భారాస ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తమ నేతలపై పలువురు చేస్తున్న అసత్య ఆరోపణల నియంత్రణకు గూగుల్‌, యూట్యూబ్‌ చర్యలు తీసుకోవడం లేదంటూ భారాస చేసిన ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 04 May 2024 05:17 IST

‘ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం’లో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తమ నేతలపై పలువురు చేస్తున్న అసత్య ఆరోపణల నియంత్రణకు గూగుల్‌, యూట్యూబ్‌ చర్యలు తీసుకోవడం లేదంటూ భారాస చేసిన ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో భారాస నేతల ప్రతిష్ఠ దెబ్బతీసేలా.. గూగుల్‌, యూట్యూబ్‌ల నుంచి సేకరించిన సమాచారం వైరల్‌ అవుతున్నా.. ఆ సంస్థలు, వాటిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదంటూ భారాస ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కేంద్రం 2021లో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో భారాస నేతలకు వ్యతిరేకంగా మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు ప్రసారమవుతున్నాయన్నారు. కేవలం ఊహాజనిత అంశాలతో కొండా సురేఖ తదితరులు చేస్తున్న ఆరోపణలను ప్రసారం చేస్తున్నాయన్నారు. యూట్యూబ్‌, గూగుల్‌ ద్వారా సమాచారాన్ని సేకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారని తెలిపారు. భారాస నేతల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న సమాచారాన్ని తొలగించాలని, లేదంటే ఇతరులకు అందుబాటులో లేకుండా నియంత్రించాలని గూగుల్‌, యూట్యూబ్‌లకు వినతి పత్రం ఇస్తే, వీడియోల అప్‌లోడ్‌పై నియంత్రణ తమకు లేదని, ఏవైనా కోర్టు ఉత్తర్వులుంటేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయన్నారు. దీంతో ఐటీ నిబంధనలు 2021 ప్రకారం వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రసార శాఖకు ఏప్రిల్‌ 25న ఫిర్యాదు చేశామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు. కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి భారాస ఇచ్చిన ఫిర్యాదుపై చట్ట నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని