Telangana News: ఇంటి యజమానికి ‘ఈ ప్రాపర్టీ’ కార్డు

దేశవ్యాప్తంగా 2025 నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి అతని ఇంటికి సంబంధించి హక్కుదారుడి హోదా కల్పించి ‘ఈ-ప్రాపర్టీ’ కార్డు అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని స్వామిత్వ (సర్వే ఆఫ్‌ విలేజ్‌ అండ్‌ మ్యాపింగ్‌

Published : 08 May 2022 08:55 IST

స్వామిత్వ పేరిట అమలు చేస్తోన్న కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ

రాష్ట్రంలో తొలుత అయిదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా..

దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా 2025 నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి అతని ఇంటికి సంబంధించి హక్కుదారుడి హోదా కల్పించి ‘ఈ-ప్రాపర్టీ’ కార్డు అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని స్వామిత్వ (సర్వే ఆఫ్‌ విలేజ్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) పేరిట కేంద్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలుత ప్రయోగాత్మకంగా అయిదు గ్రామాల్లో అమలు చేసి సాధ్యాసాధ్యాలు మదింపు చేయనున్నారు. ఇందులో భాగంగా అయిదు అంశాలను ప్రామాణికంగా తీసుకొని గ్రామాలను ఎంపిక చేశారు. అవి.. జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ (అధిక ఎస్సీ సామాజిక జనాభా), ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లి (గిరిజన జనాభా), మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట (హెచ్‌ఎండీఏ పరిధి), రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సరస్వతి గూడ (అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ సమీప గ్రామం), కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం (అధిక జనాభా).
ఏం చేస్తారంటే: ఈ గ్రామాల్లో ప్రతి ఇంటిని డ్రోన్లు సహా ఉపగ్రహం ద్వారా సర్వే చేస్తారు. ఇంటి యజమానితో మాట్లాడి నిర్మాణ ఉనికిని తెలుసుకొని ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తారు. అనంతరం అన్ని వివరాలు పరిశీలించి యజమానికి స్వామిత్వ కార్డు అందించి ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తారు.

ప్రయోజనాలేంటి: ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజల ఆస్తులను ఆర్థిక సంపదగా పరిగణిస్తారు. దీని ఆధారంగా వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ఆస్తుల మాదిరిగా వీటికి సరిహద్దులు నిర్ణయిస్తారు. పంచాయతీ అభివృద్ధి సమావేశాల్లో ఎప్పటికప్పుడు వీటి అనుశీలన చేస్తారు. తనఖాకు, విక్రయించడానికి, ఆర్థిక సహాయానికి బ్యాంకులు ఈ కార్డులను పరిగణనలోకి తీసుకుంటాయి. కేంద్రం అమలు చేయనున్న ఈ పథకం అమలుకు క్షేత్ర స్థాయిలో డివిజనల్‌, మండల పంచాయతీ అధికారులు, కార్యదర్శిని శిక్షణకు పంపించినట్లు జనగామ జిల్లా పంచాయతీ అధికారి కండ్లకుంట రంగాచారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని