ఫార్మా రంగంలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్‌ సొంతం: కేటీఆర్‌

ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టనుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబరేటరీని

Published : 18 May 2022 20:32 IST

హైదరాబాద్‌: ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టనుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబరేటరీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు ఇంగ్లాండ్‌కు చెందిన సర్ఫేస్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్ సంస్థ ప్రకటించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం సంస్థ ఎండీ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, ప్రతినిధుల బృందం లేబరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 7వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ల్యాబ్‌లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాస్యూటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు చేపట్టనున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ లేబరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండేళ్లలో ల్యాబ్‌ను మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుకూల విధానాలే హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్ ఏర్పాటుకు కారణమని సంస్థ ఎండీ విలియమ్స్ వెల్లడించారు. దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలతో ఈ ల్యాబ్ కలిసి పనిచేస్తుందని.. దీంతో తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. హైదరాబాద్ లాంటి పారిశ్రామిక అనుకూలతలున్న నగరంలో ల్యాబ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని విలియమ్స్‌ చెప్పారు. హైదరాబాద్ ఫార్మా రంగంలో ప్రవేశిస్తున్న సర్ఫేస్ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ ఏర్పాటు చేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. ఫార్మా రంగానికి సంబంధించి దేశంలో ఏ రాష్ట్రానికీ లేని అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని.. సర్ఫేస్ మేనేజ్‌మెంట్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని