సమస్యల సుడిలో ఆశావర్కర్లు

గ్రామీణ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఆశా వర్కర్లు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. సరైన వేతనం లేక, పని ఒత్తిడి ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు వారిపై శీతకన్ను వేస్తున్నాయి. గ్రామీణ భారత ఆరోగ్యానికి మూల స్తంభాలుగా నిలుస్తున్న

Published : 30 Sep 2022 00:40 IST

గ్రామీణ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఆశా వర్కర్లు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. సరైన వేతనం లేక, పని ఒత్తిడి ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు వారిపై శీతకన్ను వేస్తున్నాయి.

గ్రామీణ భారత ఆరోగ్యానికి మూల స్తంభాలుగా నిలుస్తున్న ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత కొరవడ్డాయి. గ్రామంలో ప్రతి ఇంటినీ వారు సందర్శించి అందరి యోగ క్షేమాలు విచారిస్తారు. పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి వివరిస్తారు. సురక్షిత ప్రసవం, తల్లిపాల ప్రాధాన్యం, శిశు సంరక్షణ, వివిధ రకాల వ్యాధుల పట్ల చైతన్యాన్ని పెంపొందిస్తారు. కొవిడ్‌ కాలంలోనూ ప్రాణాలను లెక్కచేయకుండా వారు ఇల్లిల్లూ తిరిగి సర్వేలు చేశారు. టీకాలు వేశారు. అటవీ, పర్వత ప్రాంత గ్రామాలకు కాలినడకన చేరుకొని ఆరోగ్య సేవలందించారు. కొందరు కరోనా మహమ్మారికి బలయ్యారు. భారత్‌లోని పది లక్షల మంది ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది మేలో గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో వారు కీలకంగా ఉన్నారని కొనియాడింది. ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఆశా వర్కర్లు ముందున్నారని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. సమాజ శ్రేయస్సుకు ఎంతగానో శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు స్వల్ప వేతనమే లభిస్తోంది. విపరీతమైన పని ఒత్తిడిని వారు ఎదుర్కొంటున్నారు.

కీలక భూమిక
జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 2005లో ఆశా వర్కర్ల వ్యవస్థ ప్రారంభమైంది. దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‌ ఉండాలి. భారత్‌లో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో వారు కీలక భూమిక వహిస్తున్నారని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాలో ఆస్పత్రి ప్రసవాల పెరుగుదల, మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో ఆశా వర్కర్లు కీలకంగా నిలుస్తున్నారు. భారత్‌లో శిశు మరణాల రేటు 1981లో 9.7శాతం. 2021 నాటికి అది 1.7శాతానికి తగ్గింది. మాతా మరణాలూ అదే స్థాయిలో దిగివచ్చాయి. ఆశా వర్కర్ల సేవలను ప్రభుత్వాలు గుర్తించినా, వారి సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. వారు శాశ్వత ఉద్యోగులు కారు. ప్రోత్సాహక వేతనమే తప్ప నియమిత జీతం వారికి లేదు. ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం చేపట్టే ప్రతి పనీ వారికే అప్పగిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రోజువారీ లక్ష్యాలు విధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీబీ నిర్మూలన, టీకా వితరణ, అసాంక్రామిక వ్యాధుల గుర్తింపు, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నియంత్రణ, మాతా శిశు సంరక్షణ తదితరాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలనూ ఆశా వర్కర్లే నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సైతం సెలవు లేకపోవడంతో వారిపై తీవ్ర పని భారం పడుతోంది.

చాలా రాష్ట్రాల్లో ఆశా వర్కర్ల సంఖ్య కేంద్రం నిబంధనలకు అనుగుణంగా లేదు. వారి సంఖ్యను పెంచి, పనిభారాన్ని తగ్గించాలి. వేతనాలను సైతం పెంచాలి. జీతాల పెంపు, ఇతర సౌకర్యాల కోసం ఆశా వర్కర్లు ఎన్నోసార్లు మొరపెట్టుకొన్నారు. సమ్మెలు చేశారు. వారి వేతనాన్ని రూ.7500 నుంచి రూ.9750కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైతం వారి జీతాలను పది వేల రూపాయలకు పెంచింది. తమకు కనీస వేతనంగా రూ.15,000 ఇవ్వాలని ఆశా వర్కర్లు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు కలిపి తెలంగాణలో 27 వేల మంది, ఆంధ్రప్రదేశ్‌లో సమారు 40 వేల మంది ఆశావర్కర్లు పని చేస్తున్నారు. వారానికి ఒక రోజు సెలవుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రసూతి సెలవులు వంటివి తమకు అమలు చేయాలని వారు కోరుతున్నారు.

చేయూతనిస్తేనే...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే అత్యుత్తమ వైద్య సేవల వివరాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఆశా వర్కర్ల ద్వారానే తెలుస్తాయి. ఒక ప్రభుత్వ పథకం విజయవంతమైతే, దాన్ని ఉన్నతాధికారులకే ఆపాదించడం పరిపాటిగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా వర్కర్లకు ఇచ్చిన గుర్తింపు, ప్రశంస చూసైనా వారి విషయంలో ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి. చిరుద్యోగులైన ఆశా వర్కర్ల సేవలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి అడుగులు వేయాలి. విధి నిర్వహణలో వారికి సరైన రక్షణ, వాహన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. వారిని స్కీం వర్కర్లుగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రూప్‌ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలి. పదోన్నతుల ద్వారా మరింత సమర్థంగా విధుల నిర్వహణకు వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. విధి నిర్వహణలో మరణిస్తే పరిహారమూ అందించాలి. ఆశా వర్కర్ల సామర్థ్యాల పెంపుదలకు ఆధునిక సాంకేతికతతో కూడిన శిక్షణ ఇవ్వడమూ తప్పనిసరి. అప్పుడే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు మరింతగా విజయవంతమవుతాయి.

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts