Published : 23/03/2023 00:11 IST

అమ్మగా.. కష్టమే!

నా పాప అధిర పుట్టాక చానాళ్లు కెరియర్‌ను పక్కన పెట్టేశా. తిరిగి నటన ప్రారంభించాక కొన్నిసార్లు తనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అమ్మయ్యాక ప్రతి క్షణం పిల్లల గురించే ఆలోచిస్తుంటాం. వాళ్ల సంరక్షణ గురించే బెంగ. లాక్‌డౌన్‌లో చాలా సమయం దొరికింది. దీంతో ప్రతిక్షణం పాపతోనే గడిపా. తను స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టాకే సవాళ్లు మొదలయ్యాయి. షూటింగ్‌ ఉందని తనని స్కూలు మాన్పించలేను. అలాగని దూరంగా ఉండలేను. నరకంలా అనిపించేది. తర్వాత మనసును దృఢపరచుకోవడం నేర్చుకున్నా. పాపనీ తగ్గట్టుగా సిద్ధం చేశా. దీంతో మా మాధ్య దూరానికి ఆస్కారం ఏర్పడలేదు. చిన్న వయసే అయినా నా పరిస్థితిని అర్థం చేసుకుంటోంది. నేను దగ్గర లేకపోయినా స్కూలుకి చక్కగా వెళ్తోంది. మరి నేనూ తన గురించి ఆలోచించాలిగా! ఏడాదికి ఒక్క సినిమానే ఒప్పుకొంటున్నా. నా రోజులను పక్కాగా ప్రణాళిక వేసుకుంటా. పాపకు వీలైనంత ఎక్కువ సమయం ఇచ్చేలా ప్లాన్‌ చేసుకుంటా. షూటింగ్‌ త్వరగా పూర్తయిందా.. ఆ సమయాన్నీ అధిరకే కేటాయిస్తా. తనతో ఆడతా. హోంవర్క్‌ చేయిస్తా. తన పనులన్నీ దగ్గరుండి చేస్తా. ఒక్కోసారి ఇందుకు వ్యతిరేకంగా షూటింగ్‌ ఆలస్యమవుతుంటుంది. ఇలాంటప్పుడు మనసుకి కష్టంగా అనిపిస్తుంటుంది. అయినా తప్పదు. వర్కింగ్‌ మదర్‌గా త్యాగాలు తప్పవు. పాపను ముందే సిద్ధం చేయడం మంచిదైంది. నేను, మావారు పనితో బిజీగా గడిపేవాళ్లమే! ఈ విషయం తనకు అర్థమై తగ్గట్టుగా ప్రవర్తిస్తోంది. అందుకే ప్రతి తల్లికీ నేను చెప్పేదొకటే. పని, పిల్లల్ని సమన్వయం చేసుకోవడం కష్టమే! అయితే పిల్లలను ముందే సిద్ధం చేయండి. ప్రణాళిక ప్రకారం సాగితే రెండింటి సమన్వయం తేలికవుతుంది! పిల్లలకీ మీకూ మధ్య అనుబంధమూ బీటలు వారదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని