అణ్వగ్నితో చెలగాటం

రష్యా యుద్ధరంగం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా దూకుడును పెంచి ఉక్రెయిన్‌లోని అణుకేంద్రాలపై దాడులకూ తెగబడుతుండటం ప్రపంచాన్ని విస్మయపరుస్తోంది. భారత్‌ వంటి శాంతికాముక దేశాలతోపాటు అగ్రరాజ్యం అమెరికా, ఐరోపా దేశాలు శాంతివచనాలు పలుకుతున్నా- ఇరుదేశాలూ తగ్గడంలేదు.

Published : 26 Nov 2022 00:33 IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పోనుపోను ఉన్మాద స్థాయికి చేరుతోంది. ఆస్పత్రులు మొదలు అణుకేంద్రాల వరకు దాడులకు లక్ష్యాలుగా మారుతున్నాయి. పసికందుల నుంచి వృద్ధుల వరకు ఎందరివో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.  

ష్యా యుద్ధరంగం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా దూకుడును పెంచి ఉక్రెయిన్‌లోని అణుకేంద్రాలపై దాడులకూ తెగబడుతుండటం ప్రపంచాన్ని విస్మయపరుస్తోంది. భారత్‌ వంటి శాంతికాముక దేశాలతోపాటు అగ్రరాజ్యం అమెరికా, ఐరోపా దేశాలు శాంతివచనాలు పలుకుతున్నా- ఇరుదేశాలూ తగ్గడంలేదు. యుద్ధం మొదలై సుదీర్ఘకాలం గడుస్తున్నా పంతం వీడటం లేదు. ఎవరూ వెనకంజ వేయడానికి ఒప్పుకోవడం లేదనేందుకు తాజా పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దక్షిణ ఉక్రెయిన్‌ ప్రాంతంలోని జపోరిజియా అణుకేంద్రంపై ఇటీవల బాంబు దాడులు జరిగినట్లు రెండుదేశాల వర్గాలు ప్రకటించాయి. ఈ దాడుల్లో అణుకేంద్రంలోని పరికరాలు, యంత్రసామగ్రి ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్జాతీయ అణుఇంధన సంస్థ ప్రధాన కార్యదర్శి రఫేల్‌ మారియానో గ్రోసి గట్టిగా స్పందించారు. అణుకేంద్రంలో సంభవించిన పేలుళ్లు ఎంతమాత్రం ఆమోదనీయం కాదన్నారు. ఇది నిప్పుతో చెలగాటం వంటిదని ఇప్పటికే తాము ఎన్నోసార్లు స్పష్టంచేశామని గుర్తుచేశారు. షరామామూలుగా ఈ దాడులకు నువ్వంటే నువ్వే కారణమంటూ ఉక్రెయిన్‌, రష్యాలకు చెందిన అణు సంస్థలు నిందారోపణలు చేసుకున్నాయి. దాడుల కారణంగా అణుకేంద్రంలో తీవ్రస్థాయి దుర్ఘటన చోటుచేసుకుందేమోనన్న భయాందోళనలు రేకెత్తాయి. దాడుల ఘటనతో అణుకేంద్రం నుంచి రేడియోధార్మికత బయటికి వెలువడినట్లు తెలియరాలేదు. అణు భద్రత, రక్షణకు సంబంధించి ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదు. ఈ అణుకేంద్రం ప్రపంచంలో అత్యంత విషాదకర అణు దుర్ఘటన జరిగిన చెర్నోబిల్‌కు 500 కి.మీ. దూరంలో ఉంది. జపోరిజియా అణుకేంద్రాన్ని రష్యా దళాలు మార్చిలోనే ముట్టడించాయి. అక్కడే దళాలను మోహరించి సైనిక ఆయుధాలు, వాహనాలను నిలిపి ఉంచారు. కొద్దికాలం క్రితం అణుకేంద్రాన్ని స్థావరంగా చేసుకుని చుట్టుపక్కల పట్టణాలపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించినట్లు ఉక్రెయిన్‌ చెబుతోంది.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరవాత అణ్వాయుధాల ముప్పు క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచాన్ని పలుమార్లు సర్వనాశనం చేయగల స్థాయిలో ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో అవసరమైతే అణ్వాయుధాలు ఉపయోగిస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరికలతో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలను నియంత్రిస్తున్న పుతిన్‌- తన దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తానని, సర్వశక్తులనూ ఒడ్డుతానని ఇటీవల స్పష్టంచేశారు. ఒకవేళ అణ్వాయుధాలను ఉపయోగిస్తే వాటి విపరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగానే ఉంటాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచే అణు యుద్ధమేఘాలు భయపెడుతున్నా, తాజా పరిణామాలతో అవి మరింత ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య అంచనా ప్రకారం- ప్రస్తుతం రష్యావద్దే అత్యధిక అణు వార్‌హెడ్లు ఉండటం ఆందోళనకు కారణమవుతోంది. రష్యా, అమెరికాల వద్దే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అణుదాడులకు సంబంధించి పుతిన్‌ కేవలం ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నా, అమెరికా మాత్రం ఆ హెచ్చరికలను తీవ్రంగానే పరిగణిస్తోంది. ఏ తరహా అణుదాడి అయినా అది దారుణమైన తప్పిదమే అవుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇంతకుముందే ప్రకటించారు. దాడికి పాల్పడితే రష్యా తీవ్ర తప్పిదం చేసినట్లవుతుందన్నారు. మరోవైపు, పూర్తిస్థాయి అణుదాడులు కాకపోయినా, ఆ తరహా దాడుల కోణంలో ఇరుదేశాలూ యోచిస్తున్నట్లు విదితమవుతోంది. అణు పేలుడు సంభవించకున్నా, విస్తృత పరిధిలో రేడియో ధార్మికతను వెదజల్లి ఆ ప్రాంతాన్ని కలుషితం చేసే బాంబులను ప్రయోగించడంపైనా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వీటివల్ల పౌరులకు ప్రమాదం తప్పదు. ఉక్రెయిన్‌పై తక్కువ ప్రభావం చూపే అణ్వాయుధాలనైనా ఉపయోగించాలంటూ రష్యాలో కొంతమంది నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుదేశాలూ యుద్ధరంగం నుంచి వెనకడుగు వేయకుండా, కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నంత కాలం- ప్రపంచం నెత్తిన అణుకత్తి వేలాడుతూనే ఉంటుంది!

డి.శ్రీనివాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.