Alia-Ranbir Wedding: పెళ్లికి ముందే అత్తగారి మనసు గెలుచుకుంది!

ఏ అమ్మాయైనా కొత్త కోడలిగా మెట్టినింట్లో అడుగుపెట్టాక అత్తగారి మనసు గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. అయితే ఈ విషయంలో అందాల ఆలియా నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందే తన అత్తగారు నీతూ కపూర్‌తో ‘ది బెస్ట్‌ బహూ!’ అనిపించుకుందీ క్యూటీ. కోడలిగా ఆమెతో నూటికి నూరు మార్కులు......

Updated : 14 Apr 2022 20:33 IST

(Photos: Instagram)

ఏ అమ్మాయైనా కొత్త కోడలిగా మెట్టినింట్లో అడుగుపెట్టాక అత్తగారి మనసు గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. అయితే ఈ విషయంలో అందాల ఆలియా నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందే తన అత్తగారు నీతూ కపూర్‌తో ‘ది బెస్ట్‌ బహూ!’ అనిపించుకుందీ క్యూటీ. కోడలిగా ఆమెతో నూటికి నూరు మార్కులు వేయించుకుంది. ఈ విషయం స్వయంగా నీతూనే ఓ సందర్భంలో పంచుకోవడం విశేషం. అత్తా కోడళ్లే అయినా తమది తల్లీకూతుళ్లకు మించిన అనుబంధం అని నిరూపించుకున్నారు ఆలియా-నీతూ. ఇందుకు సోషల్‌ మీడియాలో వాళ్లు పంచుకున్న ఫొటోలే కాదు.. పలు సందర్భాల్లో ఒకరి గురించి మరొకరు చెప్పిన సంగతులే ప్రత్యక్ష సాక్ష్యం! మరి, కోడలిగా తాజాగా కపూర్‌ ఇంట్లో అడుగుపెట్టిన ఆలియాకు, తన అత్తగారితో ఉన్న అనుబంధమేంటో తెలుసుకుందాం రండి..

చిన్న వయసులోనే రణ్‌బీర్‌ను చూసి మనసు పడ్డ ఆలియా.. ఇప్పుడు అతడితోనే తన జీవితాన్ని పంచుకుంది. ఇలా తనకు నచ్చిన, తనను మెచ్చిన వాడు దొరకడం తన అదృష్టమంటోందీ కొత్త పెళ్లికూతురు. అంతకంటే ముఖ్యంగా.. మంచి మనసున్న అత్తగారు దొరకడం ఆ దేవుడిచ్చిన వరమంటూ మురిసిపోతోంది. మరోవైపు నీతూ కూడా పలు సందర్భాల్లో తన కాబోయే కోడలిని ఇలా ఆకాశానికెత్తేసింది.

ఆలియా అలా ఉండాలనుకుంటున్నా!

‘మా అత్తగారు కృష్ణ కపూర్‌తో నాది మధురమైన అనుబంధం. తన కొడుకు (రిషీ కపూర్‌) కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవారావిడ. నేనూ ఏదైనా సరే తనతో నిర్మొహమాటంగా, ఓపెన్‌గా పంచుకునేదాన్ని. రిషీ విషయంలో ఏది నచ్చకపోయినా తనకు ఫిర్యాదు చేసేదాన్ని. నేను, మా అత్తగారు ఏ విషయం గురించైనా సరే సరదాగా చర్చించుకునే వాళ్లం. ఒక్కమాటలో చెప్పాలంటే.. మేమిద్దరం మంచి స్నేహితులం అనచ్చు. ఆలియా కూడా నాతో ఇదే స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా..’

షీ ఈజ్‌ సో స్వీట్!

‘నటిగా ఆలియాకు తిరుగు లేదు. ఒకరిపై అసూయ పడడం, ప్రతికూలంగా ఆలోచించడం ఆమెకు తెలియదు. తను చాలా స్వీట్‌ పర్సన్‌. మంచి మనసున్న అమ్మాయి. గౌరవమర్యాలు బాగా తెలిసిన వ్యక్తి. తను నవ్వుతూ, చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, పాజిటివ్‌గా ఉంచుతుంది. మా రణ్‌బీర్‌కు ఈడు-జోడు. వాళ్లిద్దరిదీ గొప్ప జంట అవుతుంది. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ, ఒకరికొకరు ప్రేమతో మెలగాలని ఆకాంక్షిస్తున్నా..’ అంటూ తన కోడలి గురించి చెబుతున్నారు నీతూ.

ఇక మరోవైపు రణ్‌బీర్‌ సోదరి రిధిమా ‘నా మరదలు ఎంతో క్యూట్‌గా ఉంటుంది.. అచ్చం బొమ్మలాగా!’ అంటూ ఆలియాను ఆకాశానికెత్తేసింది.

తనో స్టార్!

ఆలియా కూడా తనకు కాబోయే అత్తగారు నీతూని అప్పుడప్పుడూ ప్రశంసల్లో ముంచెత్తుతుంటుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నీతూ.. తన డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకోగా.. ‘తనో స్టార్‌’ అంటూ ప్రశంసించింది ఆలియా. ఇక ప్రతి సందర్భంలోనూ హుందాగా దుస్తులు ధరించే నీతూ ఫ్యాషన్‌ సెన్స్‌ ఆలియాకు బాగా నచ్చుతుందట! ఈ క్రమంలోనే అత్తగారి డ్రస్సింగ్‌కు ‘సో ప్రెట్టీ’ అంటూ కామెంట్లు పెడుతుంటుందీ క్యూట్‌ కోడలు. ఆలియాకు పిల్లులంటే ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే తాను రణ్‌బీర్‌తో వెకేషన్‌కి వెళ్లినప్పుడు, షూటింగ్స్‌ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తన క్యాట్‌ ఎడ్వర్డ్‌ను తన అత్తగారి దగ్గరే వదిలి వెళ్తుంటుందీ ముద్దుగుమ్మ. ‘నాకన్నా ప్రేమగా, జాగ్రత్తగా ఎడ్వర్డ్‌ని చూసుకుంటారు..’ అంటూ మరోసారి అత్తగారిని ఛీర్‌ చేసిందీ కొత్త పెళ్లి కూతురు.

ఇలా తమ మాటలతోనే కాదు.. ఒకరి కుటుంబంలో జరిగే ఫంక్షన్లు, పార్టీలకు మరొకరు హాజరవడం, పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో విషెస్‌ తెలుపుతూ ఆప్యాయంగా పెట్టే పోస్టులు.. వంటివీ ఈ అత్తాకోడళ్ల మధ్య అనుబంధాన్ని, ప్రేమను రెట్టింపు చేశాయని చెప్పచ్చు. ఏదేమైనా ఆలియా-నీతూ తమదైన అనుబంధంతో ఈతరం అత్తాకోడళ్లకు బోలెడన్ని రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతున్నారు కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్