హాలీవుడ్ తారలకూ ఆమె నగలంటే ఇష్టం!

చిన్న వయసు నుంచీ ఆమె లక్ష్యం ఒక్కటే.. డిజైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలని! అయితే ఆ దారిలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదొడుకులు ఆమెకు స్వాగతం పలికాయి.. అయినా వాటిని దాటడానికే సిద్ధపడింది కానీ వెనుకంజ వేయలేదు. ఈ క్రమంలో సేల్స్‌ గర్ల్‌గా పనిచేయడానికీ వెనకాడలేదు. ఈ సంకల్పమే ఇప్పుడు ఆమెను నగల డిజైనింగ్‌ రంగంలో కోట్లకు....

Updated : 06 Jan 2023 18:27 IST

(Photos: Instagram)

చిన్న వయసు నుంచీ ఆమె లక్ష్యం ఒక్కటే.. డిజైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలని! అయితే ఆ దారిలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదొడుకులు ఆమెకు స్వాగతం పలికాయి.. అయినా వాటిని దాటడానికే సిద్ధపడింది కానీ వెనుకంజ వేయలేదు. ఈ క్రమంలో సేల్స్‌ గర్ల్‌గా పనిచేయడానికీ వెనకాడలేదు. ఈ సంకల్పమే ఇప్పుడు ఆమెను నగల డిజైనింగ్‌ రంగంలో కోట్లకు పడగెత్తేలా చేసింది. చెవిదిద్దుల దగ్గర్నుంచి చేతి గాజుల దాకా, హారాల దగ్గర్నుంచి కాలి పట్టీల దాకా.. ఆమె రూపొందించని ఆభరణం లేదంటే అతిశయోక్తి కాదు. ఇలా తన విభిన్న డిజైన్లతో పలువురు హాలీవుడ్‌ తారల్నీ ఆకట్టుకుందామె. సేల్స్‌గర్ల్‌గా 20 రూపాయలతో తొలి జీతం అందుకొని.. ఇప్పుడు కోట్ల వ్యాపారాన్ని ఒంటి చేత్తో నడిపిస్తోన్న చీనూ కాలా స్ఫూర్తి గాథ ఇది!

తెలిసీ తెలియని వయసులో అమ్మ చీరలు, నగలు.. వంటివి ధరించి మురిసిపోయిన జ్ఞాపకాలు మనలో చాలామందికి ఉండే ఉంటాయి. బెంగళూరుకు చెందిన చీనూ కాలాకూ ఇలాంటివి అనుభవమే! ఐదేళ్ల వయసు నుంచే నగలపై పిచ్చి ప్రేమను పెంచుకున్న ఆమె.. తన తల్లి వార్డ్‌రోబ్‌ నుంచి నచ్చిన ఆభరణాల్ని తీసుకొని ధరించేది. అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయేది. ఎప్పటికైనా నగల డిజైనింగ్‌ రంగంలోనే స్థిరపడాలని ఆనాడే నిర్ణయించుకుందామె.

చాకులమ్ముతూ..!

ఈ క్రమంలో పదిహేనేళ్ల వయసులో స్కూలింగ్‌ పూర్తయ్యాక కొన్ని కారణాల వల్ల తన ఇల్లు వదిలి ముంబయి చేరుకుంది చీనూ. ఆ సమయంలో చేతిలో బట్టల బ్యాగు, పర్సులో రూ. 300 తప్ప మరేవీ లేవు. నగల డిజైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలో కూడా తనకు పూర్తి అవగాహన లేదు. దీంతో పూట గడవడమే కష్టంగా మారిన ఆ పరిస్థితుల్లో సేల్స్‌ గర్ల్‌గా రూ. 20కి ఉద్యోగంలో చేరింది చీనూ. ఇంటింటికీ తిరుగుతూ చాకులు, కోస్టర్లు అమ్మేది. కొంతమంది ఆమె ఉత్పత్తులు కొనకపోగా, మొహం మీదే తలుపులు వేసేసేవారని, అది తనను చాలా బాధపెట్టేదని చెబుతుంది చీనూ. ఇక ఆపై కొన్నాళ్ల పాటు స్థానిక రెస్టరంట్‌లో వెయిట్రెస్‌గానూ పనిచేసిందామె. మరికొన్నేళ్లు వివిధ ఉద్యోగాల్లో కొనసాగింది.

భర్త ప్రోత్సాహంతో..

ఉద్యోగం చేస్తోన్న క్రమంలోనే బెంగళూరుకు చెందిన అమిత్‌ కాలాతో చీనూకు ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారితీసింది. ఫ్యాషన్‌ రంగంలోకి రావాలన్న ఆమె అభీష్టాన్ని అమిత్‌ అర్థం చేసుకున్నారు.. ఈ దిశగానే ఆమెను ప్రోత్సహించారు. అయితే అంతకంటే ముందు మేకప్‌ ఆర్టిస్ట్‌ కోర్సు చేసిన చీనూకు.. ఈ క్రమంలోనే ‘గ్లాడ్‌రాగ్స్‌ మిసెస్‌ ఇండియా అందాల పోటీ’ల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అందులో టాప్‌-5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచిన చీనూకు.. పలు ప్రముఖ సంస్థలు మోడలింగ్‌ అవకాశాల్ని అందించాయి. అలా అంతకంతకూ తన పాపులారిటీని పెంచుకుంటూ వెళ్లిన ఆమె.. ఈ క్రమంలోనే తన వ్యాపారానికి కావాల్సిన డబ్బునూ కూడబెట్టుకుంది. అలా రూ. 3 లక్షల పెట్టుబడితో బెంగళూరులో ‘రూబన్స్‌’ పేరుతో నగల డిజైనింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించి తన కలను సాకారం చేసుకుంది చీనూ.

అకేషన్‌కి తగ్గట్లుగా..!

హెడ్‌ యాక్సెసరీస్‌తో చిన్న స్టోర్‌గా ప్రారంభించిన ఆమె వ్యాపారం.. ఈ 14 ఏళ్లలో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50కి పైగా దేశాల్లో విస్తరించింది. చెవిదిద్దులు, చేతి ఆభరణాలు, హారాలు, నెక్లెస్‌లు, హెడ్‌ జ్యుయలరీ, పెళ్లికి సంబంధించిన నగలు, ఫ్లోరల్‌ జ్యుయలరీ, కాలి పట్టీలు.. ఇలా తల దగ్గర్నుంచి కాలి కొనగోటి దాకా.. ఆమె డిజైన్‌ చేయని ఆభరణమంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ బంగారు ఆభరణాలే కాకుండా.. నవరత్నాలు పొదిగినవి, మీనాకారీ జ్యుయలరీ, మోడ్రన్‌ యాక్సెసరీస్‌, వెస్ట్రన్‌ యాక్సెసరీస్‌.. ఇలా విభిన్న ఆభరణాల్ని.. సరికొత్త డిజైన్లలో, కస్టమైజ్‌డ్‌ తరహాలో రూపొందించి ఎంతోమంది ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకుంటోంది చీనూ. అందుకే తన నగల్ని కృతీ సనన్‌, ప్రియమణి.. వంటి దేశీ సెలబ్రిటీలే కాదు.. బియాన్స్‌, కెండల్‌ జెన్నర్‌.. వంటి హాలీవుడ్‌ తారలూ ఇష్టపడతారంటోంది. ఇలా నగలతో పాటు హ్యాండ్‌బ్యాగ్స్, క్లచెస్‌, పొత్లీ బ్యాగ్స్‌.. వంటివీ సరికొత్తగా రూపొందించి విక్రయిస్తోందీ ఫ్యాషనర్‌. ఇలా తన సృజనాత్మక డిజైన్లతో కోట్లు సంపాదిస్తోంది.

ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే..!

తన వ్యాపార ప్రయాణంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకొని స్వయంశక్తితో ఎదిగిన మహిళగా పేరు తెచ్చుకున్న చీనూ.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయం సాధించగలమని చెబుతోంది. ‘సవాళ్లకు భయపడితే నేను ఇక్కడిదాకా వచ్చేదాన్నే కాదు. స్వీయ సామర్థ్యంపై నమ్మకముంచా.. వ్యాపారంలోనూ వినియోగదారుల అభిరుచులకు ప్రాధాన్యమిచ్చా. ఇవే నన్ను ప్రస్తుతం ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇక ఇందులో నా భర్త అమిత్‌ ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. ఇక నా వృత్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యమిస్తానో, ఇంటికీ అంతే సమయం కేటాయిస్తా. నా భర్త, కూతురితో గడపడంతో పాటు నాకంటూ వ్యక్తిగతంగా కొంత సమయం వెచ్చిస్తా. ఈ క్రమంలో క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, భవిష్యత్‌ ప్రణాళికల గురించి ప్లాన్‌ చేసుకోవడం.. ఇవన్నీ అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా విజయం సాధించేందుకు దోహదం చేస్తున్నాయి..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోన్న చీనూ.. దేశంలో పలు బిజినెస్‌ పత్రికలు విడుదల చేసిన జాబితాల్లోనూ చోటు దక్కించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్