అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Updated : 18 May 2024 03:12 IST

టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలి
సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బయోమెన్యూర్, బయోమాస్‌కు సంబంధించిన యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. బుగ్గపాడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులో వచ్చేనెల పరిశ్రమల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, జౌళిశాఖల్లో ఒకే విధమైన పనికలిగిన కార్పొరేషన్లను ఒకే కార్పొరేషన్‌గా చేసి బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పదవీ కాలం ముగిసిన సహకార సంఘాలకు, పదేళ్లుగా పాలకవర్గాలు లేని హౌసింగ్‌ సొసైటీలకు వెంటనే సీఎం అనుమతితో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. శుక్రవారమిక్కడ పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, జౌళిశాఖ సంచాలకురాలు అలుగు వర్షిణి, ఉద్యానశాఖ సంచాలకులు అశోక్‌రెడ్డి, మార్కెటింగ్‌ సంచాలకులు లక్ష్మీబాయి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ మల్సూరుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటులో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవసరమైన ప్రోత్సాహం అందించాలన్నారు.

ఎన్‌ఏసీ ఉంటేనే ప్రైవేటుకు..

‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు టెస్కో ద్వారా తప్పనిసరిగా వస్త్రాలు కొనుగోలు చేయాలి. ఇప్పటికే టెస్కోకు రూ.255 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. టెస్కో నుంచి నాన్‌ అవైలబిలిటీ సర్టిఫికెట్‌(ఎన్‌ఏసీ) పొందిన తరువాతే ప్రైవేటు మార్కెట్లో టెండర్లకు ఆర్డర్లు ఇవ్వాలి. చేనేత రంగ పరిశ్రమల ఆధునికీకరణ కోసం రూ.350కోట్లు కేటాయించి నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు జరిగేలా చూడాలి. ఏటా బతుకమ్మ చీరలతో కలిపి 5.7కోట్ల మీటర్ల ఆర్డర్లు నేత కార్మికులకు వచ్చేవి. ఈ ఏడాది అదనంగా మరో 2.5 కోట్ల మీటర్ల ఆర్డర్లు వచ్చాయి. 

మరో 80లక్షల మీటర్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు త్వరగా చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పవర్‌లూమ్స్‌ పరిశ్రమకు విద్యుత్తు సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం ద్వారా శానిటరీ నాప్కిన్‌ యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలి. పాఠశాల విద్యార్థినులకు విద్యాశాఖ ద్వారా నాప్కిన్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. గోదాములపై సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పొందడంతోపాటు ప్యానెళ్ల ఏర్పాటుకు ఖర్చు అంచనా వేసుకోవాలి. విద్యుత్తుశాఖ కలిసి ఒప్పందాలు చేసుకోవాలి. ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించడంతోపాటు కోహెడ నుంచి పండ్లను అంతర్జాతీయంగా ఎగుమతులు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని అధికారులను తుమ్మల ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు