నిమ్స్‌ విస్తరణకు 14న శ్రీకారం

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Published : 07 Jun 2023 03:35 IST

రూ. 1,571 కోట్లతో 2వేల పడకల భవనానికి సీఎం శంకుస్థాపన
మంత్రి హరీశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘‘నిమ్స్‌ విస్తరణలో భాగంగా రూ.1,571 కోట్లతో నిర్మించనున్న 2,000 పడకల ఆసుపత్రి భవనానికి ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అక్కడ 5,000 మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. తొమ్మిదేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖ సాధించిన విజయాలు, అందిస్తున్న వైద్య సేవలపై జిల్లాల వారీగా కరపత్రాలను రూపొందించాలి. ఆయా కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల సమన్వయంతో ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించాలి. ఉత్తమ సేవలు అందించిన ఆశావర్కర్‌, ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, వైద్యులు తదితరులకు ప్రశంసాపత్రాలను, జ్ఞాపికలను అందించాలి.  అన్ని వైద్య విభాగాల ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాల వారీగా ఏర్పాట్లను పర్యవేక్షించాలి. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, మెదక్‌లో కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతామహంతి, మహబూబ్‌నగర్‌లో ఆయుష్‌ కమిషనర్‌ ప్రశాంతి, వరంగల్‌లో డీఎంఈ రమేష్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు, నిజామాబాద్‌లో వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, కరీంనగర్‌లో సీఎం ఓఎస్డీ గంగాధర్‌, రంగారెడ్డి జిల్లాలో ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి, హైదరాబాద్‌లో టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మంలో ఈడీ కౌటిల్య ఆయా కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా దృష్టి సారించాలి’’ అని ఆదేశించారు. అనంతరం నిమ్స్‌లో భవన నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతాన్ని ఉన్నతాధికారులతో కలిసి మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని