Jagan: రెండేళ్లలో 94.5% హామీల అమలు

ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల్లో ఈ రెండేళ్లలో 94.5% అమలు చేశామని, ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌

Updated : 31 May 2021 07:45 IST

1,41,52,386 ఇళ్లకు ఏదో ఒక పథకంలో లబ్ధి
ప్రజలకు రూ.1,31,725 కోట్ల అందజేత
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల్లో ఈ రెండేళ్లలో 94.5% అమలు చేశామని, ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇంకా చేయాల్సిన వాటి కోసం అవసరమైన అడుగులు వేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో దాదాపు 66% అక్కాచెల్లెమ్మలకే అందుతున్నాయని, ఆ వివరాలతో కూడిన లేఖ, ఎన్నికల ప్రణాళిక అమలు డాక్యుమెంటును వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ పంపిస్తున్నామని వెల్లడించారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘రెండో ఏటా- ఇచ్చిన మాటకే పెద్దపీట’ పేరిట లేఖ, ‘మలిఏడు-జగనన్న తోడు-జగనన్న మ్యానిఫెÆస్టో-2019’ పేరిట ఉన్న డాక్యుమెంటును ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రెండేళ్లలో సంతృప్తికరంగా పరిపాలించగలిగామన్న తృప్తి ఉందన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నాం. రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్లుంటే.. వాటిలో 1,41,52,386 (86%) ఇళ్లకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చాం.
నగదు బదిలీ పథకాల (డీబీటీ) ద్వారా రూ.95,528 కోట్లు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యాకానుక, ఇళ్ల స్థలాలు, వైఎస్‌ఆర్‌ కంటివెలుగు వంటి ఇతర పథకాల ద్వారా (నాన్‌ డీబీటీ) ద్వారా రూ.36,197 కోట్లు ప్రజలకు చేరాయి. మొత్తంగా రూ.1,31,725 కోట్లు ప్రజలకు అందించాం. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే తీసుకెళ్లి అందించాం.
ఈ స్థాయిలో ప్రజలకు మంచి చేయడానికి గ్రామ వాలంటీరు, సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది మొదలు కలెక్టర్ల వరకూ అధికారులు అందరూ తోడుగా నిలిచారు. వారి సహాయ సహకారాలతోనే ఇవన్నీ అమలు చేయగలిగాం.
ప్రతి ఇంటికీ లేఖ, డాక్యుమెంటు
వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ ఒక లేఖ, డాక్యుమెంటు అందజేస్తాం. లేఖలో లబ్ధిదారు పేరు ప్రస్తావించి, ఆ కుటుంబానికి ఏయే పథకాలు ఇవ్వగలిగాం, ఎంత మంచి చేయగలిగాం, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాల్లో ఈ రెండేళ్లలో వారికి ఏమేం చేశామన్నది లెక్కలతో సహా అందులో వివరిస్తాం.
ఎన్నికల ప్రణాళికను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లా భావించి అందులోని ప్రతి అంశాన్నీ అమలు చేసేందుకు ఈ రెండేళ్లలో ప్రతి అడుగూ వేశాం.
ఎన్నికల సమయంలో కేవలం రెండు పేజీలతో కూడిన ఎన్నికల ప్రణాళికనే ఇచ్చాం. అందులో పేర్కొన్న వాటిలో ఏయే అంశాలు అమలు చేశాం? ఎన్ని అంశాల అమలుకు అడుగులు పడ్డాయి?    ఇంకా ఏవేం అమలు చేయాల్సి ఉందనే వివరాలతో పాటు, ఎన్నికల ప్రణాళికలో చెప్పనవి కూడా ఏం చేశామో వివరిస్తూ ఒక డాక్యుమెంటునూ ఈ లేఖతో పాటు పంపిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని