తాగునీళ్లు ఇచ్చేందుకు కర్ణాటక సానుకూలత!

తెలంగాణకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కొంత నీటిని ఇచ్చేందుకు ఆ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Published : 04 May 2024 05:19 IST

రెండు ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలే ఇక ఆలస్యం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కొంత నీటిని ఇచ్చేందుకు ఆ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాల కింద రాష్ట్ర అవసరాలు పోను కనీసం రెండు టీఎంసీల వరకు తెలంగాణకు ఇచ్చేందుకు అవకాశాలున్నట్లు కర్ణాటక అధికారులు లెక్కలు కట్టినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖకు కూడా తెలియజేసినట్లు సమాచారం. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తయితే తమకు అందుబాటులో ఉన్న నీటిని తెలంగాణకు విడుదల చేసే అవకాశాలు ఉంటాయని కర్ణాటక అధికారులు సంకేతాలిచ్చినట్లు తెలిసింది. తాగునీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకను 5 టీఎంసీల మేరకు నీటిని ఇవ్వాలని కోరుతూ వస్తోంది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల బృందం బెంగళూరుకు వెళ్లి లేఖను సమర్పించి వచ్చింది. ఈ క్రమంలో కర్ణాటక జలవనరుల శాఖ సానుకూలంగా ఉన్న విషయాన్ని రాష్ట్రానికి తెలిపినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కింద నీటి అవసరాలు తీరే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని