Agnipath: నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులంతా ఇంటికే!

అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా తమ

Updated : 21 Jun 2022 07:14 IST

ఆ తర్వాతే రెగ్యులర్‌ సర్వీసు కోసం దరఖాస్తు
‘25% ఎంపిక’ పూర్తిగా సైన్యం ఇష్టం
దీనిపై అభ్యర్థులకు హక్కు ఉండదు
నోటిఫికేషన్‌లో ఆర్మీ స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా తమ పరిధిలోని అంశమని, ఆ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కూ ఉండదని స్పష్టంచేసింది. నోటిఫికేషన్‌లోని అంశాలివీ..

సంస్థాగత అవసరాలు, భవిష్యత్తులో ప్రకటించే విధానాల ఆధారంగా నాలుగేళ్ల సర్వీసు పరిమితిని పూర్తిచేసిన అగ్నివీరులకు భారత సైన్యంలోని రెగ్యులర్‌ కేడర్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని ఇస్తారు. ఈ దరఖాస్తులను సైన్యం కేంద్రీకృతంగా పరిశీలిస్తుంది. నాలుగేళ్ల విధినిర్వహణలో అగ్నివీరుల పనితీరుతోపాటు, ఇతర కోణాల్లో వారి ప్రతిభను మదింపు చేస్తుంది. ప్రతి బ్యాచ్‌లో 25% మందికి మించకుండా అగ్నివీరులను రెగ్యులర్‌ కేడర్‌లోకి తీసుకుంటుంది.

ఇలా సాధారణ కేడర్‌లో చేరిన వారు ఉద్యోగ విధివిధానాలకు లోబడి తదుపరి 15 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. సాధారణ సర్వీసులకు తప్పనిసరిగా ఎంపిక చేయాలని కోరే హక్కు అగ్నివీరులకు ఉండదు. ఈ ఎంపిక పూర్తిగా సైన్యం పరిధిలోని అంశం.

అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో వైద్య విభాగం మినహా రెగ్యులర్‌ కేడర్‌లో సైనిక నియామకం అగ్నివీరులుగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న వారి ద్వారానే జరుగుతుంది.

అగ్నివీరులకు ఎలాంటి పింఛను, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగులకు వర్తింపజేసే కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీం, క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఎస్‌డీ) సౌకర్యం, మాజీ సైనికోద్యోగి హోదా, ఇతర ప్రయోజనాలు ఉండవు.

అగ్నివీరులు సర్వీసుకాలంలో తమకు తెలిసిన రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం పూర్తిగా నిషిద్ధం. వారు సైనిక ప్రయోజనాల దృష్ట్యా ఏ బాధ్యతలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక రెజిమెంట్‌లో నియమితులైన వారిని తర్వాత మరో రెజిమెంట్‌కు బదిలీ చేయొచ్చు.

అగ్నిపథ్‌ కింద చేరేవారికి భిన్నమైన ర్యాంకులు ఇస్తారు.

విద్యార్హతలివీ..

జనరల్‌ డ్యూటీ (సాధారణ విధుల) కోసం దరఖాస్తు చేసుకొనే అగ్నివీరుల వయసు 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతి 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 33% మార్కులు రావాలి.  ఏదైనా బోర్డు మార్కులు కాకుండా గ్రేడింగ్‌ విధానం పాటిస్తున్నట్లయితే అన్ని సబ్జెక్టుల్లో కనీసం ‘డి’ గ్రేడ్‌ (33% నుంచి 40%) సాధించాలి. మొత్తంమీద ‘సి2’ గ్రేడ్‌ (45%కి సమానం)తో పాసై ఉండాలి.

టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 40% మార్కులు వచ్చి ఉండాలి.
క్లర్క్‌/ స్టోర్‌కీపర్‌ టెక్నికల్‌ (అన్ని విభాగాలు): 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌లో ఏదో ఒక గ్రూప్‌ (ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌) 60% మార్కులతో, ఒక్కో సబ్జెక్ట్‌లో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌/ అకౌంట్స్‌/ ఖాతా పుస్తకాల నిర్వహణ (బుక్‌ కీపింగ్‌)లో 50% మార్కులు తప్పనిసరి.

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ 10 పాస్‌ (అన్ని విభాగాలు): 10వ తరగతి పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్‌లో 33% మార్కులు వచ్చి ఉండాలి.

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ 8 పాస్‌ (ఆల్‌ ఆర్మ్స్‌): 8వ తరగతి సాధారణంగా పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్‌లో 33% మార్కులు వచ్చి ఉండాలి.


సడలింపులు, బోనస్‌ మార్కులు

మాజీ సైనికోద్యోగుల పిల్లలు, యుద్ధ వితంతువుల సంతానానికి కొన్ని విభాగాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలో బోనస్‌ మార్కులు లభిస్తాయి. ఎన్‌సీసీ ఎ, బి, సి సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారికి సైతం కొన్ని మార్కులు కలుస్తాయి.

సైనిక, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఎత్తులో 2 సెంటీమీటర్లు, బరువులో 2 కిలోలు, ఛాతీ కొలతలపరంగా సెంటీమీటరు మేర సడలింపు ఉంటుంది.  

యుద్ధ వితంతువులు దత్తత తీసుకున్న కుమారులు, ఒకవేళ కుమారులు లేకపోతే అల్లుళ్లకూ పైన పేర్కొన్న మినహాయింపులు వర్తిస్తాయి. సైనికుడు బతికివున్న కాలంలో చేసుకున్న దత్తతకు మాత్రమే ఈ బోనస్‌ మార్కులు, మినహాయింపులు వర్తిస్తాయి.


నేడు త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ భేటీ

గ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశం కానున్నారు. తొలుత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌తో భేటీ అవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని