Agrima Nair: అందుకే ఆమె సైకిల్‌ సవారీ!

ఈ రోజుల్లో చాలామంది వివిధ రకాల మానసిక/ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. ఇలాంటి సమస్యలకు యోగా చక్కటి పరిష్కారం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేరళకు చెందిన అగ్రిమా నాయర్‌(30) అనే అమ్మాయి కూడా గతంలో ఇలాంటి.....

Published : 22 Jun 2022 19:59 IST

(Photos: Facebook)

ఈ రోజుల్లో చాలామంది వివిధ రకాల మానసిక/ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. ఇలాంటి సమస్యలకు యోగా చక్కటి పరిష్కారం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేరళకు చెందిన అగ్రిమా నాయర్‌(30) అనే అమ్మాయి కూడా గతంలో ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడింది. స్నేహితుల సలహాతో యోగాను ఆశ్రయించి తన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుంది. అలా యోగా ప్రయోజనాలను తెలుసుకున్న ఆమె.. యోగా థెరపీలో మాస్టర్స్ చేసింది. ఈ వ్యాయామం పట్ల అందరిలో అవగాహన పెంచడానికి ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్త సైకిల్‌ యాత్ర చేపట్టింది.

అలా యోగాపై మక్కువ..!

అగ్రిమది తిరువనంతపురంలోని పౌడికొణం అనే ప్రాంతం. తండ్రి పీఆర్‌ నాయర్‌ ఆర్మీలో నర్సుగా పని చేశారు. తల్లి రేమా నాయర్‌ సీఆర్‌పీఎఫ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేశారు. ఐదేళ్ల క్రితం అగ్రిమ కేరళలోని ఓ కాలేజీలో మాలిక్యులర్‌ న్యూరోసైన్స్‌లో డాక్టరేట్‌ చేసింది. ఆ సమయంలోనే ఆమె ఒత్తిడితో పాటు పలు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంది. ఆమె పరిస్థితిని గమనించిన స్నేహితులు ఓ యోగా గురువు దగ్గరకు ఆమెను తీసుకెళ్లారు. కొన్ని తరగతులకు హాజరైన తర్వాత తనలో క్రమంగా సానుకూల మార్పులు రావడం గమనించిందామె. అంతవరకు యోగా థెరపీ గురించి పెద్దగా పట్టించుకోని అగ్రిమకు.. తనను మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేసిన ఈ వ్యాయామంపై క్రమంగా మక్కువ పెరిగింది. దాంతో దాని గురించి మరింత లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే యోగా ప్రధాన సబ్జెక్టుగా మాస్టర్స్ చేసింది.

అందుకే సైకిల్‌యాత్ర!

యోగాలో మాస్టర్స్‌ పూర్తిచేసిన తర్వాత అగ్రిమ ‘ఇండియన్ యోగా అసోసియేషన్‌’లో సభ్యురాలిగా చేరింది. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో యోగా థెరపీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఇక ఇప్పుడు యోగాపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాలని సంకల్పించుకుంది. ఇందుకు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవా’న్ని మించిన మంచి తరుణం లేదనుకున్న ఆమె.. జూన్‌ 21న కొచ్చిలోని వడుతల చిన్మయ పాఠశాల నుంచి ఒంటరిగా తన సైకిల్‌ యాత్రను ప్రారంభించింది. ‘Spinning my wheels for unveiling yoga’ అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ యాత్ర కొచ్చి నుంచి లద్దాఖ్‌ వరకు సాగనుంది.

తండ్రి స్ఫూర్తితో...

అగ్రిమ తన సైకిల్‌ యాత్రలో భాగంగా కొచ్చి నుంచి లద్దాఖ్‌ వరకు దాదాపు 3700 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అయితే ఇలా ఒంటరిగా యాత్రలు చేయడం సాహసమనే చెప్పాలి. నిజానికి తాను ఈ యాత్ర చేయడం వెనుక తన తండ్రి స్ఫూర్తి ఉందని చెబుతోందామె. తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడు ‘ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణించే ధైర్యం నీకు రావాలి’ అంటూ ఆమె తండ్రి వెన్నుతట్టారట! అలా మొదటిసారి ఆమె పుణే నుంచి బెంగళూరు వరకు ఒంటరిగా ప్రయాణించింది. అప్పటినుంచి దాదాపు 100 సార్లు ఒంటరిగానే వివిధ ప్రాంతాలకు వెళ్లానని చెబుతోంది అగ్రిమ. ఈ సైకిల్‌ యాత్రలో భాగంగా.. ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో యోగా తరగతులు నిర్వహించి.. జీవనశైలి సమస్యలతో పాటు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తానని అంటోందీ యంగ్‌ యోగిని.

యాత్రలో భాగంగా తాను ఉపయోగించే సైకిల్‌కి ముద్దుగా చక్రిక అని పేరు పెట్టుకున్న అగ్రిమ.. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ.. రాష్ట్రాల మీదుగా తన యాత్రను కొనసాగిస్తానంటోంది.

ఆల్‌ ది బెస్ట్‌ అగ్రిమ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్