పంజాబులో మళ్ళీ ఖలిస్థాన్ కలకలం
పంజాబ్ రాష్ట్రంలో ఇటీవలి పరిస్థితులు 1980ల నాటి ఉద్రిక్తతలను గుర్తుకు తెస్తున్నాయి. మళ్ళీ అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలు ఊపందుకొంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలో ఇటీవలి పరిస్థితులు 1980ల నాటి ఉద్రిక్తతలను గుర్తుకు తెస్తున్నాయి. మళ్ళీ అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలు ఊపందుకొంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. దీనివల్ల భాజపాకే లాభం చేకూరుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబు పోలీసులు కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న సిక్కు నిరసనకారులు కత్తులు, తుపాకులతో అజ్‌నాలా వీధుల్లో కదం తొక్కడం పంజాబులో 1980ల నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో ఆ రాష్ట్రంలో తీవ్రవాదం ఆందోళనకర స్థాయిలో ఉండేది. నిరసనకారులు భారీ బీభత్సం సృష్టించడంతో తూఫాన్ సింగ్‌ను విడిచిపెట్టడం మినహా పోలీసులకు మరో దారి లేకపోయింది.
భాజపాకు లాభం
ఇంజినీరింగ్ చదివిన ఇరవై తొమ్మిదేళ్ల అమృత్‌పాల్ సింగ్ సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్థాన్ నినాదాలతో పంజాబు యువతను ప్రభావితం చేస్తున్నాడు. నేరం జరిగిన స్థలంలో తూఫాన్ సింగ్ లేడన్న కారణంగా అతణ్ని విడుదల చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ ప్రకటించారు. ఈ మాటలు 1981లో సిక్కు నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే విడుదలను గుర్తుకు తెచ్చాయి. అప్పట్లో ఒక వార్తాపత్రిక యజమాని హత్య కేసులో జర్నైల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దానికి నిరసనగా అతడి అనుచరులు హింసకు దిగడం ప్రభుత్వ యంత్రాంగంపై, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. దాంతో అతణ్ని విడుదల చేయాల్సి వచ్చింది. సంబంధిత హత్య కేసుతో జర్నైల్‌కు ఎలాంటి సంబంధం లేదని అప్పటి ఇందిరాగాంధీ కేబినెట్‌లో హోంమంత్రి జైల్ సింగ్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. జర్నైల్ సింగ్ విడుదల ఖలిస్థాన్ అనుకూల శక్తులకు మరింత ఊపును ఇచ్చింది. అనంతర కాలంలో అది ఆపరేషన్ బ్లూస్టార్‌కు, ఆ తరవాత ఇందిరాగాంధీ దారుణ హత్యకు దారి తీసింది. ప్రస్తుతం సిక్కులను ప్రత్యేక దేశం ఆకాంక్ష వైపు ఆకర్షితుల్ని చేసేందుకు అమృత్‌పాల్ సింగ్, భింద్రన్‌వాలే మాదిరిగానే వస్త్రధారణ చేస్తున్నాడు. జర్నైల్ భావజాలం నుంచే స్ఫూర్తి పొందుతూ ప్రారంభంలో అతడు వల్లించిన పలుకులనే వినిపిస్తున్నాడు.
అమృత్‌పాల్ చర్యలు 1980ల నాటి ఖలిస్థాన్ ఉద్యమాన్ని మళ్ళీ తెస్తాయనే తలంపుతో పంజాబులో హిందువుల ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉంది. అతడి కారణంగా సిక్కుల్లో భారీగా చీలిక రావచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలోని లౌకిక సిక్కులు ఎలాంటి మార్పూ లేకుండా తటస్థంగా ఉండిపోతారు. తీవ్రమైన మత భావజాలం ఉన్నవారు అమృత్‌పాల్‌ను అనుసరించే అవకాశం ఉంది. అయితే, పంజాబు జనాభాలో 40శాతం దాకా హిందువులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా ఆప్, కాంగ్రెస్‌కు మద్దతు తెలపకుండా భారతీయ జనతా పార్టీ వెంట నిలవవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటిదాకా భాజపా గట్టిగా తన ఉనికిని చాటుకోలేదు. ప్రస్తుతం భాజపాకు అక్కడ కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి నేతలున్నారు. 2024 ఎన్నికల్లో పంజాబులో అమరీందర్ మెరుగైన ఫలితాలు సాధించి పెడతారని భాజపా ఆశలు పెట్టుకొంది.
ఆప్ అప్రమత్తత
పంజాబులో ప్రస్తుత ఖలిస్థాన్ కలకలం భాజపాకే అధికంగా మేలు చేసేలా కనిపిస్తోంది. అమృత్‌పాల్ చర్యలు హిందూ ఓటర్లు కమల దళం వైపు మొగ్గేలా చేస్తాయి. మరోవైపు ఇతర సిక్కు ఓట్లను భాజపా ఆకర్షించేందుకు అమరీందర్ వంటి నేతలు అక్కరకు రావచ్చు. ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం అదుపుతప్పినా పంజాబులో అధికారానికి దూరమవడమే కాకుండా, జాతీయ పార్టీగా అవతరించిన తరుణంలో ఇతర రాష్ట్రాల్లో ఆప్ విస్తరణకూ అది విఘాతంగా నిలుస్తుంది. ఈ విషయం ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అజిత్ డోభాల్ వంటి సమర్థులైన అధికారులు ప్రస్తుతం జాతీయ భద్రతా వ్యవహారాలను చూస్తున్నారు. అయినా, ఖలిస్థాన్ ఉద్యమం తీవ్ర స్థాయిని అందుకొని రాష్ట్రంలో అధికార పార్టీకి అది నష్టం చేకూరిస్తే తాను లాభపడవచ్చునని కేంద్రం యోచిస్తుందా, లేదా మొగ్గ దశలోనే దాన్ని తుంచివేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఉద్రిక్త పోకడలకు ఆదిలోనే అడ్డుకట్ట పడకపోతే సామాన్యులకు తీవ్ర ఇక్కట్లు తప్పవు.
బిలాల్ భట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Keerthy Suresh: అప్పుడు సావిత్రి.. ఇప్పుడు వెన్నెల.. కీర్తి సురేశ్ సాహసమిది!
-
India News
Mohammad Faizal: లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత
-
India News
India Corona: 5 నెలల తర్వాత.. 2 వేలు దాటిన కరోనా కేసులు
-
India News
Ashraf Ahmed: రెండు వారాల్లో నన్ను చంపేస్తారు..!: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సోదరుడి ఆరోపణలు
-
Sports News
IPL 2023: అతడే అత్యుత్తమ ఫినిషర్.. మరెవరూ సాటిరారు: రియాన్ పరాగ్
-
Movies News
Kangana:షారుఖ్‌తో ప్రియాంక క్లోజ్‌గా ఉండటం కరణ్ తట్టుకోలేకపోయాడు: కంగన సంచలన ఆరోపణలు