El Nino: ఎల్‌నినో కథ
ఎల్‌నినో. పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్‌మౌత్ కాలేజ్ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం.
ఎల్‌నినో. పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్‌మౌత్ కాలేజ్ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.281 లక్షల కోట్ల నష్టం సంభవించొచ్చనీ పేర్కొంటోంది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఎల్‌నినో అంటే ఏంటి? ఎందుకొస్తుంది?
పగలు, రాత్రి.. రోజులు దొర్లుతుంటాయి. ఎండ, వాన, చలి.. కాలాలు, రుతువులు మారుతుంటాయి. అన్నీ ఒక వలయంగా వస్తూ, పోతుంటాయి. భూమ్మీద జీవనం వీటి మీదే ఆధారపడి నడుస్తుంది. ఇలాంటి మార్పులు చాలావరకు కొద్ది వ్యవధులకే పరిమితమవుతుంటాయి. వీటిని కచ్చితంగా అంచనా వేయొచ్చు. రాత్రి ఎప్పుడవుతుందో, ఉదయం ఎప్పుడు మొదలవుతుందో చెప్పొచ్చు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎప్పుడొస్తాయో, ఎప్పుడు ముగుస్తాయో ముందే అవగతమైపోతుంది. అయితే మంచుయుగం వంటి కొన్ని మార్పుల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని అంచనా వేయటం అంత తేలిక కాదు. కానీ వాతావరణం, జీవజాతుల మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పులతో సంభవించే ఎల్‌నినో అలాంటిదే.
సముద్రాలు వాతావరణం
మహా సముద్రాలు, వాతావారణానికి మధ్య విడదీయరాని సంబంధముంది. పసిఫిక్ మహా సముద్రం విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్‌నినో పుట్టేదే ఇక్కడే మరి. భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన అటూఇటూ సుమారు 30 డిగ్రీల మధ్య ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలంటారు. భూభ్రమణం మూలంగా ఇక్కడ గాలి భూమధ్యరేఖ వైపు మొగ్గుతుంది. ఈ గాలి కోరియోలిస్ ఎఫెక్ట్ మూలంగా ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశ వైపు, దక్షిణార్ధగోళంలో వాయువ్యం వైపు కదులుతుంది. దీనికి అధిక పీడనమూ తోడై భూమధ్యరేఖకు రెండు వైపులా గాలులు తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. వీటినే వాణిజ్య గాలులు (ట్రేడ్ విండ్స్) అంటారు. ఒకప్పుడు నావికులు పసిఫిక్ మహా సముద్రం గుండా తేలికగా ప్రయాణాలు చేయటానికి వీటిని వాడుకునేవారు. వాణిజ్య గాలుల బలాన్ని బట్టి మహా సముద్ర ఉపరితలం చల్లబడటం, వేడెక్కటం ఒక వలయంలా సాగుతుంది. సాధారణంగా పసిఫిక్ మహా సముద్రంలో వాణిజ్య గాలులు భూమధ్యరేఖ వద్ద తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. ఇవి దక్షిణ అమెరికా తీర ప్రాంతం నుంచి వేడి నీటిని ఆసియా దిశకు లాక్కొస్తాయి. ఈ వేడి నీటిని భర్తీ చేయటానికి సముద్రపు లోతుల్లోంచి చల్లటి నీరు పైకి వస్తుంది (అప్‌వెలింగ్). ఈ చల్లటి నీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితం మీదుండే పైటోఫ్లాంక్టన్‌కు ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిని చేపలు తిని, వృద్ధి చెందుతాయి. అయితే వాణిజ్య గాలులు బలహీనపడ్డప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గటం వల్ల ఉపరితల వేడి జలాలను పడమర వైపునకు బలంగా నెట్టలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు వేడి నీరు భూమధ్యరేఖ వద్దే పోగుపడుతూ వస్తుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. గాలి కూడా వేడెక్కుతుంది. అలాగే తూర్పు వైపున చల్లటి నీరు పైకి రావటమూ తగ్గుతుంది. దీంతో చల్లగా ఉండాల్సిన మహాసముద్ర భాగాలు వేడెక్కుతాయి. ఇదే ఎల్‌నినో. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు- వేడి సముద్ర ఉపరితలం, కింద చల్లటి నీటి మధ్య ఉండే లోతూ తగ్గుతుంది (థర్మోక్లైన్). దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం తీరుతెన్నులు గణనీయంగా మారిపోతాయి. వరదలు, కరవులు, క్షామం, సముద్రజీవుల మూకుమ్మడి మరణాల వంటి వాటికి దారితీస్తుంది. పెరూ వంటి దేశాల్లో కుంభవృష్టి, వరదలు పెరిగితే.. భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరవు, క్షామం సంభవిస్తాయి. అంటే ప్రపంచంలో ఏ ప్రాంతమైనా వాతావరణ ప్రభావంతోనో, సామాజిక-ఆర్థిక పరంగానో నేరుగా ఎల్‌నినో ప్రభావానికి గురికావాల్సిందేనన్నమాట. బలమైన ఎల్‌నినో తొలి సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయని అమెరికా-యూరప్ ఉపగ్రహం సెంటినెల్-6 మైఖేల్ ఫ్రీలిచ్ ఇటీవల గుర్తించింది. సముద్ర ఉపరితలం మీద వేలాది మైళ్ల విస్తీర్ణంలో 2-4 అంగుళాల ఎత్తుతో వాణిజ్య అలలు ఎగుస్తున్నాయని పసిగట్టింది. ఇవి 2023లో ఎల్‌నినో రావచ్చొని గట్టిగా చెబుతున్నాయి. ఓషియానిక్ నైనో ఇండెక్స్ (ఓఎన్‌ఐ) ఆధారంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో తేడాలను లెక్కిస్తారు. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా నమోదైతే ఎల్‌నినోకు సంకేతంగా భావిస్తారు.
బాల ఏసు పేరిట
పసిఫిక్ మహా సముద్రంలో వేడి నీటి తీరుతెన్నులను తొలిసారిగా 17వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్ తీరప్రాంత జాలరులు గమనించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్‌మస్ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు ‘ఎల్‌నినో డి లా నేవిడాడ్’. అంటే ‘ద క్రిస్‌మస్ చైల్డ్’.. అంటే బాల ఏసు అని అర్థం. ఇక 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణమేంటనేది తెలుసుకోవటం మీద దృష్టి సారించారు. చివరికివి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని, ఎల్‌నినో ప్రభావంతోనే ఏర్పడు తున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. దీన్నే సదరన్ ఆసిలేషన్ అనీ అంటారు. ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందనీ తెలుసుకున్నారు. అయితే ఇదేమీ కచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు రెండేళ్లకూ, మరికొన్ని సార్లు 7 సంవత్సరాలకూ ఏర్పడొచ్చు. సాధారణంగా ఇది 9-12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ ఉండొచ్చు.
ఏం జరుగుతుంది?
ఎల్‌నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్‌నినో విభిన్నమైందే. ఒకోటీ ఒకోలా ప్రభావం చూపుతుంది. ఎల్‌నినోతో వరదలు, కరవులు సంభవించడమే కాదు.. వాతావరణం వేడెక్కటం మరో సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కటం వల్ల వాతా వరణంలోకి పెద్దమొత్తంలో శక్తి విడుదలవుతంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలూ పెరుగు తాయి. ఎల్‌నినో సమయంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవటానికి కారణమిదే. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే.
* ఎల్‌నినో ఏర్పడినప్పుడు పగడపు దీవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 1998లో ఏర్పడిన ఎల్‌నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 16% పగడపు దీవులు నశించాయని అంచనా. 2015-16లో వచ్చిన ఎల్‌నినో సమయంలో ప్రపంచవ్యాప్తంగా 75-99% పగడాలు నశించాయి. ఎల్‌నినోతో కార్చిచ్చులు చెలరేగటమూ ఎక్కువవుతుంది.
మనదేశంపై ప్రభావమేంటి?
మహా సముద్రాలు వేడెక్కటం వల్ల ఉపఖండం మీద నైరుతి రుతు పవనాల కదలికలు మందగించొచ్చు. ఫలితంగా వర్షాలు పడటం తగ్గుతుంది. మనదేశంలో 2023లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. జూన్-సెప్టెంబర్ కాలంలో ఎల్‌నినో వాతావరణం 90% వరకు ఏర్పడొచ్చని పేర్కొంది. వర్షపాతం తక్కువగా ఉండొచ్చనే ఇది సూచిస్తోంది. గతంలో ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాల్లో వర్షపాతం సగటు కన్నా తక్కువ నమోదవటం గమనార్హం.
* ఎల్‌నినో ఏర్పడినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో పంటలకు నష్టం కలిగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.
* మనదేశంలో 2001-2020 మధ్యకాలంలో తొమ్మిది ఎల్‌నినో సంవత్సరాలను ఎదుర్కొంది. వీటిల్లో నాలుగు ఎల్‌నినో సంవత్సరాల్లో కరవు ఏర్పడింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90% తక్కువగా వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరాల్లో ఖరీఫ్‌లో పంట దిగుబడి 16%, 8%, 10%, 3% చొప్పున తగ్గాయి. ద్రవ్యోల్బణానికి దారితీశాయి. మనదేశ వార్షిక ఆహార సరఫరాలో సుమారు సగం వాటా ఖరీఫ్ కాలంలోనే పండిన పంటలదే.
వ్యతిరేకం లానినా
సాధారణంగా క్రిస్‌మస్ సమయంలో ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. కొద్ది నెలల పాటు కొనసాగుతూ వస్తుంది. తర్వాత వెనక్కి మళ్లుతుంది. ఈ క్రమంలో ఎల్‌నినోకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదే లానినా. అంటే స్పానిష్‌లో బాలిక అని అర్థం. ఈ సమయంలో వాణిజ్య గాలులు బలం పుంజుకొని, వేడి నీటిని పడమర వైపునకు బాగా నెట్టేస్తాయి. దీంతో తూర్పు వైపున చల్లటి నీరు పైకి ఉబికి వస్తుంది. ఇది ఎల్‌నినోకు పూర్తి విభిన్నం. అందుకే దీన్ని యాంటీ- ఎల్‌నినో అనీ పిలుచుకుంటారు. ఇదీ వాతావరణం మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతుంది. సాధారణంగా లానినా కన్నా ఎల్‌నినో తరచూ ఏర్పడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Politics News
‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం