Autism: ఐన్‌స్టీన్‌ను మించిన ఐక్యూ.. 11 ఏళ్లకే ఇంజినీరింగ్‌లో మాస్టర్స్!

చిన్నతనంలో పిల్లలకొచ్చే కొన్ని సమస్యలు వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. స్కూల్లో వారిని ఇతర పిల్లలతో కలవకుండా చేస్తాయి.. వారి చేతిలో బుల్లీయింగ్‌కి గురయ్యేలా చేస్తాయి. మెక్సికోకు చెందిన పదకొండేళ్ల అధారా....

Published : 12 May 2023 12:49 IST

(Photos: Instagram)

చిన్నతనంలో పిల్లలకొచ్చే కొన్ని సమస్యలు వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. స్కూల్లో వారిని ఇతర పిల్లలతో కలవకుండా చేస్తాయి.. వారి చేతిలో బుల్లీయింగ్‌కి గురయ్యేలా చేస్తాయి. మెక్సికోకు చెందిన పదకొండేళ్ల అధారా పెరెజ్‌ సాంచెజ్‌ కూడా ఇలాంటి వేధింపుల్నే ఎదుర్కొంది. మూడేళ్ల వయసులో ఆటిజం నిర్ధారణ అయిన ఆమె.. పాఠశాలలో ఇటు తోటి పిల్లల వేధింపులు, అటు టీచర్ల ఫిర్యాదుల్ని ఎదుర్కొంది.. ఎంతో మానసిక వేదనను అనుభవించింది. అయితే మానసిక ఎదుగుదల నిదానంగా ఉన్నప్పటికీ తనలో ఐక్యూ మాత్రం అద్భుతంగా ఉందని గుర్తించిన ఆమె తల్లి.. ప్రత్యేక థెరపీ ఇప్పించింది. ఫలితంగా తొమ్మిదేళ్లకే రెండు డిగ్రీలు చదివేంత చురుగ్గా మారిపోయింది. ప్రస్తుతం పదకొండేళ్ల వయసున్న అధారా.. ఇటీవలే మాస్టర్స్‌ కూడా పూర్తిచేసి.. మరోసారి తన మేధను ప్రపంచానికి చాటింది. ఐక్యూలో స్టీఫెన్‌ హాకింగ్స్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌.. వంటి మేధావుల్నే దాటేసిన ఈ బ్రిలియంట్‌.. భవిష్యత్తులో వ్యోమగామి కావడమే తన లక్ష్యమంటోంది.

అధారా పెరెజ్‌ సాంచెజ్‌.. మెక్సికోలో పుట్టి పెరిగింది. పసి వయసులో అందరు పిల్లల్లాగే పాకడం, నడవడం, పరిగెత్తడం.. వంటి దశలన్నీ సాధారణంగానే దాటేసిన ఆమెలో మూడేళ్ల వయసులో కొన్ని ప్రవర్తన లోపాలు గుర్తించింది అధారా తల్లి నయేలీ సాంచెజ్‌. తోటి పిల్లలతో మాట్లాడడం, కలిసి ఆడుకోవడం కంటే తనతో తను ఆడుకోవడానికే ఇష్టపడేదంటోందామె.

ఆటిజం అని తెలిసి..!

‘అధారా మూడేళ్ల దాకా అందరు పిల్లల్లాగే వివిధ దశలను సాధారణంగానే దాటేసింది. అయితే మూడేళ్ల వయసులో తన ఎదుగుదలలో కొన్ని మార్పులు గమనించాను. ఎక్కువగా బ్లాక్స్‌తో ఆడుకోవడం, వాటిని చక్కగా అమర్చడం, పిల్లలు తినే కుర్చీలో కూర్చొని తినడం.. ఇలా తన లోకం తనదే అన్నట్లుగా వ్యవహరించేది.. చాలా యాక్టివ్‌గా ఉండేది కూడా! అయితే రోజులు గడుస్తోన్నా ఇతర పిల్లలతో కలవకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడంతో వైద్యుల్ని కలిశాం. అప్పుడు తెలిసింది.. తనకు ఆటిజం ఉందని! అయినా తనలో గ్రహించే శక్తి, జ్ఞాపకశక్తి మెండుగా ఉన్నాయని నాకు అర్థమైంది.. ఈ క్రమంలోనే మానసిక నిపుణుల సలహా మేరకు ప్రత్యేక చికిత్స ఇప్పించాం..’ అంటున్నారు నయేలీ.

బుల్లీయింగ్‌కి గురైంది!

ఇక తనకున్న మానసిక లోపంతో స్కూల్లోనూ పలు వేధింపులు ఎదుర్కొంది అధారా. తోటి విద్యార్థులు ఆమెను ‘Weirdo (విచిత్రమైన వ్యక్తి)’, ‘Oddball (అందరికంటే భిన్నమైన వ్యక్తి)’ అని ఆటపట్టించేవారు. మరోవైపు టీచర్లు కూడా ‘మీ పాప తరగతి గదిలోనే నిద్ర పోతుంది.. పాఠాలపై అస్సలు శ్రద్ధ పెట్టట్లేదు..’ అని ఆమె తల్లికి ఫోన్‌ చేసి పదే పదే ఫిర్యాదు చేసేవారు. అయినా తన కూతురి ప్రతిభ పైనే నమ్మకముంచింది నయేలీ. ఇక ఈ వేధింపులు భరించలేక ఒక్కోసారి స్కూలుకెళ్లనని మొండికేసేది అధారా.. తీవ్ర ఒత్తిడికి లోనయ్యేది. అయితే ఇలా తన కూతురిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. మానసిక నిపుణుల సలహా మేరకు అధారాను ఆ స్కూల్‌ నుంచి ‘ట్యాలెంట్‌ సర్వీస్‌ సెంటర్’ కి మార్చిందామె. ఇక్కడే అధారా ఐక్యూ 162గా ఉందని నిరూపితమైంది. అంటే.. 160 ఐక్యూ ఉన్న స్టీఫెన్ హాకింగ్స్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌.. వంటి మేధావులనే దాటేసింది అధారా. సాధారణంగా ఒక వ్యక్తికి 130 ఐక్యూ ఉండడమే వరం.. అలాంటిది 162 ఐక్యూతో తన మానసిక లోపాన్ని కూడా ఓడించిందీ మెక్సికన్‌ అమ్మాయి.

పదకొండేళ్లకే మాస్టర్స్!

అయితే ట్యాలెంట్‌ సర్వీస్‌ సెంటర్‌లో కొన్నాళ్ల పాటు విద్యనభ్యసించిన అధారాను.. ఆపై ఆర్థిక పరిస్థితులు సహకరించక దూర విద్య ద్వారానే చదివించారు ఆమె తల్లి నయేలీ. ఈ క్రమంలోనే తన అద్భుత ప్రతిభతో ఐదేళ్లకే ప్రాథమిక విద్యాభ్యాసం, ఎనిమిదేళ్ల లోపే ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది అధారా. తొమ్మిదేళ్లకు డిగ్రీ పట్టా అందుకున్న అధారా.. మెక్సికోలోని CNCI యూనివర్సిటీలో ‘సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌’, UNITEC యూనివర్సిటీలో ‘ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ మ్యాథమేటిక్స్‌’.. విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీలు పూర్తిచేసింది. ఇక ఇటీవలే ఇంజినీరింగ్‌ విభాగంలో మాస్టర్స్‌ పట్టా కూడా అందుకుందీ బాల మేధావి.


‘నాసా’లో చేరతా!

తన అద్భుతమైన ఐక్యూతో మానసిక సమస్యను సైతం జయించి దూసుకుపోతోన్న అధారా.. భవిష్యత్తులో నాసాలో చేరి వ్యోమగామిగా స్థిరపడాలని కలలు కంటోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ప్రతిభను మెచ్చి, తన మనసులోని కోరికను తెలుసుకున్న అరిజోనా యూనివర్సిటీ, రైస్‌ యూనివర్సిటీలు గతంలో తమ వద్ద ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌.. వంటి కోర్సులు చదివే అవకాశం కూడా ఇచ్చాయి. ప్రస్తుతం ‘మెక్సికన్‌ స్పేస్‌ ఏజెన్సీ’తో కలిసి పనిచేస్తోన్న అధారా.. ఔత్సాహిక యువ విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన, గణితం.. వంటి అంశాల్లో పట్టు సాధించేందుకు దిశానిర్దేశం చేస్తోంది.

‘మీకు అనువుగాని చోట ఉండి బాధపడే కంటే.. సౌకర్యవంతంగా అనిపించిన చోటికి మారి లక్ష్యాల్ని సాధించేందుకు కృషి చేయండి.. అంతేకానీ కలల్ని మాత్రం వదులుకోవద్దు..’ అంటూ తన మాటలతో మానసిక, శారీరక లోపాలున్న వారిలో స్ఫూర్తి నింపుతోంది అధారా. అంతరిక్షంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతోన్న ఈ చిన్నది.. భవిష్యత్తులో మార్స్ పైన అడుగిడతానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

తన జీవితంలో తనకెదురైన అనుభవాలతో ‘Do Not Give Up’ అనే పుస్తకం రాసిన ఈ మెక్సికన్ అమ్మాయి.. మంచి వక్త కూడా! గతంలో ఫోర్బ్స్ మెక్సికో ప్రకటించిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది అధారా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్