పల్లెల చరిత్రకు అక్షర రూపం

‘మన ఊరికి చరిత్రలో కొన్ని పేజీలుండాలి’ అనే నినాదంతో కళాశాల విద్యాశాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

Published : 30 Nov 2022 03:43 IST

కళాశాల విద్యా శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ వినూత్న కార్యక్రమం
కొన్ని జిల్లాల్లో కార్యాచరణ అమలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ‘మన ఊరికి చరిత్రలో కొన్ని పేజీలుండాలి’ అనే నినాదంతో కళాశాల విద్యాశాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. పల్లెల చరిత్రకు అక్షర రూపమిచ్చేందుకు నిర్ణయించాయి. తెలంగాణ పల్లెలు ఆవిర్భావ వికాసాలు, జానపదుల జీవితం, నాటి భాష తదితరాలకు దర్పణాలు. చరిత్ర నిర్మాణంలో వీటి పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో గ్రామాల పుట్టుపూర్వోత్తరాలు, వాటి భౌగోళిక వివరాలు, ఆర్థిక వనరులు, రాజకీయ నేపథ్యం, పాలన విధానం, పారిశుద్ధ్య నిర్వహణ, పంటల సాగు, సాగునీటి వసతులు, పశుపోషణ, కులాల చరిత్ర, చారిత్రక విశేషాలు, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న తీరు, స్వాతంత్య్ర సమరయోధుల గాథలు, తెలంగాణ సాయుధ పోరాట వీరుల వివరాలను వీరు సమగ్రంగా సేకరించనున్నారు.

కోఆర్డినేటర్ల నియామకం

రచయితలు, పరిశోధకులకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల చరిత్రను రాయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాశాల విద్యాశాఖ సంయుక్తంగా ‘మన ఊరు-మన చరిత్ర’ పేరిట పల్లెల చరిత్రను విద్యార్థుల ఆధ్వర్యంలో రాయించాలని నిర్ణయించాయి. ఇందుకుగాను ఆర్ట్స్‌, కామర్స్‌తో పాటు ఇతర విభాగాల్లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల సేవలను వినియోగించుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించాయి. కోఆర్డినేటర్లు స్థానిక అధ్యాపకులు, ప్రధానాచార్యులతో సమావేశాలు నిర్వహించి సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మల్‌, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌లలో కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు మిగతా జిల్లాల్లో సన్నాహక సమావేశాలు పూర్తిచేసి డిసెంబరు మొదటివారం నుంచి చరిత్ర రాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.


పలు ప్రయోజనాలు

గ్రామాల చరిత్రను నిక్షిప్తం చేయడం ద్వారా పలు ప్రయోజనాలుంటాయి. భావితరాలకు చరిత్రను అందించే వీలు కలుగుతుంది. ప్రస్తుతం సర్కారు కళాశాలల విద్యార్థులు సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో ప్రైవేటు విద్యాసంస్థల పిల్లల్నీ ఇందులో భాగస్వామ్యం చేస్తాం.

డాక్టర్‌ వి.శంకర్‌, కోఆర్డినేటర్‌, కామారెడ్డి

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు