సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదికపై ఏం చేద్దాం?

పదిమంది పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలన్న సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదిక తెలంగాణ పోలీసుశాఖలో కలకలం రేపుతోంది. దీనిపై హైకోర్టు విచారణ సమయంలో

Published : 23 May 2022 04:16 IST

విచారణ సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారుల మల్లగుల్లాలు

ఈనాడు, హైదరాబాద్‌: పదిమంది పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలన్న సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదిక తెలంగాణ పోలీసుశాఖలో కలకలం రేపుతోంది. దీనిపై హైకోర్టు విచారణ సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీని తర్వాత మళ్లీ ఇప్పుడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. త్వరలోనే దీనిపై హైకోర్టులో వాదనలు మొదలయ్యే అవకాశం ఉండడంతో పోలీసు శాఖలో సమాలోచనలు జరుగుతున్నాయి. దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన ఉదంతంపై సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇటీవల నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. తాము ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులు మరణించారన్న పోలీసుల వాదనను కమిషన్‌ తప్పుపట్టింది. ప్రతి అంశంలోనూ వారు చెప్పిన అంశాలను కమిషన్‌ వ్యతిరేకించింది.

గతంలో రెండు సందర్భాలు
2010 జులై 1న ఆదిలాబాద్‌ అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఆజాద్‌ మరణించారు. అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. కానీ పోలీసులే ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపారని సీబీఐ నిర్ధారించలేకపోయింది. దానికంటే ముందు గుజరాత్‌లో జరిగిన సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై న్యాయస్థానం ఆదేశాల మేరకు నియమించిన ఆ రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం అప్పటి ఉమ్మడి ఏపీ పోలీసుల పాత్రను  విచారించింది. సోహ్రాబుద్దీన్‌ దంపతుల కదలికల సమాచారాన్ని ఏపీ పోలీసులే గుజరాత్‌ అధికారులకు ఇచ్చారన్న అభియోగంపై విచారణకు సిట్‌ బృందం హైదరాబాద్‌ వచ్చింది.  ఈ కేసులోనూ ఇక్కడి పోలీసుల పాత్ర ఉన్నట్లు నిరూపణ కాలేదు. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ కేసు పోలీసులను ఉత్కంఠకు గురిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని