అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో.. కఠిన చర్యలు తీసుకోవద్దు

రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసిన నకిలీ వీడియో వ్యవహారంపై నమోదైన కేసులో.. కాంగ్రెస్‌ నేతలపై కఠిన చర్యలు తీసుకోవద్దని దిల్లీ పోలీసులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Updated : 04 May 2024 05:38 IST

దిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశం
దర్యాప్తు కొనసాగించవచ్చని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసిన నకిలీ వీడియో వ్యవహారంపై నమోదైన కేసులో.. కాంగ్రెస్‌ నేతలపై కఠిన చర్యలు తీసుకోవద్దని దిల్లీ పోలీసులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించడానికి అనుమతిస్తూ విచారణను జూన్‌ 12వ తేదీకి వాయిదా వేసింది. మార్ఫింగ్‌ చేసిన అమిత్‌షా వీడియోను ‘ఎక్స్‌’ ఖాతాలో పెట్టారంటూ శింకూశరణ్‌సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెలలో దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఏప్రిల్‌ 29న పలువురు కాంగ్రెస్‌ నేతలకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ కింద నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేతలు మన్నె సతీష్‌, ఎ.అస్మా తస్లీమ్‌, ఎ.శివకుమార్‌, పి.నవీన్‌, కోయ గీత, పి.వంశీకృష్ణలు అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌   బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.

రెండు కేసులు నమోదు చేయడం తగదని వాదన

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే, న్యాయవాది తూం శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. ఇదే అంశంపై భాజపాకు చెందిన జి.ప్రేమేందర్‌రెడ్డి గత నెల 27న ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో పిటిషనర్లతోపాటు మరికొందరిని పోలీసులు ఈ నెల 3న అరెస్ట్‌ చేశారని, నిందితులకు కోర్టు బెయిలు మంజూరు చేసిందని తెలిపారు. ఇదే కేసులో దిల్లీ పోలీసులు రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చెల్లదన్నారు. ఒకే అంశంపై పలు కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించిందని తెలిపారు. పిటిషనర్లను వేధింపులకు గురిచేసేందుకు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కాంగ్రెస్‌ నేతలపై కఠిన చర్యలు తీసుకోవద్దని, చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చని దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని