చిన్నారుల భద్రతపై మార్గదర్శకాలేవి?

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్‌ కారు డ్రైవర్‌ అఘాయిత్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

Published : 27 Apr 2023 05:12 IST

కార్యరూపం దాల్చని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్‌ కారు డ్రైవర్‌ అఘాయిత్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. స్పందించిన ప్రభుత్వం ఆ వెంటనే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల భద్రతపై మార్గదర్శకాలు రూపొందించేందుకు గత నవంబరులోఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఇందులో కార్మికశాఖ, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ, పోలీసు విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని, అనంతరం విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆనాడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ ప్రకారమే  కసరత్తు కూడా జరిగింది. పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు, కొన్ని సంఘాల ప్రతినిధులతో రెండు రోజులపాటు కమిటీ చర్చించింది. ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి, డీజీపీ సైతం కమిటీ సభ్యులు, ఇతర అధికారులతో చర్చించారు. మొత్తానికి గత డిసెంబరులో పలు సిఫారసులతో నివేదికను సీఎం కార్యాలయానికి పంపారు. ఆమోదం లభించాల్సి ఉంది.  పాఠశాలల పునఃప్రారంభం జూన్‌ 13 నాటికైనా ఆమోదం వస్తుందా అన్నది వేచిచూడాలి. ముందుగా మార్గదర్శకాలు జారీ అయితే పాఠశాలల యాజమాన్యాలు ఆయా సిఫారసుల అమలుకు చర్యలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇవీ కొన్ని సిఫారసులు...

* అన్ని బడుల్లో సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటుచేయాలి. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను నియమించాలి.

* మొబైల్‌లాంటి డిజిటల్‌ పరికరాలను సురక్షితంగా ఎలా వాడుకోవాలో సూచించాలి. సోషల్‌ మీడియా ప్రభావానికి లోనుకాకుండా అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రత తదితరాలపై కూడా అవగాహన పెంపొందించాలి.

* ప్రతి పాఠశాలలో ఫిర్యాదు పెట్టెలను ఉంచాలి. సీసీ కెమెరాలు తప్పనిసరి.

* వాచ్‌మెన్‌, సెక్యూరిటీ, ఇతర పురుష సిబ్బందిని నియమించుకునే ముందు వారి పూర్వాపరాలు పరిశీలించాలి. అవసరమైతే పోలీసుశాఖ సహకారం తీసుకోవాలి.

* ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు విధిస్తారు తదితర న్యాయపరమైన అంశాలపై అవగాహన పెంచాలి.

* నైతిక విలువల గురించి ప్రత్యేక పుస్తకాలను ప్రవేశపెడితే చదవకుండా పక్కన పడేసే ప్రమాదం ఉంది. అందుకే తెలుగు, సోషల్‌వంటి సబ్జెక్టుల్లో ఆయా పాఠ్యాంశాలను మిళితం చేయాలి.

* అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే ఫోన్‌ చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటుచేయాలి.

* విద్యాసంస్థలోకి ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు ఒకటే గేట్‌ ఉంటే పర్యవేక్షణ సులభమవుతుంది.

* బాలికల హాస్టళ్లకు ప్రహరీల నిర్మాణం, రాత్రిళ్లు లైట్లు తదితర మౌలిక వసతుల కల్పన తప్పనిసరి.

భారీ జరిమానా అంటే రూ.లక్ష

డీఏవీ ఘటన నేపథ్యంలో ఆ పాఠశాల యాజమాన్యానికి భారీ జరిమానా విధిస్తామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు అప్పుడు ప్రకటించారు. తీరా రూ.లక్ష మాత్రమే జరిమానా విధించారు. దాన్ని ఆ పాఠశాల యాజమాన్యం చెల్లించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని