వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..

ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు వానలు పడొచ్చని భావించేవారు.

Updated : 04 May 2024 06:32 IST

ఇప్పటి వరకు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ మాత్రమే
కొత్తగా తూర్పు, పశ్చిమ క్లస్టర్లు కచ్చితమైన సమాచారానికే

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు వానలు పడొచ్చని భావించేవారు. అలాగే దక్షిణ తెలంగాణ అంటే.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ తదితర జిల్లాలు, మధ్య తెలంగాణ అంటే.. మెదక్‌, వరంగల్‌, ఖమ్మం తదితర జిల్లాలుగా పరిగణించేవారు. నేల స్వభావం, వాతావరణ మార్పుల(ఆగ్రో క్లయిమెటిక్‌) ఆధారంగా ఈ మూడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే, వాతావరణ సూచనలు మరింత స్పష్టంగా, నిర్దుష్టంగా అందించేందుకు ఐఎండీ కొత్తగా మరో రెండు విభజనలు చేసింది. భారత వాతావరణశాఖ(ఐఎండీ) దేశవ్యాప్తంగా కొత్త క్లస్టర్ల(వాతావరణం పరంగా) ఏర్పాటుకు నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఈ ప్రక్రియను చేపట్టారు.

వాతావరణ పరిస్థితులు అనుసరించి

రాష్ట్రంలో ఖమ్మం నుంచి మొదలు ఆదిలాబాద్‌ వరకు దాదాపు ఒకే తరహా పరిస్థితులు ఉంటాయి. అయితే, నిశితంగా పరిశీలిస్తే ఏపీలోని తూర్పుగోదావరి మాదిరి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో కనిపిస్తూ వస్తున్నాయి. రుతుపవనాల గమనం, వర్షాలు పడుతున్న తీరును అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు మరింత దగ్గరగా జిల్లాల వాతావరణాన్ని అంచనా వేసేందుకు కొత్త క్లస్టర్లకు బీజం వేశారు. ఇందులో భాగంగా పది జిల్లాలతో తూర్పు తెలంగాణ క్లస్టర్‌ను రూపొందించగా... గతంలో దక్షిణ తెలంగాణగా పరిగణించిన ఉమ్మడి నల్గొండను తాజాగా ఇందులోకి చేర్చారు. పశ్చిమ తెలంగాణ పరిధిలోకి నాలుగు జిల్లాలు చేర్చారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని కామారెడ్డి ఇందులోకి వచ్చింది. అలాగే ఉత్తర తెలంగాణ పరిధిలో తొమ్మిది జిల్లాలు, దక్షిణంలో ఐదు, మధ్య(సెంట్రల్‌) తెలంగాణలో ఐదు జిల్లాలను తీసుకొచ్చారు. ఆగ్రో క్లయిమెటిక్‌ పరిస్థితులను అనుసరించి ఈ క్లస్టర్లను ఏర్పాటు చేశారని, వీటితో స్పష్టతతో కూడిన సూచనలు ప్రజలకు అందించవచ్చని వాతావరణశాఖ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు.


కొత్త క్లస్టర్ల పరిధిలోకి వచ్చే జిల్లాలు..

తూర్పు: జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ గ్రామీణం, హనుమకొండ అర్బన్‌, జనగామ
పశ్చిమం: వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి
ఉత్తరం: ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి
దక్షిణం: మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల
మధ్య తెలంగాణ: సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని