డీపీఆర్‌ను ఆమోదించాలని గోదావరి బోర్డుకు సూచించాలి

కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Published : 06 Dec 2022 05:39 IST

కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వినతి

ఈనాడు, దిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులకు భూ సేకరణ చేస్తున్నారంటూ శ్రీరాం గంగాజమున, చెరకు శ్రీనివాసరెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం పిటిషన్‌ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ వాదనలు వినిపించారు. ‘‘అనుమతుల్లేకుండా మూడో టీఎంసీ పనులు చేపట్టవద్దని జల్‌శక్తిశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. విస్తరణ పనులపై నివేదికలు సమర్పించాలని కోరింది. అనుమతులు లేకుండా పనులు సాగించరాదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సైతం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం 2 టీఎంసీల ప్రాజెక్టుతోనే పంపుహౌస్‌ల మునక వంటి సమస్యలు తలెత్తాయి. మరో టీఎంసీ పనులకు అనుమతిస్తే జరగబోయే నష్టాలపై అధ్యయనం చేయాలి’’ అని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ‘‘కేంద్ర అనుమతుల కోసం డీపీఆర్‌ సమర్పించాం. దానిని సీడబ్ల్యూసీ ఆమోదించింది. ప్రస్తుతం జీఆర్‌ఎంబీ వద్ద ఉంది. దానిని బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదు. డీపీఆర్‌ను ఆమోదించేలా జీఆర్‌ఎంబీకి సూచనలు ఇవ్వాలి’’ అని కోరారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపిస్తూ ‘‘ఈ పనులపై సుప్రీంకోర్టు గతంలో స్టేటస్‌కో విధించింది. ప్రభుత్వం, జల్‌శక్తి శాఖల నుంచి స్పష్టత రావాలి’’ అని అన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు