రాజమహేంద్రవరం విలవిల

అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్‌.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది.

Published : 08 May 2024 06:26 IST

భారీ వర్షానికి ముంచెత్తిన మురుగు
ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు, స్తంభించిన జనజీవనం..
మురుగునీటి కాలువలను పూర్తి చేయని ఫలితం
నగరాలను గాలికొదిలేసిన అసమర్థ సర్కారు

ఈనాడు-అమరావతి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్‌.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. మురుగునీటి కాలువల నిర్మాణాన్నీ పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మంగళవారం కురిసిన మోస్తరు వర్షానికే రాజమహేంద్రవరం జలదిగ్బంధమైంది. రోడ్లపై సెలయేరులా పారే మురుగునీరు, ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు, ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు, స్తంభించిన జనజీవనం.. మొత్తంగా నగరం అస్తవ్యస్తంగా తయారైంది. అనంతపురంలోనూ లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. శ్రీకాకుళంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక మాదిరి, తొలిసారి కురిసిన వర్షానికే ప్రజలు ఇన్ని అవస్థలు పడ్డారంటే నిర్వహణలేమి స్పష్టమవుతోంది.

నగరాల అభివృద్ధి మరిచారు..

వైకాపా సర్కారు ఐదేళ్లలో నగరాల అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా.. కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన నిధులూ సరిగా వినియోగించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వకుండా వాటిని పాడుపెట్టారు. స్మార్ట్‌సిటీ పథకానికి పూర్తిగా పాతరేశారు. విజయవాడలో వరదనీటి కాలువల నిర్మాణాన్నీ పక్కన పెట్టారు. గుంటూరులో భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) పనులకు నిధులివ్వకుండా కంపు పట్టించారు. నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకంలో ప్రారంభించిన డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులను జగన్‌ ప్రభుత్వం మూలన పెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదు. పెండింగ్‌ బిల్లులు చెల్లించనందున గుత్తేదారులు పనులు అసంపూర్తిగా నిలిపివేశారు. దీంతో కొద్దిపాటి వర్షానికే నగరాలు జలమయం కావడానికి జగన్‌ ప్రభుత్వం కారణమైంది. ఈ ఐదేళ్లలో వర్షాకాలాల్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో వీధులు వర్షాలకు సెలయేరుల్లా మారినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోయింది.

చారిత్రక నగరంపై నిర్లక్ష్యం

రాజమహేంద్రవరంలో వర్షపు నీటికి తోడు మురుగు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ఆర్యాపురం, తుమ్మలావ ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చొచ్చుకువచ్చింది. గతంలో ముంపు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వర్షపు నీరు రావడంతో అవస్థలు పడ్డారు. కోరుకొండ రోడ్డు మార్గంలో మార్కెట్‌యార్డు, కంబాలచెరువు వద్ద నీరు నిలిచిపోవడంతో కోరుకొండ, గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. కోటిపల్లి బస్టాండ్‌, ప్రధాన రైల్వే స్టేషన్‌ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వాహనాలు ముంపు నీటిలో చిక్కుకుని మెరాయించాయి. కోటిపల్లి బస్టాండ్‌ వద్ద మోకాలి లోతు నీరు చేరిపోవడంతో కొవ్వూరు నుంచి బ్రిడ్జి ద్వారా వచ్చే వాహనాలు, కార్లు నీటిలో నిలిచి అవస్థలు పడ్డారు. చారిత్రక నగరిని అభివృద్ధి చేశామని పదేపదే చెప్పుకునే వైకాపా పాలకులకు నగరవాసులు తరచూ అనుభవిస్తున్న ముంపు కష్టాలు కనిపించడం లేదు. గతంలో వైఎస్‌ హయాంలో ముంపు సమస్య చక్కదిద్దేందుకు గోదావరి బండ్‌ ద్వారా పైపులైన్‌ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా పనులు చేపట్టలేదు. పుష్కరాల సమయంలో భూగర్భ కాలువల ఆవశ్యకతను జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించినప్పటికీ పనులు పట్టాలెక్కలేదు. అప్పట్లోనే రూ. 600 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ అయిదేళ్లలో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకొంటున్న అధికార పార్టీ నాయకులు ముంపు సమస్యను పరిష్కరించడానికి కనీస చర్యలు చేపట్ట లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని