Published : 01/04/2023 00:23 IST

Hansika Motwani: ఆ సమతుల్యత అవసరం

హన్సిక

న్సిక మోత్వానీ.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలూ, వెబ్‌సిరీస్‌లతో ఏడాది పొడవునా ఎంత బిజీగా ఉన్నా సరే! మధ్యలో చిన్న చిన్న హాలిడే ట్రిప్పులు మాత్రం ఉండాల్సిందేనట. చిరకాల మిత్రుడు సోహెల్‌ కథూరియాతో పెళ్లయ్యాక కూడా ఇందులో ఏ మాత్రం మార్పు లేదంటోంది. అందరూ హన్సిక పెళ్లి తర్వాత కొన్నాళ్లు బ్రేక్‌ తీసుకుంటుందనే అనుకున్నారు. కానీ ఆశ్చర్యపరుస్తూ రెండు రోజులకే షూటింగ్‌ స్పాట్‌లో ప్రత్యక్షమైందీ కొత్త పెళ్లికూతురు. టైట్‌ షెడ్యూల్‌ మధ్యలో చిన్న విరామాలు ప్రకటించడం ఆమె అలవాటు. ఈ మధ్య థాయ్‌లాండ్‌లో షూటింగ్‌కు వెళ్లిన హన్సిక దగ్గర్లో ఉన్న క్రాబికి ప్రయాణం కట్టింది. ‘ఈ ట్రిప్‌ మూడురోజులే. ముందుగా ప్లాన్‌ చేసింది కాదు. మా టీమ్‌ అందరినీ తీసుకుని సరదాగా వెళ్లాను. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య సమతుల్యత చాలా అవసరం. లేదంటే అలసిపోతాం. నాకు సుదీర్ఘ విరామాలు నచ్చవు. అలాగని నిరంతరం కెమెరా ముందే గడపడాన్నీ ఇష్టపడను. పనిని ఆస్వాదిస్తాను. పనిచేస్తేనే సంతోషంగా, సజీవంగా ఉంటాను. అయితే.. ఏడాదికి రెండు పెద్ద విహారాలతో పాటు.. పది పన్నెండు రోజులపాటు నడిచే ప్రాజెక్టుల మధ్య చిన్న విరామం తీసుకుని పర్యటిస్తుంటాను. ఆ ప్రయాణాలే నాకు విశ్రాంతి. అలా సేదతీరితేనే రీఛార్జ్‌ అయ్యి మరింత ఉత్సాహంగా, మెరుగ్గా పని చేయగలను’ అంటోందామె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి