానికి ఉపయోగపడుతుంది. అదీ గోప్యతను కాపాడుతూనే. నౌవాచ్‌ ఇన్‌సైట్స్‌, వీ-టచ్‌ విస్ప్‌ రింగు వచ్చే సీఈఎస్‌-2024లో ఆవిష్కృతం కానున్నాయి. ఇక మెటా ఏఐతో కూడిన రేబాన్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌ అయితే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మీద ప్రత్యక్ష ప్రసారాలకు వీలు కల్పిస్తుంది. ఇందులో 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా కూడా ఉంటుంది. రివైండ్‌ అనే ఏఐ యాప్‌ వినూత్న పెండెంట్‌ను తీసుకొస్తోంది. లాకెట్‌ మాదిరిగా దీన్ని మెడలో వేసుకుంటే మనం మాట్లాడే, మనకు వినిపించే మాటలను అక్షరాల రూపంలోకి మార్చి, ఎన్‌క్రిప్ట్‌ చేసి, ఫోన్‌లో స్టోర్‌ చేస్తుంది. ఇలాంటి వినూత్న ఏఐ ఫీచర్లతో కూడిన ఎన్నో పరికరాలు మున్ముందు మన శరీర అలంకరణలో భాగమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

భౌతిక డిజిటలీకరణ వాస్తవ, కాల్పనిక సమ్మేళనం

వాస్తవ, డిజిటల్‌ ప్రపంచాలు మరింతగా సమ్మిళితమవుతున్నాయి. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఇమ్మెర్సివ్‌ ఇంటర్నెట్‌లు భౌతిక, డిజిటల్‌ డొమైన్‌ల మధ్య హద్దులను చెరిపేస్తున్నాయి. ఇప్పటికే కాల్పనిక ప్రపంచంలో డిజిటల్‌ అవతార్లతో సంచరించటం ఎక్కువైపోయింది కూడా. జూమ్స్‌, టీమ్స్‌, స్లాక్‌ వంటి వేదికల ద్వారా ఎక్కడినుంచైనా ఉన్నతాధికారులు, సహోద్యోగులతో చర్చిస్తూ.. పనిచేయటం గమనిస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్‌ గేమింగ్‌, ఇ-స్పోర్ట్స్‌ కనీవినీ ఎరగని రీతిలో ఆదరణ పొందుతున్నాయి. ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వర్చువల్‌ స్పేసెస్‌నూ సృష్టించుకొని, నిజ జీవిత సంఘటనలను ముచ్చటగా ముచ్చటించుకుంటున్నాం. డిజిటల్‌ వ్యక్తిత్వాల ధోరణి కాల్పనికతనూ సంతరించుకుంటోంది. పరిశ్రమలకూ ఈ ధోరణి విస్తరిస్తూ వస్తోంది. డిజిటల్‌ ట్విన్స్‌ దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఇవి వ్యక్తులు, వస్తువులు, సంస్థలకు వర్చువల్‌ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ సంవత్సరం ఇది మరింత పుంజుకోవటం.. వాస్తవ, డిజిటల్‌ ప్రపంచాల మధ్య తేడా తగ్గిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. డిజిటల్‌ ప్రపంచం మరింత వాస్తవికంగా, వాస్తవ ప్రపంచం డిజిటల్‌ ప్రపంచంగా మారతాయన్నమాట. ఇక జన్యుశాస్త్రంలో రానున్న మార్పులు ప్రాథమిక జీవన సారాన్ని డిజిటల్‌ కోడ్‌ రూపంలోకి మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ కోడ్‌ను సవరించి, పునర్నిర్మిస్తే కొత్త మందుల రూపకల్పన, జబ్బుల నిర్మూలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టే.

సుస్థిర పరిజ్ఞానం సురక్షిత పర్యావరణం

వివిధ దేశాలు, సంస్థలు నెట్‌ జీరో లక్ష్యాలకు కట్టుబడటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సుస్థిర పరిజ్ఞానం (సస్టేనబుల్‌ టెక్నాలజీ) ఈ సంవత్సరమూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది. ప్రజలు కూడా తమ మూలంగా పర్యావరణం మీద పడే దుష్ప్రభావాలను టెక్నాలజీ సాయంతో తగ్గించే ప్రయత్నాలూ ముమ్మరం కానున్నాయి. నిత్య వ్యవహారాలను మరింత పర్యావరణ హితంగా చేయటానికి సుస్థిర టెక్నాలజీ తోడ్పడుతుంది. ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులు, బస్సుల వంటి వాటిని ఇప్పటికే వాడుతున్నాం. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరమూ ఇవి జోరందుకోనున్నాయి. అంతేకాదు, వాతావరణం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను ఒడిసిపట్టటం, దాన్ని నిల్వచేయటం వంటి వినూత్న ప్రక్రియలూ విస్తృతం కానున్నాయి. పర్యావరణ సమస్యల పరిష్కారానికి కొత్త దారులు తెరవనున్నాయి. వర్తుల ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ) కూడా ముఖ్యమైన అంశం కానుంది. వస్తువుల ఉత్పత్తి దశలోనే మన్నిక, పునర్వినియోగాలను దృష్టిలో పెట్టుకోవటం ప్రాధాన్యం సంతరించుకోనుంది. విద్యుత్‌ వినియోగం, కర్బన ఉద్గారాలను తగ్గించటానికి హరిత క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి భావనలను టెక్‌ సంస్థలు ఇంకాస్త బాగా అనుసరించే అవకాశముంది. తక్కువ విద్యుత్తును వాడుకునే, హరిత ఇంధనంతో పనిచేసే, పర్యావరణం మీద అవగాహన పెంచే సుస్థిర యాప్స్‌, సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ వంటివి పర్యావరణ హిత పద్ధతిలో జీవించటానికి మరింత ఎక్కువ అవకాశం కలిగించొచ్చు. కాకపోతే పరికరాల తయారీకి అవసరమైన పదార్థాలను వెలికితీయటం, వనరుల విషయంలో నైతికత, సుస్థిర పద్ధతుల రూపకల్పనలో యూజర్లు, డెవలపర్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

క్వాంటమ్‌ కనికట్టు

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చాలాకాలంగా గొప్ప ఆసక్తి రేపుతోంది. ఈ సంవత్సరంలో ఇది డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధ రంగాలను గణనీయంగా మలుపు తిప్పగలదని.. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలదని భావిస్తున్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ శక్తి, వేగం అలాంటివి మరి. ఇది ఎంటాంజిల్‌మెంట్‌, సూపర్‌పొజిషన్స్‌ అనే విచిత్ర అంశాల మూలంగా ఒకే సమయంలో ఎనలేని గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్‌.. అంటే 1 లేదా 0 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి, విడమరచుకుంటాయి. అదే క్వాంటమ్‌ కంప్యూటర్లు క్యూబిట్స్‌ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతుందన్నమాట. ఒకే సమయంలో రెండు పనులనూ చేయగలదు. క్వాంటమ్‌ రేణువులు ఎంటాంజిల్‌మెంట్‌ అనే విచిత్రమైన ప్రవర్తననూ ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్‌ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నా కూడా. ఎంటాంజిల్‌మెంట్‌ పుణ్యమాని క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్‌ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని రోజురోజుకీ వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, జన్యు క్రమ రూపకల్పన, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు. మహా నగరాల్లో వాహనాల రద్దీ, గ్రహాంతర జీవుల అన్వేషణ వంటి సంక్లిష్ట వ్యవస్థలు వేగంగా పనిచేయటానికీ ఉపయోగపడగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని