MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళాయె

రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా కింద ఆరు శాసనమండలి స్థానాలకు నవంబరు 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలు ...

Updated : 23 Feb 2024 17:04 IST

ఆరు స్థానాలకు 29న పోలింగ్‌
షెడ్యూలు విడుదల చేసిన ఈసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా కింద ఆరు శాసనమండలి స్థానాలకు నవంబరు 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలు విడుదల చేసింది. నవంబరు 9న నోటిఫికేషన్‌తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిలకు ఆరేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 3న పూర్తయింది. సాధారణంగా సభ్యుల పదవీ కాలం ముగియటానికి ముందే ఈసీ ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తుంది. కరోనా కారణంగా అప్పట్లో వాయిదా వేసింది. ‘ఎన్నికల నిర్వహణపై అధికారులతో సంప్రదింపులు జరిపాక, పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.  అందుకే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించాం. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల్లో కొవిడ్‌ మార్గదర్శకాలను పర్యవేక్షించేందుకు ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. డిసెంబరు ఒకటో తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

షెడ్యూల్‌ ఇదే
ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబరు 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న పరిశీలన... నవంబరు 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏకగ్రీవాలు కాని పక్షంలో 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు అయిదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని