మా ఇద్దరికీ సరిపడదు.. వద్దంటే చచ్చిపోతానంటున్నాడు..!

నాకు 27 ఏళ్లు. నేను ఒక అబ్బాయిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం మా ఇరు కుటుంబాల వాళ్లకు కూడా తెలుసు. అయితే గత ఏడాది నుంచి అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అసలు మా ఆలోచనా విధానాలు కూడా వేరుగా ఉన్నాయి. ఎంత ఆలోచించినా మేము ‘మేడ్‌ ఫర్ ఈచ్ అదర్‌’ అనిపించడం లేదు.

Published : 02 Apr 2024 12:47 IST

నాకు 27 ఏళ్లు. నేను ఒక అబ్బాయిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం మా ఇరు కుటుంబాల వాళ్లకు కూడా తెలుసు. అయితే గత ఏడాది నుంచి అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అసలు మా ఆలోచనా విధానాలు కూడా వేరుగా ఉన్నాయి. ఎంత ఆలోచించినా మేము ‘మేడ్‌ ఫర్ ఈచ్ అదర్‌’ అనిపించడం లేదు. ఇదే విషయాన్ని అతనికి పలుమార్లు చెప్పాను. కానీ, తను నా అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. దానికి తోడు నాతో అనుచితంగా మాట్లాడి దురుసుగా ప్రవర్తించాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత సారీ చెప్పి ‘నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను’ అంటున్నాడు. ఇంట్లో వాళ్లు కూడా మేము విడిపోవడానికి అంగీకరించడం లేదు. ఈ బంధానికి ఎలా ముగింపు పలకాలో అర్థం కావడం లేదు. ఈ విషయాలు నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దయచేసి ఈ సమస్య నుండి బయటపడే మార్గం తెలుపగలరు. - ఓ సోదరి

జ. మీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. అంటే మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి కచ్చితమైన అభిప్రాయం వచ్చి ఉంటుంది. ఈ క్రమంలోనే అతనితో జీవితాన్ని కొనసాగించలేరన్న నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతోంది. అయితే అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి ఆమోదం తెలపకపోవడం బాధాకరం. ఆరేళ్ల బంధం నుంచి ఒక్కసారిగా బయటకు రావడం కూడా సులభం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కాబట్టి ఇంకొంచెం శ్రమించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో- మీరు మొదటగా మీ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ బంధాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారో వారికి నిజాయతీగా వివరించే ప్రయత్నం చేయండి. మీ భావజాలం, ఆలోచనా విధానానికి అతను సరితూగడని;  అలాగే కోపంలో నోటికొచ్చినట్లు మాట్లాడతాడన్న విషయాన్ని కూడా స్పష్టం చేయండి. ఒకవేళ వారి నుంచి వ్యతిరేక స్పందన వచ్చినా ఓపిగ్గా వినండి. అవసరమైతే వారు ఆలోచించుకోవడానికి కొంత సమయం తీసుకోమనండి. కచ్చితంగా మీ నిర్ణయాన్ని గౌరవించే అవకాశం ఉంటుంది.

అలాగే అతనితో కూడా మరోసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ బంధాన్ని కొనసాగించినట్లయితే భవిష్యత్తులో ఇద్దరికీ సమస్యలు వస్తాయని వివరించండి. ఇలాంటి వైరుధ్య బావాలున్న వ్యక్తులు కొత్త బంధంలోకి అడుగుపెట్టడం మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేయండి. ఇదంతా ఆచరణలో పెట్టడం చెప్పినంత సులభం కాదు. కానీ, కాబోయే భాగస్వామి సరితూగడన్న విషయాన్ని దృఢంగా నమ్మినప్పుడు కచ్చితంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికీ మీ నిర్ణయానికి అతను ఆమోదం తెలపకపోతే రిలేషన్‌షిప్ నిపుణులను సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్