ఇంటి గాలిని వడపోసే మొక్క

వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్‌, టొల్యూన్‌, జైలీన్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజేన్సీ చెబుతోంది.

Published : 14 Feb 2024 00:12 IST

వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్‌, టొల్యూన్‌, జైలీన్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజేన్సీ చెబుతోంది. గోడలు, తలుపులు, కిటికీలకు వేసే రంగులు.. దుస్తులు ఉతకటానికి, గచ్చు కడగటానికి ఉపయోగించే ద్రవాలు.. ఫర్నిచర్‌ కలప, రోజూ వాడే పరికరాల వంటి వాటి నుంచి ఇవి వెలువడుతుంటాయి. వీటిని వడపోయటానికి ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫయర్లను అమర్చుకోవటం తెలిసిందే. ఇవే కాదు.. ఇంట్లో పెంచుకునే మొక్కలూ కాలుష్య కారకాలను వడపోస్తాయి. కాకపోతే అంత ఎక్కువగా పెంచుకోవటం సాధ్యం కాదు. ఇలాంటి సమస్యను పరిష్కరించటానికి నియోప్లాంట్స్‌ అనే బయోటెక్‌ సంస్థ వినూత్న మొక్కలను సృష్టించింది. మనీ ప్లాంట్‌గా పిలుచుకునే డెవిల్స్‌ ఐవీ మొక్కలను బయో ఇంజినీరింగ్‌ పద్ధతిలో డీఎన్‌ఏను మార్చి.. మరింత ఎక్కువగా కాలుష్య కారకాలను పీల్చుకునేలా తీర్చిదిద్దింది. ఇవి మామూలు మొక్కల కన్నా 30 రెట్లు అధికంగా గాలిలోని హానికారక సేంద్రియ రసాయనాలను స్వీకరిస్తుండటం విశేషం. ఫార్మాల్డిహైడ్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లు గల మొక్కల్లో డెవిల్స్‌ ఐవీ ఒకటి. కాకపోతే ఇవి అతి తక్కువ స్థాయిలోనే విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే ఎంజైమ్‌ల వ్యక్తీకరణను పెంచేలా వీటి డీఎన్‌ఏను మార్చారు. అలాగే విచ్ఛిన్నమైన ఫార్మాల్డిహైడ్‌ను కార్బన్‌ డయాక్సైడ్‌గా మార్చే ఒకరకం బ్యాక్టీరియా ఎంజైమ్‌నూ జోడించారు. మొక్కలు కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకోవటం ద్వారానే తమకు అవసరమైన గ్లూకోజును తయారు చేసుకుంటాయి కదా. అంటే ఈ మొక్కలు గాలిలోంచి విష పదార్థాలను మరింతగా తీసుకొని.. వాటిని చక్కెరగానూ మార్చుకుంటుందన్నమాట.

  • పర్యావరణ పరిరక్షణ కోసం అగప్యో అనే సంస్థ వృక్ష ఆధారిత థర్మోప్లాస్టిక్‌ను రూపొందించింది. ఇది సేంద్రియ పదార్థాల మాదిరిగా తనకుతానే క్షీణిస్తుంది. దీన్ని పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. తనకుతానే క్షీణిస్తుంది కాబట్టి కంపోస్టు ఎరువులకూ ఉపయోగించుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని