ఏఐ టెక్కులు!

అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్‌ ట్రాకర్ల దగ్గరి నుంచి  వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన.

Published : 17 Jan 2024 02:49 IST

అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్‌ ట్రాకర్ల దగ్గరి నుంచి  వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో ఈ సంవత్సరం నిర్వహించిన కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో కొట్టొచిన్నట్టు కనిపించింది ఇదే. చిన్నా పెద్దా సంస్థలన్నీ కృత్రిమ మేధ పరికరాల రూపకల్పనకే పెద్ద పీట వేశాయి. రోజువారీ జీవనంలోకి కృత్రిమ మేధ శరవేగంగా చొచ్చుకొని వస్తోందటానికివి ప్రత్యక్ష నిదర్శనాలు. పనులను సులభం చేసేవి కొన్నయితే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తోడ్పడేవి మరికొన్ని. ప్రయాణాల్లో తోడ్పడేవి కొన్నయితే.. వినోదాన్ని పంచేవి ఇంకొన్ని. వీటిల్లో ఉత్తమ వినూత్న ఆవిష్కరణలుగా ఎన్నికైన, ఎక్కువగా ఆకట్టుకున్న పరికరాల్లో కొన్ని ఇవీ..


శిశు రోదన అనువాదం

 శిశువులకు తెలిసిన భాష ఒక్కటే. ఆకలేసినా, దాహమేసినా, విసర్జన చేసినా, కడుపు నొచ్చినా అన్నీ ఏడుపుతోనే చెబుతారు. ఏడుపు ఒక్కటే అయినా అది అవసరాలను బట్టీ మారుతుంది. మరి వాటిని తెలుసుకోవటమెలా? పిల్లల ఏడుపు అవసరాలను అర్థం చేసుకోవటమెలా? ఇందుకోసం ఇందుకోసం కాపెలా అనే ఏఐ సాఫ్ట్‌వేర్‌ అంకుర సంస్థ వినూత్న యాప్‌ను ఆవిష్కరించింది. ఇది కృత్రిమ మేధ, మిషిన్‌ లెర్నింగ్‌ సాయంతో శిశు రోదనను ‘అనువాదం’ చేస్తుంది. దీనిలోని పరిజ్ఞానం 95% కచ్చితత్వంతో ఏడుపును విశ్లేషించి, శిశువుల అవసరాలను విడమరచి చెబుతుంది. కాకపోతే దీన్ని వాడుకోవటానికి నెలకు 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. శిశువుల శరీర ఉష్ణోగ్రతను గుర్తించేలా కూడా ఈ యాప్‌ను తీర్చిదిద్దుతున్నారు. అప్పుడు జ్వరం మూలంగా పిల్లలు ఏడుస్తున్నారనే విషయాన్నీ చెబుతుంది. గత సంవత్సరం సీఈఎస్‌లో శిశువుల ఏడుపును విశ్లేషించే క్యూబేర్‌ ప్లస్‌ అనే పరికరాన్నీ ప్రదర్శనకు పెట్టారు. అది ఇన్నోవేషన్‌ పురస్కారాన్నీ గెలుగుకుంది. కాపెలా యాప్‌ ప్రత్యేకత ఏంటంటే కొత్తగా పరికరాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేకపోవటం. దీన్ని ఫోన్‌లోనే వాడుకోవచ్చు. శిశువులు ఎలా నిద్రపోతున్నారు? ఎలా పాలు తాగుతున్నారు? ఎన్నిసార్లు డైపర్‌ మార్చాల్సి వస్తోంది? అనే సమాచారాన్నీ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇదిప్పటికే యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ యాప్‌ కోసమైతే వెయిట్‌లిస్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


పారదర్శక టీవీ

ఇప్పుడు ఎవరింట్లో చూసినా పెద్ద టీవీలే. ఆన్‌లో లేనప్పుడు అదో నల్ల తెరలా కనిపిస్తుంది. త్వరలో ఈ పరిస్థితి మారనుంది. ఎల్‌జీ సంస్థ పారదర్శక ఓఎల్‌ఈడీ తెర టీవీని ఆవిష్కరించింది. నిజానికిది నల్ల తెరలానే ఉంటుంది గానీ కావాలనుకుంటే పారదర్శకంగా మార్చుకోవచ్చు. అప్పుడు వెనకాల గోడ, దృశ్యాలు కనిపిస్తాయి. టీవీ సెటింగ్స్‌ మెనూలోకి వెళ్లి ఇష్టమైన స్క్రీన్‌ సేవర్లను ఎంచుకోవచ్చు. వర్చువల్‌ అక్వేరియంలా మార్చుకోవచ్చు. బ్లాక్‌ స్క్రీన్‌ను ఎంచుకుంటే మామూలు టీవీగా మారిపోతుంది. ఇది వైర్‌లెస్‌ కూడా. అంటే కేబుల్‌ బాక్స్‌, గేమ్‌ కన్సోల్‌ వంటివి 30 అడుగుల దూరంలో ఉన్నా సంకేతాలను అందుకుంటుంది. పారదర్శక ఓఎల్‌ఈడీ పరిజ్ఞానం పాతదే అయినా వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుండటం కొత్త విషయం.


కాల్పనిక ప్రపంచ స్పర్శ

మెటావర్స్‌లాంటి కాల్పనిక ప్రపంచంలో వస్తువుల స్పర్శ తెలిస్తే? చేత్తో తాకి వాటి బరువును గుర్తిస్తే? వర్చువల్‌ కౌగిలి నిజమైన కౌగిలింత మాదిరి అనుభూతిని కలిగిస్తే? ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌ కథలా అనిపిస్తోంది కదా. ఫాంటమ్‌ పరికరం దీన్నే నిజం చేస్తోంది. గ్లవుజులాగా ఉండే దీన్ని చేతికి తొడుక్కుంటే స్పేషియల్‌ కంప్యూటర్‌ యుగంలో స్పర్శ అనుభూతిని కలిగిస్తుంది. ఎఫెరెన్స్‌ అనే కంపెనీ తయారు చేసిన ఇది వేళ్ల ద్వారా హెపాటిక్‌ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది. నాడీ వ్యవస్థతో అనుసంధానమై వాస్తవిక వస్తువులను తాకిన అనుభూతిని కలిగిస్తుంది. వేళ్లకు చుట్టుకునే దీని రింగులు పారదర్శక ఇంటర్ఫేస్‌తో డిజిటల్‌, భౌతిక ప్రపంచాల మధ్య తేలికగా మారటానికీ వీలు కల్పిస్తాయి. మణికట్టుకు ధరించే ఫాంటమ్‌ పరికరం కంప్యూటింగ్‌ హెడ్‌సెట్‌, కళ్లద్దాలు, మొబైల్‌ ఫోన్‌.. ఇలా వేటితోనైనా అనుసంధానమై పనిచేస్తుంది.


మగువ ఆరోగ్య ఉంగరం

హెల్త్‌ ట్రాకర్లకు కొదవలేదు. వాచ్‌, రింగుల దగ్గరి నుంచి ఫోన్‌ యాప్‌ల వరకూ ఎన్నెన్నో చూశాం. కానీ ఈవీ రింగు తీరే వేరు. దీన్ని మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఇది నెలసరి సమయం, అండం విడుదల, రుతుక్రమ లక్షణాలను పసిగడుతుంది. అలాగే రోజూ వేసే అడుగులు, చురుకుదనం, నిద్ర, మూడ్‌, రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు, గుండె వేగం వంటి వాటినీ ట్రాక్‌ చేస్తుంది. ఎబ్బెట్టుగా కనిపించకపోవటం మరో విశేషం. ఆభరణం మాదిరిగా వేలికి ధరిస్తే చాలు. నిద్రపోతున్నప్పుడూ ధరించొచ్చు. బ్యాటరీ ఖాళీ అవుతుందనే దిగులూ ఉండదు. మొబైల్‌ యాప్‌తో అనుసంధానమయ్యే ఇది ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, స్టోర్‌ చేస్తుంది. యాప్‌ను ఓపెన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరి వేలి సైజుకైనా సరిపోయేలా ఉండటం మరో ప్రత్యేకత. ఆయా సైజులకు అనుగుణంగా మారిపోతుంది. దీనికి చందా కట్టాల్సిన అవసరమేమీ లేదు. ఒకసారి కొనుక్కుంటే చాలు. ప్రస్తుతానికిది ఐఓఎస్‌ పరికరాలకే అందుబాటులో ఉంది.


కృత్రిమ మేధ తల

కృత్రిమ మేధకు తల మొలిస్తే? మన తల మాదిరిగా కనిపిస్తూ, మనం అడిగిన వాటికి జవాబులిస్తే? వీహెడ్‌ అలాంటిదే. ఒకరకంగా దీన్ని ఏఐ ఛాట్‌బాట్‌కు మానవ రూపాన్ని కల్పించిన టెక్నాలజీ అనుకోవచ్చు. ఈ పరికరాన్ని డెస్క్‌ వంటి చోట్ల అమర్చుకోవచ్చు. నాలుగు డిస్‌ప్లేలతో కూడిన ఇది మనుషులను అనుకరిస్తుంది. అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తుంది. దీన్ని ఉపాధ్యాయుడుగా, సంరక్షకుడిగా, ఏఐ సహాయకుడిగా, వార్తలు చదివేవారిగా, సెలబ్రిటీలు, ఆత్మీయుల డిజిటల్‌ క్లోన్‌గా.. ఎలా అయినా వాడుకోవచ్చు. దీనిలోని ఎల్‌ఎల్‌ఎం మేధోమథనానికి, నిర్ణయాలు తీసుకోవటానికీ ఉపయోగపడుతుంది.


కారుతో ముచ్చట

ఇప్పటివరకూ ఛాట్‌జీపీటీని కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలోనే వాడుకుంటున్నాం. మరి దీన్ని కార్లకూ అనుసంధానం చేస్తే? అదీ మాటలతోనే అవసరమైన పనులు చేయించుకుంటే? ఫోక్స్‌వాగన్‌ అలాంటి విచిత్రమే చేసింది. ఛాట్‌జీపీటీ ఏఐ ద్వారా కారుతో మాట్లాడేలా చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఐడా వాయిస్‌ అసిస్టెంట్‌ను రూపొదించింది. ఇది డ్రైవర్‌ మాటలను గ్రహించి, చెప్పిన పనిని చేసి పెడుతుంది. ఇప్పటికే దారి చూపించటం, ఫోన్‌ మెసేజ్‌లకు జవాబివ్వటం.. కారులో ఉష్ణోగ్రతను పెంచటం, తగ్గించటం వంటి పనులకిది ఉపయోగపడుతోంది. మున్ముందు మనిషితో మాట్లాడుతున్నట్టుగానే కారుతోనూ మాట్లాడే వీలు కలగనుంది. అడిగిన ప్రశ్నలను విశ్లేషించి, వాటికి తగిన సమాధానాలను మాటల రూపంలో వివరించగలదు. ఉదాహరణకు- ‘హాయ్‌ ఐడా.. నాకు చలి పెడుతోంది’ అని అడిగారనుకోండి. మనం ఉన్న వైపున వేడి పెంచుతున్నానని చెప్పి, ఆ పని చేసి పెడుతుంది. ‘దగ్గరలో మంచి హోటల్‌ ఉందా?’ అని అడిగితే చుట్టుపక్కల హోటళ్ల వివరాలను డ్యాష్‌బోర్డు మీద చూపిస్తుంది. ఇష్టమైన హోటల్‌ను ఎంచుకుంటే అక్కడికి దారి చూపిస్తుంది. మనకు ఇష్టమైన వంటకాలు గల హోటళ్లున్నాయా? అని అడిగినా చూపిస్తుంది. ఛాట్‌జీపీటీతో అనుసంధానమై ఉండటం వల్ల సంక్లిష్టమైన ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వగలదు. కారులో పిల్లలు ఉన్నట్టయితే వారికి విసుగు పుట్టకుండా అప్పటికప్పుడు చిన్న కథలను సృష్టించి, వినిపించగలదు కూడా.


పర్యావరణ హిత మౌజ్‌

కాలుష్యాన్ని తగ్గించటానికి చాలారకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ ఎర్గోఫ్లిప్‌ ఎకోస్మార్ట్‌ మౌజ్‌. ఇది చాలావరకు వాడి పారేసిన ప్లాస్టిక్‌, ప్యాకేజీ వ్యర్థాలతోనే తయారు చేశారు మరి. విద్యుత్‌ వాడకాన్ని తగ్గించుకోవటానికిది బ్లూటూత్‌ టెక్నాలజీని వాడుకుంటుంది. ఇందులో బిల్టిన్‌గా బ్లూ ట్రేస్‌ టెక్నాలజీ ఉంటుంది. అందువల్ల ఇన్‌ఫ్రారెడ్‌ ఆప్టికల్‌ ట్రాకింగ్‌తో వేర్వేరు రకాల ఉపరితలాల మీద అతి కచ్చితంగా పనిచేస్తుంది. దీని మీద సూక్ష్మక్రిములు వృద్ధి చెందకుండా డిఫెన్స్‌ గార్డ్‌ యాంటీమైక్రోబియల్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉంటుంది. మౌజ్‌ మీదుండే మీట సాయంతో చిటికెలో ఎడమ చేతి నుంచి కుడి చేతి వాటంలోకి మార్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని