Anisha Padukone: అప్పుడు అక్కతో పాటు అందరం బాధపడ్డాం!

ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని ప్రభావం వారి పైనే కాదు.. కుటుంబ సభ్యులందరి పైనా పడుతుంది. అలా తన అక్క ఆందోళన తమ పైనా తీవ్ర ప్రభావం చూపిందంటోంది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె. వృత్తిరీత్యా గోల్ఫర్‌.....

Published : 13 Mar 2023 18:18 IST

(Photos: Instagram)

ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని ప్రభావం వారి పైనే కాదు.. కుటుంబ సభ్యులందరి పైనా పడుతుంది. అలా తన అక్క ఆందోళన తమ పైనా తీవ్ర ప్రభావం చూపిందంటోంది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె. వృత్తిరీత్యా గోల్ఫర్‌ అయిన ఆమె.. ప్రస్తుతం దీపిక నెలకొల్పిన ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌’ ఫౌండేషన్‌ (TLLL)కు సీఈవోగా కొనసాగుతోంది. తన అక్క స్ఫూర్తితో ప్రస్తుతం తన మానసిక ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానంటోన్న అనీషా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ అంశంపై స్పందిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటుంది. అలా ఇటీవలే ఓ సందర్భంలో ‘మానసిక సమస్యలు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయ’న్న విషయంలో తన మనసులోని మాటల్ని పంచుకుంది అనీషా.

అక్కతో పాటు అందరం బాధపడ్డాం!

ఇంట్లో ఎవరికి బాలేకపోయినా దాని ప్రభావం ఆ ఇంట్లో ఉన్న అందరి పైనా పడుతుంది.. అందులోనూ అవగాహన లేని ఆరోగ్య సమస్య తలెత్తితే మరింత ఇబ్బంది పడతాం. 2015లో మా కుటుంబ పరిస్థితీ ఇదే! ఆ సమయంలో అక్క ఆందోళన (డిప్రెషన్‌) మాకు సవాలుగా మారింది. ఓవైపు ఈ సమస్యపై అవగాహన లేకపోవడం, మరోవైపు అక్కను తిరిగి మామూలు మనిషిని చేసే క్రమంలో నేను మరింత ఇబ్బంది పడ్డా. దీని గురించిన పూర్తి సమాచారం కూడా ఆ రోజుల్లో అందుబాటులో లేదు. ఒకరకంగా కుటుంబమంతా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ సమయంలో అమ్మ ఎంతో సంయమనంతో వ్యవహరించింది. అక్కను కౌన్సెలింగ్‌ నిపుణుల వద్దకు తీసుకెళ్లింది. వాళ్లూ మాకు తెలిసిన వారు కావడంతో ఈ సమస్య నుంచి అక్క త్వరగా బయటపడగలిగింది. ఆపై ఈ అంశం గురించి అక్క చాలా సందర్భాల్లో ప్రస్తావించింది. తన అనుభవాల్నీ పంచుకుంది. ఈ మానసిక సమస్యలపై అందరిలో అవగాహన పెంచేందుకు, దీనిపై సమాజంలో ఉన్న మూసధోరణుల్ని, అపోహల్ని తొలగించే లక్ష్యంతోనే ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌’ పేరుతో 2015లో ఓ స్వచ్ఛంద సంస్థనూ నెలకొల్పింది.

ఆడపిల్లలకు ప్రత్యేకంగా..!

ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక సమస్యలు జీవితంలో ఎప్పుడైనా దాడి చేయచ్చు. ముఖ్యంగా పెళ్లి, ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా జీవితం గడపడం, రోజువారీ పనులతో తీరిక లేకపోవడం, గర్భం దాల్చినప్పుడు, ప్రసవం తర్వాత, ఇతరుల అంచనాల్ని అందుకోవాలన్న ఆరాటం, సామాజిక వివక్ష.. వంటివి చాలామంది మహిళలకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. ఇలాంటి సవాళ్లు, పరిస్థితుల్ని అధిగమించి మహిళల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి.. ప్రస్తుతం మా సంస్థ వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో YANA (యూ ఆర్‌ నాట్‌ ఎలోన్‌) ముఖ్యమైనది. 6-12 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే స్కూల్‌ ప్రోగ్రామ్‌ ఇది. అంతేకాదు.. ఆయా మానసిక సమస్యలున్న చిన్నారులకు సంబంధిత చికిత్స కూడా ఉచితంగా అందిస్తున్నాం. ఇక మా వెబ్‌సైట్లో 15 హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉంచాం. వాటి ద్వారా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు.. వారి మాతృభాషలోనే సౌకర్యవంతంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేవలు పొందచ్చు. అలాగే బాధితులు ఆయా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలూ పొందచ్చు.


గోల్ఫ్‌ కంటే ముందు..!

సైకాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన నేను.. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ‘స్ట్రాటజిక్‌ నాన్‌-ప్రాఫిట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా’ కోర్సు పూర్తి చేశాను. ప్రస్తుతం TLLL సీఈవోగా, ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లో భాగంగా మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తోన్న ‘గ్లోబల్‌ ఫ్యూచర్‌ కౌన్సిల్‌’లో సభ్యురాలిగానూ కొనసాగుతున్నా. నాకు చిన్న వయసు నుంచే ఆటలంటే చాలా ఇష్టం. ఈ మక్కువతోనే ఒకటి కాదు, రెండు కాదు సుమారు 12 ఆటల్లో ప్రావీణ్యం సంపాదించా. తొలుత రాష్ట్ర స్థాయిలో బాస్కెట్‌బాల్‌ క్రీడల్లో పాల్గొన్న నేను.. జాతీయ స్థాయిలో క్రికెట్‌ కూడా ఆడా. ఆ తర్వాతే గోల్ఫ్‌ క్రీడను నా కెరీర్‌గా మార్చుకున్నా. రోజూ ఎంత బిజీగా ఉన్నా రెండు గంటలు ఆటలకు సమయం కేటాయిస్తా. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం, అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఆటల్లో రాణించగలుగుతున్నా.


అక్క కాదు.. అమ్మ!

అక్కకు, నాకు వయసులో ఐదేళ్ల వ్యత్యాసం ఉంది. ఇద్దరం మంచి స్నేహితుల్లా మెలుగుతాం. తను నన్ను అమ్మలా లాలిస్తుంది.. కెరీర్‌ పరంగా మా పనుల్లో బిజీగా ఉండడం వల్ల కనీసం మూడు నెలలకోసారైనా కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అయితే అప్పుడు మా పనుల కంటే వ్యక్తిగత విషయాల గురించి చర్చించడానికి, పంచుకోవడానికే ఇష్టపడతాం. ఇక అక్క సినిమాలన్నీ వదలకుండా చూస్తా. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని.. ఇలా నా అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తా. అక్క ఎప్పుడూ అంటుంటుంది.. ‘నువ్వు నాకు పెద్ద విమర్శకురాలివి’ అని! నా అభిప్రాయమేదైనా తను సానుకూలంగానే స్వీకరిస్తుంది.


ప్రశాంతత కోసం నేనేం చేస్తానంటే..?!

ఇంట్లో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఎదురైతే మరింత అలర్ట్‌ అవుతాం.. ఆ సమస్య మనదాకా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. నిజానికి డిప్రెషన్‌తో అక్క బాధపడడం కళ్లారా చూసిన నేను.. అప్పట్నుంచి మానసిక ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టా. ఈ క్రమంలో కొన్ని అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తున్నా.

రోజూ ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నా.

రాత్రుళ్లు 8 గంటలు తప్పకుండా నిద్రకు సమయం కేటాయిస్తున్నా.

చాలామంది మహిళలు ఇంటిని-కెరీర్‌ను బ్యాలన్స్‌ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇది కొంతమందిని కుంగదీస్తుంది. కానీ రోజూ ప్రణాళిక ప్రకారం పనులు చేస్తే ఈ బ్యాలన్స్‌ అదుపు తప్పే అవకాశమే ఉండదు. నా వర్క్‌-లైఫ్ బ్యాలన్స్‌ సీక్రెట్‌ కూడా ఇదే!

మానసిక ప్రశాంతతను దూరం చేసే వాటిలో మొబైల్‌ ముందు వరుసలో ఉంటుంది. అందుకే రోజూ కొన్ని గంటల పాటు దీన్ని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నా.. ఇప్పటికీ ఈ నియమం పాటిస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్