కవితకు 15 రోజుల రిమాండ్‌

దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌ నేరారోపణలపై అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్‌ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం 11 గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్‌ రిమాండ్‌ కోరారు.

Published : 27 Mar 2024 05:05 IST

రౌజ్‌ అవెన్యూ కోర్టు జడ్జి ఉత్తర్వులు
కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయండి
కవిత దరఖాస్తు.. విచారణ వాయిదా
తిహాడ్‌ జైలుకు తరలింపు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌ నేరారోపణలపై అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్‌ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం 11 గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్‌ రిమాండ్‌ కోరారు. అందుకు న్యాయమూర్తి కావేరీ బవేజా అంగీకరించారు. ‘‘ఈ కేసులో నిందితురాలి పాత్రపై దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉంది. అక్రమార్జనను వెలికితీయడంతోపాటు ఇందులో భాగస్వాములైనవారు, నేరపూరిత ఆర్జనకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిని గుర్తించే పని కొనసాగుతోందని, ఇది ఆర్థిక నేరం కావడం వల్ల సాధారణ నేరాల కంటే సంక్లిష్టంగా ఉంటుందని ఈడీ చేసిన వాదనలను దృష్టిలో ఉంచుకొని ఆమెను ఏప్రిల్‌ 9 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపుతున్నాం. ఆ రోజు ఉదయం 11 గంటలకు నిందితురాలిని కోర్టు ముందు హాజరుపరచాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్న కారణంగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత పెట్టుకున్న దరఖాస్తుపై అభిప్రాయం చెప్పడానికి ఈడీకి ఏప్రిల్‌ 1 వరకు గడువు ఇచ్చారు. ఆ ప్రతిని నిందితురాలి న్యాయవాదికి ముందస్తుగా అందించాలని ఆదేశించారు.

‘ప్రధాన కుట్రదారు, లబ్ధిదారు కవితే’

ఈ సందర్భంగా ఈడీ తరఫున హాజరైన ప్రత్యేక న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపిస్తూ ‘‘ప్రస్తుతానికి నిందితురాలిని 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని ఈడీ కోరుతోంది. అయితే సెంథిల్‌ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను అనుసరించి నిందితురాలిని ఆ తర్వాత కూడా జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరే హక్కును రిజర్వ్‌లో ఉంచుకుంటోంది. దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారు కవితే. సౌత్‌ గ్రూప్‌లోని ఇతర సభ్యులతో కలిపి ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రధాన నాయకులతో కుట్ర పన్ని రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారు. అందుకు ప్రతిఫలంగా మద్యం విధానంలో అనుచిత ప్రయోజనాలు పొందారు. ఈమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.

మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత న్యాయవాదుల వినతి

కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌధరి వాదనలు వినిపిస్తూ ‘‘పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 19(2)లోని నిబంధనలను అనుసరించి అన్ని రికార్డులను భద్రపర్చడంతో పాటు మాకు అందుబాటులో ఉంచేలా ఆదేశించాలి. కస్టడీలో ఉన్న సమయంలో ఆమె మెడికల్‌ రికార్డులను అందించాలి’’ అని కోరారు. బెయిల్‌ అభ్యర్థనపై వేగంగా నిర్ణయం వెల్లడించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. మరో న్యాయవాది నితేశ్‌ రాణా వాదనలు వినిపిస్తూ నిందితురాలి మైనర్‌ కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఆమెకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఆమె వైద్య నివేదికలు అందించడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్‌పై ఈడీ అభిప్రాయం చెప్పడానికి కనీసం వారం గడువు ఇవ్వాలని కోరారు. నిందితురాలి అరెస్టు విషయంలో పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 19(2) కింద పొందుపరిచిన నిబంధనలన్నింటినీ ఈడీ అధికారులు అనుసరించినట్లు 16వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ కోర్టు పేర్కొందని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ వాదనలతో న్యాయమూర్తి కావేరీ బవేజా ఏకీభవించారు. ‘‘నిందితురాలు, ఈడీ తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్నాను. సెక్షన్‌ 19(2) ప్రకారం అరెస్టు ఉత్తర్వులు, తమ వద్ద ఉన్న ఇతర సామగ్రిని దర్యాప్తు సంస్థ అధికారులు సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించడం తప్పనిసరి. వాటి ప్రతులను నిందితులకూ అందించాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అందువల్ల కోర్టుకు సమర్పించిన రికార్డులను తమకూ అందించాలని నిందితురాలి తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాం’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇంటి భోజనానికి అనుమతి

జ్యుడిషియల్‌ కస్టడీ సమయంలో తనకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలని, దీంతోపాటు పరుపు, స్లిప్పర్లు, దుస్తులు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు, పుస్తకాలు, పెన్ను, కాగితాలు అందించాలని, బంగారు నగలు ధరించడానికి, ఔషధాలు తీసుకెళ్లడానికీ అనుమతివ్వాలన్న కవిత విజ్ఞప్తిని న్యాయమూర్తి మన్నించారు. వాటన్నింటినీ అనుమతించాలని తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం కవితను సాయంత్రం తిహాడ్‌ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఆరో నంబరు జైలులో ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి ఆమెను ప్రత్యేక సెల్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

ఈడీ ముందుకు మేకా శరణ్‌

దిల్లీ మద్యం కేసులో కవిత తరఫున ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాడని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ భావిస్తున్న ఆమె మేనల్లుడు మేకా శరణ్‌ మంగళవారం ఈడీ అధికారుల ముందు హాజరైనట్లు తెలిసింది. ఈ నెల 23న ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించిన కవిత రిమాండ్‌ పొడిగింపు అప్లికేషన్‌లో ఈడీ ఈయన పాత్ర గురించి ప్రస్తావించింది. విచారణకు పిలిచినా రాలేదని తెలిపింది. అదేరోజు అతని ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో శరణ్‌ మంగళవారం హాజరైనట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.


ఇది పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు

కడిగిన ముత్యంలా బయటికొస్తా
కవిత వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకొస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు మాత్రమే. ఒక నిందితుడు ఇప్పటికే భాజపాలో చేరారు. రెండో నిందితుడు భాజపా టికెట్‌ దక్కించుకుంటున్నారు. మూడో నిందితుడు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.50 కోట్లు ఇచ్చారు. ఇది కుట్రపూరితంగా నమోదు చేసిన తప్పుడు కేసు. ఈ చట్టవిరుద్ధమైన కేసుపై పోరాడతా. నిర్దోషిగా.. కడిగిన ముత్యంలా బయటికొస్తాను’’ అని కవిత పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని