ప్రసవం తర్వాత కలయిక.. ఎప్పుడు?

అమ్మయ్యాక శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మానసికంగా, భావోద్వేగపరంగానూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. వీటి ప్రభావం ఆరోగ్యం పైనే కాదు.. దాంపత్య బంధం పైనా పడుతుంది. ఎక్కువ సమయం చిన్నారికే కేటాయించడం, నిద్రలేమి-శారీరక నొప్పులతో సతమతమవడం వల్ల చాలామందికి శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంటుంది....

Published : 26 Feb 2024 15:11 IST

అమ్మయ్యాక శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మానసికంగా, భావోద్వేగపరంగానూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. వీటి ప్రభావం ఆరోగ్యం పైనే కాదు.. దాంపత్య బంధం పైనా పడుతుంది. ఎక్కువ సమయం చిన్నారికే కేటాయించడం, నిద్రలేమి-శారీరక నొప్పులతో సతమతమవడం వల్ల చాలామందికి శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఫలితంగా ఆలుమగల మధ్య దూరం క్రమంగా పెరుగుతుంది. ఈ దూరాన్ని తిరిగి దగ్గర చేసుకోవాలంటే.. బిడ్డ పుట్టాక లైంగిక జీవితాన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదంటున్నారు నిపుణులు. మరి, అమ్మయ్యాక శృంగారం విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వీటిని దూరం చేసుకొనే మార్గాలేంటి? ప్రసవం తర్వాత కలయికలో ఎప్పుడు పాల్గొనాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ఇవే కారణమా?
ప్రసవం తర్వాత శరీరంలో సత్తువ తగ్గిపోవడం, హార్మోన్లలో మార్పుల కారణంగా వెజైనా పొడిబారిపోవడం, Episiotomy (సుఖ ప్రసవం సమయంలో వెజైనాకు ఇరువైపులా కట్‌ చేయడం) వల్ల శృంగారంలో పాల్గొనే సమయంలో నొప్పి రావడం.. వంటివన్నీ అమ్మయ్యాక చాలామంది మహిళల్ని శృంగార జీవితానికి దూరం చేస్తుంటాయి. ఇవే కాకుండా మరిన్ని అంశాలూ ఈ సమయంలో శృంగారానికి ప్రతిబంధకాలుగా మారతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
*ప్రసవం తర్వాత ఆరోగ్యపరంగా పలు సమస్యలొస్తుంటాయి. దీనికి తోడు శక్తి లేకపోవడం వల్ల కలయికలో పాల్గొనడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధపడలేకపోతారు చాలామంది.
*అలాగే కొంతమందిలో తలెత్తే ఆత్మన్యూనతా భావం కూడా శృంగారంపై ఆసక్తిని తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్ట్రెచ్‌మార్క్స్‌, అధిక బరువు, ఎత్తుగా ఉండే పొట్ట, పలు చర్మ సంబంధిత సమస్యలు ఈ ఆత్మన్యూనతా భావానికి కారణమవుతుంటాయి.
*బిడ్డ పుట్టాక నిద్రవేళలు, ఆహారం తీసుకునే సమయాల్లో మార్పులొస్తుంటాయి. వీటి ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ఫలితంగా చిరాకు, ఒత్తిడి ఆవహిస్తుంది. ఇవీ లైంగిక కోరికల్ని హరిస్తాయి.
*బిడ్డ పుట్టాక పాలిచ్చే తల్లుల్లో లైంగిక కోరికలు తగ్గడానికి కారణం వారిలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల తగ్గుదలే! ఈ క్రమంలోనే వెజైనా పొడిబారిపోయి శృంగార కోరికలు అడుగంటి పోతాయంటున్నారు నిపుణులు.
*అప్పటిదాకా సింగిల్‌గా ఉన్న మహిళలకు అమ్మతనంలోకి అడుగుపెట్టాక అదనపు బాధ్యతలు తోడవుతాయి. ఫలితంగా వారు అన్ని పనుల్ని బ్యాలన్స్‌ చేసుకోలేక సతమతమవుతుంటారు. ఈ ఒత్తిడి కూడా కొంతమందిని లైంగిక జీవితానికి దూరం చేస్తుంటుంది.
*భాగస్వామితో సఖ్యత లేకపోవడం, ప్రసవానంతర ఒత్తిడిని వారిపై చూపుతూ ఇద్దరూ గొడవలు పడడం.. ఇలాంటి వాటి వల్ల కూడా దంపతుల మధ్య సాన్నిహిత్యం కరువవుతుంది.

ఎన్నాళ్లీ దూరం?!
ప్రసవం తర్వాత మహిళలు తిరిగి పూర్తిగా కోలుకోవాలన్నా, మునుపటిలా శక్తిని కూడగట్టుకోవాలన్నా కొన్ని నెలల సమయం పడుతుంది. అలాగని అన్ని రోజులు శృంగారానికి దూరంగా ఉండడం, భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ప్రసవానంతర లైంగిక జీవితం గురించి కొంతమందిలో కొన్ని భయాలు కూడా ఉంటాయి. కలయికలో పాల్గొంటే నొప్పి వస్తుందని, ఇన్ఫెక్షన్లు/ఇతర అనారోగ్యాలేవైనా ఎదురవుతాయేమోనని సందేహిస్తుంటారు. కానీ ఈ అపోహలన్నీ తొలగించుకొని వీలైనంత త్వరగా.. దంపతులు తిరిగి తమ లైంగిక జీవితాన్ని ప్రారంభిస్తే అది వారి అనుబంధానికి, శారీరక/మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రసవమయ్యాక నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత శృంగార జీవితం ప్రారంభించడం మంచిదంటున్నారు. అంతేకాదు.. మహిళల వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడమూ ముఖ్యమే! ఒకవేళ ఏవైనా వ్యక్తిగత అనారోగ్యాలుంటే నిపుణులను సంప్రదించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.

జాగ్రత్తలతో.. ఆనందం!
ప్రసవం తర్వాత శృంగార జీవితాన్ని తిరిగి ప్రారంభించే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమయంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కొని కలయికను పూర్తిగా ఆస్వాదించచ్చంటున్నారు నిపుణులు.
*శారీరక/మానసిక నొప్పులు, కుట్ల కారణంగా వచ్చే నొప్పుల్ని దూరం చేసుకోవాలంటే గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. అలాగే నొప్పి ఉన్న చోట ఐస్‌ ప్యాక్‌ పెట్టుకున్నా ఫలితం ఉంటుంది. వీటివల్ల శరీరానికి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శృంగారాన్నీ ఆస్వాదించచ్చు.
*వెజైనా పొడిబారే సమస్య నుంచి విముక్తి పొందాలంటే లూబ్రికెంట్స్‌ చక్కటి పరిష్కారమంటున్నారు నిపుణులు. ఫలితంగా కలయిక సమయంలో నొప్పి రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
*కపుల్‌ మసాజ్‌ కూడా ఈ సమయంలో దంపతులు కలయికను ఆస్వాదించేందుకు దోహదం చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.
*మహిళలు బిడ్డకు తగిన సమయం కేటాయిస్తూనే వ్యక్తిగత ఆరోగ్యాన్నీ సంరక్షించుకోవాలి. ఈ క్రమంలో చక్కటి నిద్ర సమయాల్ని కొనసాగించడం, పోషకాహారం తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా మారచ్చు.. ఇది పరోక్షంగా లైంగిక జీవితాన్ని సుఖమయం చేస్తుంది.
*అలాగే దంపతులు ఏకాంతంగా తగిన సమయం గడపడం కూడా ముఖ్యమే! ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృఢం చేస్తుంది.. ఈ సాన్నిహిత్యం లైంగిక కోరికల్నీ పెంచుతుంది.
అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని చిట్కాలు పాటించినా కొంతమందిలో ఈ సమస్య పరిష్కారం కాకపోవచ్చు. ఇలాంటి వారు నిపుణుల్ని సంప్రదించి తగిన సలహాలు పాటించడం ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్