ఏకరూపం... రంగు మారి గందరగోళం!

ఏకరూప దుస్తులంటే ఒకేవిధంగా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాశాఖ సరఫరా చేసిన వస్త్రం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకే తానులో వచ్చిన వస్త్రంలో కొంతభాగం రంగులతో, మరికొంత భాగంగా రంగు వెలసినట్లుగా, మరోచోట తెల్లగా ఉండటం గమనార్హం.

Published : 08 Jun 2023 04:58 IST

పాఠశాలలకు అస్తవ్యస్తంగా యూనిఫాం వస్త్రం సరఫరా
నిర్ణీత డిజైన్‌కు భిన్నంగా జిల్లాలకు పంపిణీ
రూ.145 కోట్లు ఖర్చు చేస్తున్నా పర్యవేక్షించని ఎస్‌ఎస్‌ఏ

ఈనాడు, హైదరాబాద్‌: ఏకరూప దుస్తులంటే ఒకేవిధంగా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాశాఖ సరఫరా చేసిన వస్త్రం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకే తానులో వచ్చిన వస్త్రంలో కొంతభాగం రంగులతో, మరికొంత భాగంగా రంగు వెలసినట్లుగా, మరోచోట తెల్లగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వాటిని పిల్లలకు కుట్టించాలా? వద్దా? అనేది తేల్చుకోలేక చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. దీనికి సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) పర్యవేక్షణ లోపమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుత విద్యా సంవత్సరం(2023-24)లో తరగతుల వారీగా అయిదు రకాల డిజైన్లలో ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని విద్యాశాఖ ఫిబ్రవరిలోనే నిర్ణయించింది. విద్యార్థులంతా కార్పొరేట్‌ తరహాలో కనిపించాలనే లక్ష్యంతో ఎనిమిది నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు ప్యాంట్లు, కింది తరగతుల వారికి నిక్కర్లు ఉంటాయి. విద్యార్థినులకు దుస్తుల నమూనాను మార్చారు. మొత్తం 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 20.62 లక్షల మంది పిల్లలకు దుస్తులు అందించేందుకు రూ.145 కోట్లు అవుతుందని అంచనా వేశారు. వస్త్ర సేకరణ బాధ్యతను తెలంగాణ చేనేత సహకార సంస్థ(టెస్కో)కు అప్పగించారు. అంతవరకు బాగానే ఉన్నా సరఫరా చేసిన వస్త్రం రంగు రకరకాలుగా ఉండటంతోపాటు డిజైన్‌లోనూ కొంత తేడా కనిపించింది. కొందరు ప్రధానోపాధ్యాయులు వస్త్రం తీరును గమనించి విద్యాశాఖకు సమాచారం అందించారు.

నిర్దేశిత రంగులు, డిజైన్లు మారడంతో సంబంధిత అధికారులపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి వస్త్రంతో యూనిఫాంలు కుట్టిస్తే ఒక్కో విద్యార్థి ఒక్కో రంగుతో కనిపిస్తారని, విద్యాశాఖ అభాసుపాలవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. దాంతో ఆయా జిల్లాల నుంచి రంగురంగుల వస్త్రాన్ని వెనక్కి తెప్పించాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశించారు. వాస్తవానికి టెస్కో సరఫరా చేసిన వస్త్రం నిర్దేశిత డిజైన్‌ ప్రకారమే తయారైందా? లేదా? అన్న విషయాన్ని... సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వారి ఉదాసీనతతో దుస్తుల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.

అందరికీ యూనిఫాం ఆలస్యమే: చాలా జిల్లాల నుంచి 20-30 శాతం వస్త్రాన్ని వెనక్కి రప్పించాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు అందేసరికి కనీసం రెండు నెలలు పడుతుందని సమాచారం. ఇప్పటికే చాలాచోట్ల వస్త్రాన్ని కొలతల ప్రకారం కత్తిరించిన దర్జీలు ఇప్పుడు వాటిని వెనక్కి పంపితే తమకు కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలని అడుగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని