‘బ్లాక్‌ మోడల్‌’ అనేవారు!

కార్లు, ఫోన్లు.. మొదలైన వాటి విషయంలో కొంతమంది నలుపు రంగును ఏరికోరి ఎంచుకుంటారు. అలాంటిది చర్మ ఛాయ విషయానికొస్తే నలుపే ఈ సమాజానికి శత్రువుగా మారుతుంది.. నల్లగా ఉన్న వారిని చూసి అవమానిస్తుంది.. అవహేళనలకు గురిచేస్తుంది.

Published : 04 Nov 2023 18:54 IST

(Photos: Instagram)

కార్లు, ఫోన్లు.. మొదలైన వాటి విషయంలో కొంతమంది నలుపు రంగును ఏరికోరి ఎంచుకుంటారు. అలాంటిది చర్మ ఛాయ విషయానికొస్తే నలుపే ఈ సమాజానికి శత్రువుగా మారుతుంది.. నల్లగా ఉన్న వారిని చూసి అవమానిస్తుంది.. అవహేళనలకు గురిచేస్తుంది. తన చర్మ ఛాయ విషయంలో తానూ ఇలాంటి ఎన్నో అవమానాల్ని భరించానంటోంది పుదుచ్చేరి మోడల్‌ శాన్‌ రేచల్‌ గాంధీ. సమాజం నిర్దేశించిన సౌందర్య ప్రమాణాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసిన ఆమె.. ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించడమే అసలైన అందమని ఆ తర్వాత తెలుసుకుంది. ఈ పాజిటివిటీతోనే పలు అందాల కిరీటాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలో జరగబోయే ‘మిస్‌ ఆఫ్రికా గోల్డెన్‌’ అందాల పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రేచల్‌ మోడలింగ్‌ జర్నీ గురించి తెలుసుకుందాం..!

మొహం చిట్లించుకునేవారు!

రేచల్‌ సొంతూరు తమిళనాడు. పుదుచ్చేరిలో పుట్టి పెరిగిన ఆమె.. ప్రస్తుతం అక్కడే స్థిరపడింది. వైద్య విద్యపై మక్కువతో సిమ్లాలోని ‘ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీ’లో మెడిసిన్‌ పూర్తిచేసింది. అయితే పసి వయసు నుంచే నల్లగా, బొద్దుగా ఉండే ఆమెను చూసి చాలామంది మొహం చిట్లించుకునేవారు. అటు స్కూల్లోనూ తోటి విద్యార్థుల నుంచి అవమానాల్నీ ఎదుర్కొందామె.

‘చిన్నప్పుడు నా చర్మ ఛాయను చూసి దగ్గరికి తీసుకునే వారి కంటే దూరం పెట్టే వారే ఎక్కువ మంది ఉండేవారు. స్కూల్లోనూ తోటి పిల్లలంతా నావైపు అదోలా చూసేవారు. నన్నో భూతంలా భావించేవారు. నా చర్మ ఛాయ గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడేవారు. తెలిసీ తెలియని వయసులో వాళ్లనే మాటలు నా మనసును బాధపెట్టేవి. ఇవన్నీ భరించలేక కొన్నాళ్ల పాటు స్కూల్‌ మానేసి నాలుగ్గోడలకే పరిమితమయ్యా. నేనూ అందరిలా తెల్లగా మారాలని, సమాజం నన్ను గుర్తించాలని ఆరాటపడేదాన్ని. ఈ క్రమంలోనే మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ఉపయోగించడం మొదలుపెట్టా. కానీ అవి పైపై మెరుగులే తెచ్చిపెట్టేవి.. లోలోపలి నుంచి నా చర్మ ఛాయ విషయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అప్పుడనిపించింది.. ఇలా కృత్రిమ అందాన్ని సొంతం చేసుకోవడం కంటే.. నన్ను నేనుగా స్వీకరించడం మేలని! అందుకే అప్పట్నుంచి ఎవరేమనుకున్నా పట్టించుకోవడం మానేశా..’ అంటోంది రేచల్.

‘అవకాశాలివ్వం పొమ్మ’న్నారు!

నల్లగా ఉన్నా చిన్నతనం నుంచి మోడలింగ్‌ చేయాలని కలలు కంది రేచల్‌. అయితే అందులోనూ తాను అనుకున్నంత సులభంగా అవకాశాలు రాలేదామెకు. కేవలం తన చర్మ ఛాయ వల్లే తాను ఎన్నోసార్లు తిరస్కరణలకు గురయ్యానంటోంది.

‘చిన్నప్పుడు అమ్మ నాకు ఫ్యాషనబుల్‌గా ఉండే దుస్తులు ఎక్కువగా వేసేది. దీంతో నాకు ఫ్యాషన్‌పై మక్కువ పెరిగింది. ఇదే క్రమంలో మోడలింగ్ పైనా ఇష్టం ఏర్పడింది. నిజానికి నాకంటే ముందు ఈ రంగంలోకి అడుగుపెట్టిన వారు మా కుటుంబంలో ఎవరూ లేరు. అయినా నా మనసు తెలుసుకొని నాన్న నన్ను మోడలింగ్‌లో ప్రోత్సహించారు. అయితే ఇక్కడా నా చర్మ ఛాయ వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా. కేవలం నల్లగా ఉన్నానన్న కారణంగా ఎన్నో సంస్థలు నన్ను మోడల్‌గా ఎంచుకోవడానికి నిరాకరించాయి. అయినా సరే ఆత్మవిశ్వాసంతో చర్మ ఛాయ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించేదాన్ని. చర్మ రంగు కంటే గుణగణాలు, ప్రవర్తన, వైఖరే ముఖ్యమని చెప్పేదాన్ని. నా మాటలు కొంతమంది అంగీకరించినా.. మరికొందరు కొట్టిపడేసేవారు. ఇన్ని పోరాటాల అనంతరం.. నేను మెడిసిన్‌ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు మోడల్‌గా నాకు తొలి అవకాశం వచ్చింది. కర్ణాటకలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొని ర్యాంప్‌పై నడిచాక నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది.. ఇప్పటికీ చాలామంది నన్ను మోడల్‌గా కంటే బ్లాక్‌ మోడల్‌గానే పరిగణిస్తుంటారు..’ అంటోన్న రేచల్‌.. ఆపై పలు ఫ్యాషన్‌, జ్యుయలరీ బ్రాండ్లకు మోడలింగ్‌ చేసే అవకాశాలు అందుకుంది.

ఐష్‌ స్ఫూర్తితో..!

మోడలింగ్‌ చేస్తోన్న క్రమంలోనే అందాల పోటీల్లోనూ పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకుంది రేచల్‌. చర్మ ఛాయతో సంబంధం లేకుండా ట్యాలెంట్‌ ఉంటే ఎవరైనా అందాల కిరీటం గెలవగలరని నిరూపించడానికే ఈ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించానంటోందామె.

‘ఐశ్వర్యారాయ్‌ స్ఫూర్తితోనే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆసక్తి పెరిగింది. అంతేకాదు.. పోటీల్లో నెగ్గి చర్మ ఛాయ కంటే ప్రతిభే ముఖ్యమని నిరూపించాలనుకున్నా. ఈ ఆత్మవిశ్వాసంతోనే ‘మిస్‌ పుదుచ్చేరి’, ‘మిస్‌ బ్లాక్‌ డ్రస్‌’, ‘మిస్‌ డార్కెస్ట్‌ క్వీన్‌’, ‘మిస్‌ సింగింగ్‌ స్టార్‌’, ‘ఎంపైరింగ్‌ మోడల్‌ సౌత్‌’.. వంటి టైటిల్స్‌ గెలుచుకున్నా. మరికొన్ని పోటీల్లో రన్నరప్‌గా నిలిచా.. ఇక ఈ నెలలో జరగబోయే ‘మిస్‌ ఆఫ్రికా గోల్డెన్‌’ అందాల పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా. ఈ కిరీటం కూడా నెగ్గి.. నాలాంటి అమ్మాయిల్లో స్ఫూర్తి నింపాలనుకుంటున్నా..’ అంటోంది రేచల్‌. ప్రస్తుతం ‘పుదుచ్చేరి క్వీన్స్‌’ అనే మహిళల కమ్యూనిటీలో భాగమైన ఈ బ్యూటీ క్వీన్‌.. తన జీవితానుభవాల్ని ఈ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. భవిష్యత్తులో ఓ బయాలజీ సెంటర్‌ను తెరవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోన్న రేచల్‌.. సమాజం నిర్దేశించిన సౌందర్య ప్రమాణాల్ని మార్చేందుకు చేస్తోన్న కృషి స్ఫూర్తిదాయకం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్