Published : 29/12/2022 21:42 IST

Radhika-Anant: అలా ప్రేమలో పడ్డారు..!

(Photo: Twitter)

అపర కుబేరులు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్,  మర్చంట్ వారసురాలైన రాధికా మర్చంట్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన వీరి నిశ్చితార్థం వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు.

కోడలంటే అటు పుట్టింటి అనురాగాన్ని, ఇటు మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టాలంటారు. శ్రీమంతురాలు నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌ ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న రాధిక భరతనాట్యంలో కూడా ఆరితేరింది. కొన్ని మాసాల క్రితం తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఇటు అత్తింటి వారినే కాదు.. అటు దేశంలోని మహామహుల్నీ మెప్పించింది. నీతా అంబానీ కూడా భరతనాట్య కళాకారిణే కావడంతో.. రాధిక పెళ్లికి ముందే అత్తగారికి తగ్గ కోడలనిపించుకుందని అప్పట్లో అందరూ ప్రశంసించారు. తాజాగా జరిగిన నిశ్చితార్థం నేపథ్యంలో నీతా అంబానీకి కాబోయే ఈ ‘ఛోటీ బహూ’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

రాధికా మర్చంట్‌.. 2018లో ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమల్‌ల వివాహ వేడుక సమయంలోనే ఈ పేరు ఎక్కువగా వినిపించిందని చెప్పచ్చు. ‘ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌’ సంస్థ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ల గారాల పట్టి రాధిక. ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్‌ అంబానీకి కాబోయే భార్య. న్యూయార్క్‌ యూనివర్సిటీలో పాలిటిక్స్‌, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొన్నాళ్లు పనిచేసింది. ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. చేసే పని పట్ల నిబద్ధతను కనబరిచే రాధిక.. ‘నచ్చిన పనిలో దొరికిన సంతోషం మరెందులోనూ పొందలేం’ అంటుంది.

అలా ప్రేమలో..!

మర్చంట్‌ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఇదే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల మధ్య ప్రేమకు దారితీసిందని చెప్పచ్చు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు.

ఆఖరికి 2018లో ఇషా-ఆనంద్‌, 2019లో ఆకాశ్‌-శ్లోకల పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం, ప్రతి వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్‌ వేడుకలో కుటుంబంతో కలిసి.. అనంత్‌కు జంటగా డ్యాన్స్‌ చేయడం, ఫ్యామిలీ ఫొటోల్లోనూ కనిపించడంతో.. అందరూ ఆమే నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలు అనుకున్నారు. ఇక వీటితో పాటు అనంత్‌-రాధికలు కలిసి దిగిన కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాదు.. ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌ వివాహంలోనూ రాధిక అంబానీ కుటుంబంతో కలిసి వేడుకలకు హాజరైంది.

‘సింపుల్‌ అండ్‌ స్వీట్‌’ గర్ల్!

పుట్టింది గొప్పింటి వ్యాపార కుటుంబంలోనే అయినా.. వ్యక్తిగతంగా ఎంతో సింపుల్‌గా కనిపిస్తుంది రాధిక. చాలావరకు ఆయా వేడుకల్లో సంప్రదాయబద్ధంగా కనిపించడానికే ఆసక్తి చూపుతానంటోంది.

ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలిసి పనిచేస్తోన్న రాధిక.. మరో పక్క తన తండ్రి ఆరోగ్య సంస్థ వేదికగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌ను ఇష్టపడతానంటోంది రాధిక. ‘ట్రెక్కింగ్‌లో దొరికే ఆనందం, ప్రశాంతత మరెందులోనూ దొరకదం’టూ ఈ యాక్టివిటీపై తనకున్న ప్రేమను ఓ సందర్భంలో చాటుకుంది.

రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్న వయసు నుంచే ఇష్టం. ఈ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్‌ భావనా థాకర్‌ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.

రాధికకు కాఫీ అంటే చాలా ఇష్టమట! ఇంట్లోనే కాదు.. ఆఫీస్‌లో ఉన్నా కాఫీతో రిలాక్సవుతానంటోందీ కాఫీ లవర్.

‘ఏ పనైతే సమాజానికి ఉపయోగపడుతుందనిపిస్తుందో.. ఆ పని చేయడానికే ఇష్టపడతా.. అప్పుడే కదా మనకు ఆత్మ సంతృప్తి..’ అంటూ పని పట్ల తనకున్న అంకితభావాన్ని, సమాజం పట్ల ఉన్న బాధ్యతను చాటుకుంటుంది.

నీతా అంబానీకి కాబోయే ఈ కోడలు పిల్ల మంచి ఫ్యాషనర్‌ కూడా! ఈ విషయం ఆయా సందర్భాల్లో ఆమె ధరించే హుందా దుస్తులే చెబుతాయి.

మరోవైపు ఆరోగ్యం, ఫిట్‌నెస్ పైనా దృష్టి పెడతానంటోంది రాధిక. ఈ క్రమంలో తన రోజువారీ రొటీన్‌లో వ్యాయామాలు తప్పకుండా ఉంటాయని చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి