ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్‌ అవసరం లేదు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్‌సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్‌ చేశాయి.

Published : 06 May 2024 06:25 IST

ఎన్‌సీటీఈ తెలిపిందన్న యూఎస్‌పీసీ, జాక్టో
లేఖ వివరాలు వెల్లడించని శ్రీదేవసేనపై చర్యలకు డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్‌సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు కె.జంగయ్య, చావ రవి, వై.అశోక్‌ కుమార్‌, పి.నాగిరెడ్డి, టి.లింగారెడ్డి, యు.పోచయ్య, జి.సదానందం గౌడ్‌, ఎం.పర్వతరెడ్డి, ఎం.రాధాకృష్ణ, కె.కృష్ణుడు తదితరులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి టెట్‌ అవసరం లేదని, పాఠశాల స్థాయి మారిన సందర్భంలో మాత్రమే ఇది అవసరమని ఏప్రిల్‌ 8న ఎన్‌సీటీఈ రాష్ట్రానికి వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈనెల 3 న దిల్లీలో ఎన్‌సీటీఈ మెంబర్‌ సెక్రటరీ శెర్పాతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూఎస్‌పీసీ, జాక్టో ప్రతినిధులు సమావేశమైనప్పుడు ఏప్రిల్‌ 8నే పాఠశాల విద్యా కమిషనర్‌కు మెయిల్‌ ద్వారా వివరణ లేఖ పంపినట్లు తెలిసిందన్నారు. ఆ వివరాలు వెల్లడించకుండా ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేసిన శ్రీదేవసేన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు ఎన్‌సీటీఈ నిబంధనలు పాటించాలని గత సెప్టెంబరు 29న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా అన్ని క్యాడర్ల పదోన్నతులు నిలిపివేశారన్నారు. ఏ క్యాడర్‌ పదోన్నతులకు ‘టెట్‌’ అవసరమో ఎన్‌సీటీఈ నుంచి వివరణ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు అభ్యర్థించిన మీదట ఫిబ్రవరి 14న విద్యాశాఖ కమిషనర్‌ లేఖ రాశారని వివరించారు. ఎన్‌సీటీఈ ప్రత్యుత్తరం విషయం తెలియక.. ఏప్రిల్‌ 20 వరకే గడువు ఉండడంతో టెట్‌కు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారన్నారు. మరికొన్ని అంశాలపై వివరణ తీసుకొని, ఎన్నికలు ముగిసిన వెంటనే పదోన్నతులు చేపట్టాలని యూఎస్‌పీసీ, జాక్టో ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని