Published : 28/09/2022 21:26 IST

జుట్టు ఆరోగ్యానికి ఏవి తినాలి? ఏవి తినకూడదు?

ఒత్తైన, నల్లని కురులు కావాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల కేశ సంబంధిత ఉత్పత్తులను కూడా ఆశ్రయిస్తారు. మరోవైపు ఇంటి చిట్కాలూ పాటిస్తుంటారు. ఇన్ని చేసీ.. తీసుకునే ఆహారం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. అవును.. మనం తీసుకునే కొన్ని పదార్థాలు కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో తెలుసుకొని సరైన మార్పులు-చేర్పులు చేసుకుంటేనే కేశ సౌందర్యం ఇనుమడిస్తుందంటున్నారు.

చక్కెర ఎక్కువైతే..!

చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. తద్వారా జుట్టు కుదుళ్లు బలహీనపడి.. ఇది క్రమంగా జుట్టు రాలడానికి దారి తీస్తుంది. అంతేకాదు.. ఇలాంటి ఆహారం కారణంగా కుదుళ్లలో వాపు, పొడిబారిపోవడం, చుండ్రు రావడం.. వంటి సమస్యలూ వస్తాయి. ఇవన్నీ వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీసేవే!

అందుకే మైదా వద్దు!

మైదా, వైట్‌ బ్రెడ్‌, కేక్స్‌, కుకీస్‌.. వంటి గ్లైసెమిక్ ఇండెక్స్‌ అధికంగా ఉన్న పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి ప్రతిబంధకాలుగా మారతాయి. వీటిని అమితంగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్‌ పెరిగిపోవడం, ఆండ్రోజెన్‌ హార్మోన్ల స్థాయులు ఎక్కువవడంతో కుదుళ్లు బలహీనపడతాయి. ఇది క్రమంగా జుట్టు రాలడానికి దారి తీస్తుంది.

ప్రాసెస్డ్‌ ఫుడ్

ప్రాసెస్డ్‌ ఫుడ్, జంక్‌ ఫుడ్‌లో క్యాలరీలు, శ్యాచురేటెడ్‌, మోనో శ్యాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో టెస్టోస్టిరాన్‌తో పాటు డై హైడ్రో టెస్టోస్టిరాన్‌ (పురుష హార్మోన్లు).. వంటి హార్మోన్ల స్థాయులను పెంచుతాయి. ఫలితంగా అలొపేసియా (జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం) లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. ఇవి కుదుళ్లలోని చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేసి కొత్త జుట్టు రాకుండా చేస్తాయి. అందుకే కొంతమంది ఆడవారిలోనూ బట్టతల రావడం గమనించచ్చంటున్నారు నిపుణులు.

గుడ్డులోని తెల్లసొన

గుడ్డులోని ప్రొటీన్‌ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే దీన్ని పచ్చిగా తీసుకోవడం వల్ల బయోటిన్‌ లోపం ఏర్పడుతుందట! జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కెరాటిన్‌ ఉత్పత్తిని పెంచడంలో బయోటిన్‌ విటమిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చి తెల్లసొనలోని అవిడిన్‌ బయోటిన్‌ని శరీరం గ్రహించకుండా చేస్తుందంటున్నారు నిపుణులు. తద్వారా వెంట్రుకల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి గుడ్డును పచ్చిగా తీసుకోకుండా ఉడికించుకొనే తీసుకోవాలంటున్నారు. అప్పుడే అందులోని ప్రొటీన్, ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి.

ఈ పానీయాలు వద్దు!

శీతల పానీయాలను అధికంగా తీసుకుంటే ఊబకాయం, గుండె సమస్యలు, జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో పాటు శిరోజాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌లో ఉండే ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్‌ కురుల కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలిపోయేలా చేస్తుందట. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు నిపుణులు.

ఇవి తినాలి!

❀ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులోని విటమిన్‌ ‘సి’ కొలాజెన్‌ ఉత్పత్తికి, శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

❀ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను తినడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోయి.. ఒత్తైన, నల్లని కురుల్ని పొందచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

❀ చిలగడదుంపల్లో ఉండే విటమిన్‌ ‘ఎ’ కుదుళ్లలో సీబమ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా కుదుళ్లు పొడిబారిపోకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే కేశ సంపదను పెంచడంలోనూ ఈ విటమిన్‌ తోడ్పడుతుంది.

❀ ‘బి’, ‘ఇ’ విటమిన్లతో పాటు జింక్‌, ఇతర అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు నిండిన నట్స్‌ జుట్టు ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. ఇక గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం.

❀ సోయాబీన్స్‌లో ఉండే స్పెర్మిడైన్‌ అనే సమ్మేళనం జుట్టుకు ఆరోగ్యాన్ని అందించడంతో పాటు కేశ సంపదను పెంచుతుంది.

❀ ఆకుకూరల్లో ఫోలేట్‌, ఐరన్‌, ‘ఎ’, ‘సి’ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని