పేదల చెంతకు వైద్యవిద్య

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం వైద్యకళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచడం వల్ల 5,540 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Published : 30 May 2023 04:22 IST

గత పదేళ్లలో ఎంబీబీఎస్‌ సీట్లు 2,850 నుంచి 8,390కి చేరాయి
కొత్త కళాశాలలు రావడంతో మారుమూల ప్రాంతాలకు వైద్యం
‘ఈనాడు’తో కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి

ఈనాడు, వరంగల్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం వైద్యకళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచడం వల్ల 5,540 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో అందరికీ వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర విభజన హామీలో ఒప్పందం గడువు ఈ ఏడాది ముగుస్తుండటంతో.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంధ్రాకు కేటాయిస్తున్న మరో 300 ఎంబీబీఎస్‌ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, సీట్ల పెంపుదల వల్ల విద్యార్థులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, పదేళ్లలో కాళోజీ వర్సిటీ సాధించిన విజయాలపై ‘ఈనాడు’తో ఉపకులపతి ముఖాముఖి.

దేశంలోనే అత్యధికంగా...

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు కళాశాలలు ఉండేవి. నేడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే వేళ ఏకంగా 26 ప్రభుత్వ, 28 ప్రైవేటు కళాశాలలు వచ్చాయి.  అప్పుడు ఎంబీబీఎస్‌ సీట్లు 2,850, పీజీ 1,183 ఉండగా, ఇప్పుడు ఎంబీబీఎస్‌లో 8,390, పీజీలో 2,716కు చేరాయి. మహబూబాబాద్‌, భూపాలపల్లి, కొత్తగూడెం లాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు వల్ల నిరుపేదలకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చింది. మారుమూల జనాలకు వైద్యసేవలు అందించాలనే దూరదృష్టితోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కువ సంఖ్యలో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయించారు. వీటివల్ల ఉద్యోగాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. వైద్యవిద్య కోసం విద్యార్థులు ఉక్రెయిన్‌, రష్యా, చైనా తదితర దేశాలకు వెళ్లే పాట్లు తప్పాయి. మన దగ్గర లక్ష మంది జనాభాకు 22 వైద్య సీట్లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. వైద్య విద్యలో 10 శాతం గిరిజనులకు రిజర్వేషన్‌ అమలుచేస్తున్నాం. మైనారిటీ విద్యార్థులకు ఎక్కువ సీట్లు ఇస్తోంది తెలంగాణ రాష్ట్రమే.

వచ్చే ఏడాది నుంచి..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని ఎంబీబీఎస్‌, పీజీ సీట్లలో ఆంధ్రా విద్యార్థులకు సుమారు 300 సీట్లు కేటాయించాం. ఈ ఏడాదితో పదేళ్ల రిజర్వేషన్‌ నిబంధన ముగియనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మన విద్యార్థులకు ఈ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. విజయవాడలో ఒక్క కళాశాలలో మన విద్యార్థులకు 30 సీట్ల వరకు వచ్చేవి. వచ్చేఏడాది నుంచి అవి అందుబాటులో ఉండవు. యునాని, ఆయుర్వేద, నేచురోపతి లాంటి కోర్సుల్లోనూ సైతం వచ్చే ఏడాది వందల సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. వైద్యరంగం అవసరాలకు తగ్గట్టు కాళోజీ వర్సిటీ ప్రభుత్వ కళాశాలల్లోనే 14 వైద్య అనుబంధ కోర్సులు(అలాయిడ్‌) ఉన్నాయి. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, ఆప్తోమెట్రీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, రేడియో థెరపీ.. ఇలా కొత్త కోర్సులు రావడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తమిళనాడు, కేరళ తర్వాత మెరుగైన వైద్యసేవలు అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం గర్వకారణం.


డిజిటలైజేషన్‌ హెల్త్‌ వర్సిటీగా గుర్తింపు

కాళోజీ వర్సిటీ.. తొలి డిజిటలైజేషన్‌ హెల్త్‌ వర్సిటీగా గుర్తింపు పొందింది. మూల్యాంకనం సైతం ఫేస్‌ రికగ్నైజేషన్‌తో ఆన్‌లైన్‌లోనే జరిగేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాం. అన్ని అవసరాలకు ప్రభుత్వంపై ఆధారపడకుండా రూ.100 కోట్ల కార్పస్‌ ఫండ్‌ను సిద్ధంచేశాం. కొత్తగా ఏర్పాటైన కళాశాలలన్నింటికీ కలిపి ఒక్కచోట రూ.15 లక్షలు వెచ్చించి డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక్క గాంధీలోనే డిజిటల్‌ క్లాస్‌రూం ఉండేది. ఉస్మానియా, గాంధీ, కేఎంసీ ఏదో ఒక్క పెద్ద కళాశాలలో నిపుణులైన వైద్యులు పాఠాలు బోధించినా అందరూ వినేలా, అరుదైన రోగులు వచ్చినప్పుడు వారి కేస్‌ స్టడీస్‌ను మిగతా కళాశాలల విద్యార్థులకు బోధించి చికిత్స విధానం తెలుసుకునేలా ఈ సదుపాయం కల్పిస్తున్నాం. వర్సిటీ కోసం అత్యాధునిక భవనం నిర్మించాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు