పాస్‌వర్డా? పాస్‌కీనా?

ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డ్‌లు వాడుతూనే ఉంటాం. కానీ త్వరలోనే ఇవి తెరమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుత ధోరణి   ఇలాగే అనిపిస్తోంది. పాస్‌వర్డ్‌ స్థానంలో పాస్‌కీ వేగంగా దూసుకొస్తోంది మరి.

Updated : 13 Sep 2023 01:17 IST

ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డ్‌లు వాడుతూనే ఉంటాం. కానీ త్వరలోనే ఇవి తెరమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుత ధోరణి ఇలాగే అనిపిస్తోంది. పాస్‌వర్డ్‌ స్థానంలో పాస్‌కీ వేగంగా దూసుకొస్తోంది మరి. ఇప్పటికే దీన్ని కొన్ని సంస్థలు అమల్లోకి తెచ్చాయి కూడా. ఇంతకీ పాస్‌కీ అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది?

పాస్‌వర్డ్‌ ఎంత బలంగా ఉంటే, ఎంత విభిన్నంగా ఉంటే అంత సురక్షితం. ఆన్‌లైన్‌ భద్రతకిది అత్యావశ్యకం. అయితే పాస్‌వర్డ్‌లు ఎంత కఠినమైనవైనా, ఎంత సంక్లిష్టమైనవైనా హ్యాకర్లు వీటిని ఛేదించే అవకాశం లేకపోలేదు. ఒకసారి పాస్‌వర్డ్‌ గుట్టు మోసగాళ్లకు చేరితే ప్రపంచంలో ఎక్కడినుంచైనా మన ఖాతాల్లోకి జొరపడొచ్చు. ఇక్కడే పాస్‌కీ కొత్త మార్గంగా కనిపిస్తోంది. ఇది మనతోనే, మన పరికరంతోనే ముడిపడి ఉండటం వల్ల ఆన్‌లైన్‌ సెక్యూరిటీ నిపుణులు దీని వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. పాస్‌వర్డ్‌ మాదిరిగానే పనిచేసినా మరింత భద్రత కల్పిస్తుండటమే దీనికి కారణం.

పాస్‌వర్డ్‌లతో చిక్కేంటి?

పాస్‌వర్డ్‌ల విషయంలో చాలామంది చేసే పొరపాటు మరచిపోకుండా ఉండటానికి తేలికైనవి సృష్టించుకోవటం. సంకేతాలు, అంకెలు లేని పొట్టి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటారు. వీటిని సాఫ్ట్‌వేర్‌ తేలికగా అంచనా వేయగలదు. హ్యాకర్లు ఛేదించటానికి అనువుగా ఉంటాయి. కొందరు ఒకే పాస్‌వర్డ్‌ను చాలా ఖాతాలకూ పెట్టుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో మోసగాళ్లు అన్ని ఖాతాల్లోకీ చొరబడే ప్రమాదముంది. ఎందుకంటే పాస్‌వర్డ్‌లను దొంగిలించటం తేలిక. నకిలీ వెబ్‌పేజీలో లాగిన్‌ అయితే వెంటనే హ్యాకర్లకు తెలిసిపోతుంది. వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కుతుంది.

పాస్‌కీ అంటే?

పాస్‌వర్డ్‌ లేకుండా ఖాతాలకు లాగిన్‌ కావటానికి తోడ్పడే మార్గమే పాస్‌కీ. కేవలం అథెంటికేటర్‌తోనే.. అంటే ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ వంటి మరో పరికరంతోనే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే అథెంటికేటర్‌ మన గుర్తింపును ధ్రువీకరించి, ఖాతాలోకి వెళ్లేలా చేస్తుందన్నమాట. పాస్‌వర్డ్‌ కన్నా దీని వాడకం తేలిక. సురక్షితం కూడా. పాస్‌కీని వాడటానికి ముందు పరికరంతో అథెంటికేట్‌ చేసుకోవాలని సిస్టమ్‌ సూచిస్తుంది. అప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో పిన్‌ లేదా వేలిముద్ర వంటి బయోమెట్రిక్‌ పద్ధతితోనే లాగిన్‌ కావొచ్చు. దీన్ని ఒకరకంగా పరికరంతోనే లాగిన్‌ కావటానికి ఆయా ఖాతాలకు అనుమతి ఇవ్వటం లాంటిదని చెప్పుకోవచ్చు. పాస్‌వర్డ్‌లో మాదిరిగా ఇందులో లోపాలేవీ ఉండవు. పాస్‌వర్డ్‌ తెలిసినా అథెంటికేషన్‌తో కూడిన పరికరం ఉంటే తప్ప హ్యాకర్లు మన ఖాతాలోకి చొరపడే అవకాశముండదు. పాస్‌వర్డ్‌లేవీ ఉండవు కాబట్టి ఫిషింగ్‌కూ ఆస్కారముండదు. హ్యాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో పాస్‌కీని అంచనా వేయటం, ఛేదించటం అసాధ్యం. కఠినమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోలేనివారికిది ఎంతో ఉపయుక్తం. ఒక్క పాస్‌కీతోనే  ఖాతాలను భద్రంగా కాపాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ పిన్‌, వేలిముద్రల వంటివి ఉంటే చాలు. రకరకాల పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమూ తప్పుతుంది.

రోజురోజుకీ విస్తృతం

వివిధ రకాల వెబ్‌సైట్లు, యాప్‌లు పాస్‌కీని ఇప్పటికే అనుమతిస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు ఇంకా ఈ సదుపాయాన్ని కల్పించటం లేదు గానీ త్వరలోనే పాస్‌వర్డ్‌ల స్థానాన్ని పాస్‌కీలు ఆక్రమిస్తాయనటంలో సందేహం లేదు. నిజానికి కఠినమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లు ఎప్పటికీ సురక్షితమే. దీన్ని కాదనటానికి లేదు. ఇలాంటివి పెట్టుకున్నవారు, ఆన్‌లైన్‌ భద్రత మీద అవగాహన ఉన్నవారు పాస్‌కీకి మారాల్సిన అవసరం ఉండకపోవచ్చు. తేలికైన పాస్‌వర్డ్‌లు నిర్ణయించుకునేవారు, చాలా ఖాతాలకు వాటినే వాడేవారు మాత్రం పాస్‌కీలకు మారటమే ఉత్తమమన్నది నిపుణుల భావన. ఇవి మంచి భద్రత కల్పిస్తాయి.

తప్పనిసరి అవుతాయా?

చాలా వెబ్‌సైట్లు ఇప్పుడు పాస్‌వర్డ్‌ల కోసం షరతులు విధించటం చూస్తూనే ఉన్నాం. కనీసం ఇన్ని అక్షరాలు ఉండాలని.. అంకెలు, సంకేతాలు ఉండాలని సూచిస్తుండటం అనుభవమే. చాలా వెబ్‌సైట్లు టు-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ నిర్దేశించుకోవాలనీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాస్‌కీ మున్ముందు తప్పని సరైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతానికిది పురిటి దశలోనే ఉన్నా త్వరలో విస్తృతమయ్యే అవకాశముంది. టెక్నాలజీ మీద పెద్దగా పట్టులేనివారు ఇప్పుడు పాస్‌వర్డ్‌ల కన్నా పాస్‌కీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి వాడకం పెరిగితే హ్యాకింగ్‌ ప్రమాదమూ చాలావరకు తగ్గుతుంది.

పాస్‌వర్డ్‌లనే వాడుకోవాలనుకుంటే?

పాస్‌కీల ఉద్దేశం బలహీనమైన పాస్‌వర్డ్‌ల బెడదను తగ్గించటం. అయితే కఠినమైన పాస్‌వర్డ్‌లు వాడుకునేవారికివి తప్పనిసరేమీ కాదు. ఒకవేళ పాస్‌కీ వద్దనుకుంటే, పాస్‌వర్డ్‌లనే కొనసాగించాలని భావిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

  • పొడవైన పాస్‌వర్డ్‌లు నిర్ణయించుకోవాలి. ఇందులో అక్షరాలు, అంకెలు, సంకేతాలు విధిగా ఉండాలి. దీంతో హ్యాకర్లు పాస్‌వర్డ్‌ను అంచనా వేయటం, ఛేదించే అవకాశం తగ్గుతుంది.
  • అన్ని ఖాతాలకూ ఒకే పాస్‌వర్డ్‌ వాడొద్దు. ఒక్కో ఖాతాకు ఒక్కో పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకోవాలి. దీంతో ఒక పాస్‌వర్డ్‌ను హ్యాకర్‌ ఛేదించినా మిగతావి భద్రంగా ఉంటాయి.
  • ఒకవేళ వేర్వేరు పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవటం కష్టమైతే పాస్‌వర్డ్‌ మేనేజర్ల సాయం తీసుకోవచ్చు. లాగిన్‌ వివరాలను నిల్వ చేసుకోవటానికివి మంచి మార్గం.
  • అపరిచితుల నుంచి, అనుమానిత వెబ్‌సైట్ల నుంచి వచ్చే ఈమెయిళ్లకు స్పందించొద్దు. వాటిల్లోని లింకులను క్లిక్‌ చేయొద్దు.
  • టు-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వాడుకోవాలి. ఇదీ పాస్‌కీ మాదిరిగానే ఉపయోగపడుతుంది. టు-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ నిర్ణయించుకుంటే పరికరానికి అందే పిన్‌ నంబరును ఎంటర్‌ చేస్తేనే ఖాతాకు లాగిన్‌ అవటానికి వీలవుతుంది. ఇది హ్యాకర్లకు చెక్‌ పెడుతుంది. పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు అంచనా వేయటం, ఛేదించటం, దొంగిలించటం వంటివి తప్పుతాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని